Donald Trump : మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయలేరు: ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!

హార్ముజ్ జలసంధి వ్యవహారంలో ఇరాన్ అనుసరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో స్పందించారు. వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ఈ జలమార్గాన్ని మూసివేస్తామంటూ ఇరాన్ చేస్తున్న ప్రకటనలను ఆయన బ్లాక్‌మెయిల్ రాజకీయాలుగా అభివర్ణించారు.

New Update
Donald Trump

హార్ముజ్ జలసంధి వ్యవహారంలో ఇరాన్ అనుసరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో స్పందించారు. వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ఈ జలమార్గాన్ని మూసివేస్తామంటూ ఇరాన్ చేస్తున్న ప్రకటనలను ఆయన బ్లాక్‌మెయిల్ రాజకీయాలుగా అభివర్ణించారు. ఓవల్ ఆఫీస్ నుండి మాట్లాడిన ట్రంప్..  ఇరాన్ మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయలేదు. గత 47 ఏళ్లుగా వారు చేస్తున్నట్టే ఇప్పుడు కూడా తెలివితేటలు ప్రదర్శించాలని చూస్తున్నారు. కానీ అమెరికా అటువంటి వాటికి లొంగదని స్పష్టం చేశారు.

ట్రంప్ ఆశాభావం

అయితే, ఇరాన్‌తో చర్చలు సానుకూల దిశలోనే సాగుతున్నాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు చివరికల్లా వెల్లడవుతాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అమెరికా నుండి అందిన కొత్త ప్రతిపాదనలను తాము పరిశీలిస్తున్నామని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వెల్లడించింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మధ్యవర్తిత్వంతో అమెరికా ఈ కొత్త ప్రతిపాదనలను పంపిందని, అయితే వీటి విషయంలో తాము ఏమాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. తమ జాతీయ ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది.

హార్ముజ్ జలసంధిపై నియంత్రణను ఇరాన్ సైన్యం మళ్లీ కఠినతరం చేసింది. తమ దేశ నౌకాశ్రయాలకు వచ్చే ఓడలపై అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం ఎత్తివేసే వరకు, జలసంధిలో కఠిన ఆంక్షలు కొనసాగుతాయని ఇరాన్ సైనిక కమాండ్ ప్రకటించింది. అమెరికా తన మాట తప్పిందని, అందుకే తాము మళ్లీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమంతో సహా అన్ని అంశాలపై ఒప్పందం కుదిరే వరకు అమెరికా దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ ఇదివరకే ప్రకటించిన నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

కాగా మరోవైపు అమెరికా తమ మాట తప్పిందని ఆరోపిస్తూ ప్రపంచ దేశాలకు ఎంతో ముఖ్యమైన హోర్ముజ్ జలసంధిపై మళ్లీ కఠినమైన ఆంక్షలు విధిస్తున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) స్పష్టం చేసింది. లెబనాన్‌లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత, శుక్రవారమే ఈ మార్గాన్ని ఇరాన్ తెరిచినప్పటికీ.. అమెరికా విధిస్తున్న నౌకా దళ దిగ్బంధనం కారణంగా పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అమెరికా తన హామీలను నెరవేర్చలేదని, ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని కొనసాగించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ సైనిక కమాండ్ తెలిపింది.

Advertisment
తాజా కథనాలు