Shanghai Marriage Market : ముప్పై దాటినా మీ పిల్లల పెళ్లి కావడం లేదా ? అయితే ‘మ్యారేజ్ మార్కెట్’ గురించి తెలుసా?

మన దేశంలో పిల్లలకు 30 ఏళ్లు దాటినా పెళ్లి కాకపోతే తల్లిదండ్రులకు నిద్రపట్టదు. చైనాలో ఈ టెన్షన్ మరో స్థాయికి చేరుకుంది. అక్కడ తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లిళ్ల కోసం ఏకంగా పార్కులను ‘పెళ్లిళ్ల సంతలు’గా మార్చి సరికొత్త వ్యాపార సంస్కృతికి తెరలేపారు.

New Update
FotoJet - 2026-05-09T174235.641

Shanghai Marriage Market

Shanghai Marriage Market : మన దేశంలో పిల్లలకు ముప్పై ఏళ్లు దాటుతున్నా పెళ్లి కాకపోతే తల్లిదండ్రులకు నిద్రపట్టదు. బంధువులను అడగడం, పురోహితుల చుట్టూ తిరగడం, లేదా మ్యాట్రిమోనీ యాప్స్‌లో రాత్రింబగళ్లు ప్రొఫైల్స్ వెతకడం మనకు అలవాటు. కానీ మన పొరుగు దేశమైన చైనాలో ఈ టెన్షన్ మరో విచిత్రమైన స్థాయికి చేరుకుంది. అక్కడ తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లిళ్ల కోసం ఏకంగా రోడ్డు ఎక్కారు. అవును... పార్కులను ‘పెళ్లిళ్ల సంతలు’గా మార్చేసి సరికొత్త వ్యాపార తరహా సంస్కృతికి తెరలేపారు. దాన్నే చైనాలో "షాంఘై మ్యారేజ్ మార్కెట్" అని పిలుస్తున్నారు.

చైనాలోని అత్యంత సంపన్న నగరమైన షాంఘై మధ్యలో ఉన్న 'పీపుల్స్ పార్క్' (People's Park) ప్రతి శని, ఆదివారాల్లో ఒక వింత ప్రపంచాన్ని తలపిస్తుంది. వారాంతం రాగానే వేలాది మంది వృద్ధులైన తల్లిదండ్రులు ఈ పార్కుకు చేరుకుంటారు. వారి చేతుల్లో రంగురంగుల గొడుగులు ఉంటాయి. ఆ గొడుగులపై తమ పిల్లల బయోడేటా పేపర్లను అతికించి ప్రదర్శనకు పెడతారు. ఈ మార్కెట్ చూడ్డానికి అచ్చం కూరగాయల సంతలా లేదా ఉద్యోగాల మేళాలా కనిపిస్తుంది. ఒక గొడుగు పక్కన మరో గొడుగును వరుసగా అమర్చి, వాటిపై రాసి ఉన్న వివరాల ఆధారంగా తల్లిదండ్రులు అటు ఇటూ తిరుగుతూ తమ పిల్లలకు సరిపోయే జోడీని వెతుకుతుంటారు.

ఈ మ్యారేజ్ మార్కెట్‌లో కేవలం అందం, గుణాలు మాత్రమే కాదు... కఠినమైన అర్హతలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అక్కడ గొడుగులపై ప్రదర్శించే పేపర్లలో యవతీ, యువకుల వివరాలు స్పష్టంగా రాసి ఉంటాయి. వారి వయసు, ఎత్తు, బరువు, చదువు (డిగ్రీ, పీజీ లేదా విదేశీ విద్య), ఉద్యోగం, నెలవారీ జీతం, సొంత ఇల్లు ఉందా? కారు ఉందా? (ఇది చైనాలో పెళ్లికి అత్యంత కీలకం), చైనీస్ రాశి చక్రం తదితర వివరాలన్నీ ఉంటాయి.

ఇక్కడ విచిత్రం ఏంటంటే, అబ్బాయిల కంటే అమ్మాయిల తల్లిదండ్రులే ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. చైనాలో 27 ఏళ్లు దాటిన పెళ్లికాని అమ్మాయిలను "షెంగ్ ను" (Sheng Nu - మిగిలిపోయిన మహిళలు) అని పిలుస్తారు. వీరి చదువు, సంపాదన ఎక్కువగా ఉన్నా కూడా, వయసు పెరిగే కొద్దీ ఈ మార్కెట్‌లో వీరి ప్రొఫైల్స్ విలువ తగ్గుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు.ఈ మార్కెట్‌లో జరిగే అసలు వింత ఏంటంటే... ఇక్కడ వరుడు లేదా వధువు ఎక్కడా కనిపించరు. కేవలం వారి తల్లిదండ్రులు మాత్రమే ఈ క్రయవిక్రయాల్లో పాల్గొంటారు.ఒక ప్రొఫైల్ నచ్చితే, అవతలి తల్లిదండ్రులతో వయసు మళ్లిన తల్లిదండ్రులు బేరసారాలు ఆరంభిస్తారు.

"మీ అబ్బాయి జీతం ఎంత?", "సొంత ఇల్లు షాంఘై నడిబొడ్డున ఉందా లేదా శివార్లలో ఉందా?" వంటి ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేస్తారు. అంతా ఓకే అనుకుంటే, ఇరుపక్షాల తల్లిదండ్రులు తమ పిల్లల ఫోన్ నంబర్లు లేదా చైనా సోషల్ మీడియా యాప్ 'వీచాట్' (WeChat) ఐడీలను మార్చుకుంటారు.ఆ తర్వాతే పిల్లలకు విషయం చెప్పి బలవంతంగా డేటింగ్‌కు పంపుతారు.
 
ఈ వినూత్న సంస్కృతి చైనాలో 2004 ప్రాంతంలో ప్రారంభమై నేటికీ విజయవంతంగా కొనసాగడానికి బలమైన కారణాలు ఉన్నాయి. చైనా యువత ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు, వారానికి 6 రోజులు పని చేస్తుంది (దీన్నే 996 కల్చర్ అంటారు). దీనివల్ల వారికి ప్రేమించడానికి, డేటింగ్ చేయడానికి సమయం దొరకడం లేదు. ఇక  చైనా దశాబ్దాల పాటు అమలు చేసిన 'ఒక్క బిడ్డ' విధానం వల్ల దేశంలో అబ్బాయిల సంఖ్య అమ్మాయిల కంటే కోట్లలో పెరిగిపోయింది. దీనివల్ల అబ్బాయిలకు పెళ్లి సంబంధాలు దొరకడం గగనమైపోయింది. తమ పిల్లలు సమాజంలో ఒంటరిగా మిగిలిపోకూడదనే తాపత్రయంతో వృద్ధ తల్లిదండ్రులు ఈ మార్కెట్‌ను ఒక ఆశ్రయంగా ఎంచుకున్నారు.

 ఇటీవల ఇన్ స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కొందరు యువకులు తమ తల్లిదండ్రులు చేసిన పనులను సరదాగా పంచుకుంటున్నారు. ఒక యువకుడు తన తండ్రితో కలిసి ఈ పార్కుకు వెళ్లినప్పుడు... తండ్రి కేవలం ఒక గంటలోనే వందలాది గొడుగులను స్కాన్ చేసి, మూడు బయోడేటాలను షార్ట్ లిస్ట్ చేశాడట. అందులో ఒక అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి, ఆ అబ్బాయికి తెలియకుండానే మరుసటి రోజు రాత్రికి డిన్నర్ డేట్ కూడా ఫిక్స్ చేసేశాడట.అంతేకాదు, ఈ మార్కెట్‌లో ఇప్పుడు విదేశాల్లో స్థిరపడిన చైనీయుల కోసం "విదేశీ విభాగం" కూడా ఏర్పాటు చేశారు. అంటే అమెరికా, కెనడాల్లో ఉండే చైనీస్ యువతీ యువకుల ప్రొఫైల్స్ ఇక్కడ లభిస్తాయి.

 ప్రపంచం ఎంత డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నా, మ్యాట్రిమోనియల్ యాప్స్ ఉన్నా... చైనా తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల భవిష్యత్తును అల్గారిథమ్స్ చేతిలో పెట్టడానికి ఇష్టపడటం లేదు. నేరుగా తామే రంగంలోకి దిగి, కళ్లారా చూసి, మాట్లాడి సంబంధం ఖాయం చేయడమే నమ్మకమని భావిస్తున్నారు. మన దేశంలో బంధువులు చేసే 'మ్యాచ్ మేకింగ్' పనిని, చైనాలో ఈ 'మ్యారేజ్ మార్కెట్లు' బహిరంగంగా చేస్తున్నాయన్నమాట!

Advertisment
తాజా కథనాలు