/rtv/media/media_files/2026/05/01/iran-2026-05-01-13-07-01.jpg)
అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇరాన్ తన అత్యంత వినాశకరమైన ఆయుధాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. సముద్ర గర్భంలో శత్రువుల నౌకలను, జలాంతర్గాములను చీల్చుకుంటూ వెళ్లే హూట్ టార్పెడో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ నావికాదళ కమాండర్ షహరామ్ ఇరానీ త్వరలో శత్రువులపై కొత్త ఆయుధంతో దాడి చేస్తామని ప్రకటించడంతో, అది ఈ సూపర్‌సోనిక్ టార్పెడోనే అని నిపుణులు అంచనా వేస్తున్నారు.
హూట్ అంటే పర్షియన్ భాషలో తిమింగలం అని అర్థం. రక్షణ రంగ నిపుణుల సమాచారం ప్రకారం, ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అండర్ వాటర్ ఆయుధాల్లో ఒకటి. ఇరాన్ దీనిని 2006లోనే రహస్యంగా పరీక్షించింది. సాధారణ టార్పెడోలు నీటిలో గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే, ఈ హూట్ ఏకంగా గంటకు 360 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో దూసుకుపోగలదు.
నీటి లోపల ఇంత వేగంగా ప్రయాణించడం వెనుక ఒక అద్భుతమైన సాంకేతికత ఉంది. దీనిని సూపర్-కావిటేషన్ అంటారు. ఈ టార్పెడో ప్రయాణించేటప్పుడు తన చుట్టూ ఒక గ్యాస్ బుడగను ఏర్పరుచుకుంటుంది. దీనివల్ల నీటి ఘర్షణ తగ్గి, గాలిలో ప్రయాణించినంత వేగంగా నీటి అడుగున దూసుకుపోతుంది. ఇది నీటిలో ఒక హై-స్పీడ్ రన్ వే నిర్మించుకున్నట్లుగా పనిచేస్తుంది.
బలాలు:
శత్రువు స్పందించే లోపే దాడి చేస్తుంది.
ఇది సుమారు 200 కిలోల కంటే ఎక్కువ పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు.
0ఒకసారి లక్ష్యంపైకి వదిలితే, అది దానంతటదే లక్ష్యాన్ని వేటాడుతుంది.
బలహీనతలు:
దీని రేంజ్ కేవలం 15 కిలోమీటర్లు మాత్రమే. సాధారణ టార్పెడోలు 30 కిలోమీటర్ల వరకు వెళ్లగలవు. అతి వేగం వల్ల, గ్యాస్ బుడగ కారణంగా దీనిలోని సోనార్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవచ్చు, దీనివల్ల కచ్చితమైన లక్ష్యాన్ని చేధించడం సవాలుతో కూడుకున్నది.
అమెరికాకు చెందిన USS అబ్రహం లింకన్ వంటి భారీ యుద్ధనౌకలు అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థలను కలిగి ఉంటాయి. వాటిని ఢీకొట్టాలంటే హూట్ లాంచ్ చేసే వాహనం ఆ యుద్ధనౌకలకు చాలా దగ్గరగా వెళ్లాలి. కానీ అమెరికా క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ నిఘా వలయాన్ని దాటుకుని అంత దగ్గరకు వెళ్లడం దాదాపు ఆత్మహత్యతో సమానమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఆయుధం హోర్ముజ్ జలసంధి వంటి ఇరుకైన ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. అక్కడ భారీ యుద్ధనౌకల కదలికలు పరిమితంగా ఉంటాయి కాబట్టి, ఇరాన్ తన తీరం నుంచి ఈ వేగవంతమైన టార్పెడోలతో మెరుపు దాడి చేసే అవకాశం ఉంది. అందుకే అమెరికా తన యుద్ధనౌకలను ఇటువంటి సున్నితమైన ప్రాంతాల నుంచి కొంత దూరంగా ఉంచుతూ జాగ్రత్తలు తీసుకుంటోంది.
Follow Us