USA : ముగ్గురు స్నేహితులను కాపాడి.. తను మాత్రం తిరిగిరాని లోకాలకు: అమెరికాలో తెలుగు విద్యార్థి మరణం

అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసుకుని, చేతికి పట్టా అందివచ్చిన కొన్ని వారాల్లోనే ఒక తెలుగు విద్యార్థి ఘోర ప్రమాదానికి గురయ్యాడు. స్నేహితుల ప్రాణాలు కాపాడే క్రమంలో తను మాత్రం ఊపిరి వదిలాడు.

New Update
usa

అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసుకుని, చేతికి పట్టా అందివచ్చిన కొన్ని వారాల్లోనే ఒక తెలుగు విద్యార్థి ఘోర ప్రమాదానికి గురయ్యాడు. స్నేహితుల ప్రాణాలు కాపాడే క్రమంలో తను మాత్రం ఊపిరి వదిలాడు. టెక్సాస్, లూసియానా సరిహద్దుల్లో ఉన్న టోలెడో బెండ్ రిజర్వాయర్‌లో మునిగిపోతున్న ముగ్గురు స్నేహితులను రక్షించిన అనురూప్ రెడ్డి కోడూరు (22) అనే భారతీయ విద్యార్థి.. దురదృష్టవశాత్తూ నీటిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మే 29న జరిగింది.

అనురూప్ రెడ్డి టెక్సాస్‌లోని డెంటన్‌ నగరంలో ఉంటూ యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ లో చదువుకున్నాడు. కొద్ది వారాల క్రితమే అతని గ్రాడ్యుయేషన్ పూర్తయింది. ఈ క్రమంలో టోలెడో బెండ్ డ్యామ్ సమీపంలోని స్పిల్‌వే వద్ద స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. అనురూప్ ఈతలో చాలా మంచి నైపుణ్యం ఉన్నవాడు. అక్కడ నీటి ప్రవాహంలో ముగ్గురు స్నేహితులు మునిగిపోతుండటం చూసి, ఏమాత్రం ఆలోచించకుండా వారిని కాపాడటానికి నీటిలోకి దూకాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ ముగ్గురినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు.

చేపల వేట వైరుకు

అయితే, అందరినీ కాపాడిన తర్వాత దురదృష్టవశాత్తూ అనురూప్ కాళ్లు నీటిలో ఉన్న ఒక చేపల వేట వైరుకు చుట్టుకుపోయాయి. దాంతో అతను నీటి ప్రవాహం నుంచి బయటకు రాలేకపోయాడు. నీటి ఉధృతి అతడిని లోపలికి లాగేయడంతో.. సుమారు 20 అడుగుల లోతుకు వెళ్లి ఊపిరాడక చనిపోయాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని గాలించగా, అనురూప్ మృతదేహం లభ్యమైంది. స్థానిక షెరీఫ్ ఆఫీస్ ఈ ప్రమాదాన్ని ధృవీకరిస్తూ మృతుని కుటుంబానికి సంతాపం ప్రకటించింది.

ఈ ఊహించని దారుణంతో అనురూప్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అమెరికా నుండి అతని మృతదేహాన్ని భారతదేశంలోని తల్లిదండ్రుల వద్దకు తీసుకురావడానికి, ఇక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి అతని సోదరుడు ఆశ్రిత్ రెడ్డి కోడూరు ఒక ఫండ్‌రైజర్ (ఆన్‌లైన్ విరాళాల సేకరణ)ను ప్రారంభించాడు. అంతర్జాతీయంగా మృతదేహాన్ని తరలించడానికి, చట్టపరమైన పత్రాల తయారీకి, రవాణాకు చాలా భారీ ఖర్చులు అవుతాయని, దయచేసి సాయం చేయాలని కుటుంబ సభ్యులు నెటిజన్లను కోరుతున్నారు.

Advertisment
తాజా కథనాలు