Passenger jumps : చైన్నై ఎయిర్‌పోర్టులో షాకింగ్‌ ఘటన... ఎమర్జెన్సీ డోర్‌ నుంచి దూకేసిన ప్యాసిండర్‌

షార్జా నుండి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఎయిర్ అరేబియా విమానంలో ఆదివారం తెల్లవారుజామున ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానం రన్‌వేపై ల్యాండ్ కాగానే ఓ ప్రయాణికుడు హఠాత్తుగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరిచి బయటకు దూకేశాడు.

New Update
FotoJet - 2026-05-03T112132.903

Shocking incident at Chennai airport

Passenger jumps : విమాన ప్రయాణాల్లో ప్రయాణికుల వింత ప్రవర్తనలు, భద్రతా నిబంధనల ఉల్లంఘనలు ఈ మధ్యకాలంలో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా చెన్నై, న్యూజెర్సీలలో జరిగిన రెండు వేర్వేరు ఘటనలు విమానాశ్రయ వర్గాల్లో కలకలం సృష్టించాయి.  

చెన్నైలో ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకేసిన ప్రయాణికుడు

షార్జా నుండి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఎయిర్ అరేబియా విమానంలో ఆదివారం తెల్లవారుజామున ఒక ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. విమానం రన్‌వేపై ల్యాండ్ అయి, పార్కింగ్ బే వైపు ట్యాక్సీవేపై కదులుతుండగా.. పుదుక్కోట్టై జిల్లాకు చెందిన ఒక ప్రయాణికుడు హఠాత్తుగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరిచి బయటకు దూకేశాడు. దీనిని గమనించిన పైలట్ వెంటనే గ్రౌండ్ సెక్యూరిటీని అప్రమత్తం చేయడంతో, CISF సిబ్బంది వెంటనే స్పందించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో, సదరు ప్రయాణికుడు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నట్లు తెలిసింది. విమానంలో ఉన్నప్పుడే అతడు రెండు సార్లు వాంతులు చేసుకున్నాడని, విమానం ఆగిన వెంటనే అసౌకర్యానికి గురై ఈ వికారం నుంచి తప్పించుకోవడానికి కంగారులో డోర్ తెరిచి దూకేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటన కారణంగా భద్రతా కారణ దృష్ట్యా ప్రధాన రన్‌వేను ఒక గంట పాటు మూసివేసి, విమానాలను ప్రత్యామ్నాయ రన్‌వేకు మళ్లించారు.

కాక్‌పిట్‌లోకి చొరబడే ప్రయత్నం.. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో అలజడి

మరో ఘటనలో, డొమినికన్ రిపబ్లిక్ నుండి న్యూజెర్సీలోని నెవార్క్ లిబర్టీ విమానాశ్రయానికి వస్తున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఒక ప్రయాణికుడు తీవ్ర గందరగోళం సృష్టించాడు. విమానం గాల్లో ఉండగానే, గమ్యస్థానానికి చేరుకోవడానికి కొద్ది నిమిషాల ముందు ఒక ప్రయాణికుడు నియంత్రణ కోల్పోయి విమాన సిబ్బందిపై దాడికి దిగాడు. అంతటితో ఆగక, నిషేధిత ప్రాంతమైన కాక్‌పిట్‌లోకి చొరబడటానికి ప్రయత్నించాడు. దీంతో విమానంలో ఒక్కసారిగా అత్యవసర పరిస్థితి (Emergency) నెలకొంది. తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి అతడిని ల్యాండింగ్ అయ్యే వరకు గట్టిగా బంధించి ఉంచారు. విమానం కిందకు దిగిన వెంటనే పోర్ట్ అథారిటీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని భావించిన పోలీసులు, అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ రెండు ఘటనలు విమానయాన భద్రతపై మళ్లీ చర్చకు దారితీశాయి. ఒకవైపు అనారోగ్య కారణాలతో ప్రయాణికుడు చేసిన పని వల్ల విమాన కార్యకలాపాలకు అంతరాయం కలగగా, మరోవైపు ఉద్దేశపూర్వకంగా కాక్‌పిట్‌లోకి చొరబడే ప్రయత్నం విమానంలోని వందలాది మంది ప్రాణాలను పణంగా పెట్టినట్లయింది. ప్రయాణికుల ప్రవర్తనపై విమానయాన సంస్థలు మరింత నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని ఈ ఘటనలు గుర్తుచేస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు