/rtv/media/media_files/2026/05/25/russia-ukraine-war-explainer-2026-05-25-17-22-54.jpg)
RUSSIA - UKRAINE WAR EXPLAINER
RUS UKRAINE : ఉక్రెయిన్ సరిహద్దుల్లో మళ్లీ రక్తం ఏరులై పారుతోంది. రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై చరిత్రలోనే ఎన్నడూ లేనంత భీకర దాడులతో విరుచుకుపడింది. ఈసారి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 90 క్షిపణులు, 600 డ్రోన్లతో దాడి చేసింది. దాదాపు నాలుగేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధ చరిత్రలో.. ఇదే అతిపెద్ద, అత్యంత ఘోరమైన దాడుల్లో ఒకటి. ఈ పెను విలయంలో ఇప్పటివరకు నలుగురు అమాయక ప్రజలు మృతి చెందగా.. వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడుల తీవ్రత చూస్తే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు ఖార్కివ్, ఒడెస్సా, డ్నిప్రో, జపోరిజ్జియా వంటి ప్రధాన నగరాల్లో ఒకేసారి భూకంపం వచ్చినట్లు భారీ పేలుళ్లు సంభవించాయి. రష్యా సైన్యం ఈసారి నివాస ప్రాంతాలను మాత్రమే కాకుండా ఉక్రెయిన్‌ను పూర్తిగా అంధకారంలోకి నెట్టేసే వ్యూహాత్మక స్థావరాలను టార్గెట్ చేసింది. పవర్ స్టేషన్లు.. ఆయిల్ డిపోలు.. మిలిటరీ స్థావరాలు.. కమ్యూనికేషన్ సెంటర్లపై రష్యా మిస్సైళ్లు భీకరదాడి చేశాయి. ఈ దెబ్బకు చాలా ప్రాంతాల్లో గ్రిడ్లు దెబ్బతిని విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. నగరాలకు నగరాలే చీకట్లో మునిగిపోయాయి. తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ప్రాణభయంతో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్లు, బంకర్లలోకి పరుగులు తీశారు.
ఇక సరికొత్త వ్యూహాంతో ఉక్రెయిన్‌పై రష్యా ఒకేసారి 600 డ్రోన్లను ప్రయోగించింది. ఈసారి కేవలం క్షిపణులపైనే కాకుండా.. ప్రధానంగా డ్రోన్ వార్‌పైనే కంప్లిట్ ఫోకస్ పెట్టింది. ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను పూర్తిగా స్తంభింపజేయడమే లక్ష్యంగా ఒకేసారి వందల సంఖ్యలో ఆత్మాహుతి డ్రోన్లు పంపింది. మిలిటరీ ప్రపంచంలో దీనినే స్వార్మ్ అటాక్ అంటారు. ఉక్రెయిన్ దగ్గర అమెరికా, నాటో దేశాలు ఇచ్చిన 'పేట్రియాట్' లాంటి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. వాటిని నేరుగా దాటడం రష్యా మిస్సైళ్లకు కూడా కొంత కష్టమే. అందుకే రష్యా ముందుగా చాలా చౌకైన, ఇరాన్ టెక్నాలజీతో తయారైన వందలాది ఆత్మాహుతి డ్రోన్లను గుంపులు గుంపులుగా ఉక్రెయిన్ ఆకాశంలోకి వదిలింది. ఈ వందలాది డ్రోన్లు ఒకేసారి కనిపించగానే ఉక్రెయిన్ రాడార్లు, రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకోవడంలో బిజీ అయ్యాయి. ఆ డ్రోన్లను అడ్డుకునే క్రమంలో ఉక్రెయిన్ సైన్యం తమ దగ్గరున్న పరిమితమైన, అత్యంత ఖరీదైన ఇంటర్‌సెప్టర్ క్షిపణులన్నింటినీ వాడేసి ఖాళీ చేసుకుంది. ఇలా ఉక్రెయిన్ రక్షణ కవచం బలహీనపడగానే.. రష్యా అసలు సిసలైన హైస్పీడ్ మిస్సైళ్లు, ఒరెష్నిక్ లాంటి ప్రమాదకర క్షిపణులను రంగంలోకి దించింది. రక్షణ క్షిపణులు లేకపోవడంతో రష్యా మిస్సైళ్లు నేరుగా వెళ్లి ఉక్రెయిన్ పవర్ గ్రిడ్లను, మిలిటరీ స్థావరాలను ముక్కలు చేశాయి. శత్రువును ఆర్థికంగా, ఆయుధాల పరంగా దివాలా తీయించి.. ఆపై కోలుకోలేని దెబ్బతీయడమే రష్యా పక్కాగా అమలు చేసిన సరికొత్త యుద్ధ వ్యూహం.
అయితే, ఈ దాడుల్లో రష్యా ఉపయోగించిన మోస్ట్ పవర్ ఫుల్ మిస్సైల్ ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఉక్రెయిన్‌పై దాడిలో రష్యా అత్యంత భయంకరమైన హైపర్‌సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ ఒరెష్నిక్‌ను ప్రయోగించింది. రష్యా అమ్ములపొదిలో ఉన్న అత్యంత నూతన, విధ్వంసకర ఆయుధాల్లో ఇదొకటి. దీని ప్రత్యేకత ఏంటంటే.. సంప్రదాయ బాంబులతో పాటు.. అవసరమైతే అణ్వస్త్రాలను కూడా మోసుకెళ్తుంది. గంటకు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ హైపర్‌సోనిక్ క్షిపణిని గాల్లోనే గుర్తించడం, ఆధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌తో అడ్డుకోవడం అసాధ్యమని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇది ఆకాశంలోకి వెళ్లిన తర్వాత విడిపోయి, ఒకేసారి బహుళ లక్ష్యాలపై ఉల్కల లాగా దూసుకెళ్లి దాడి చేస్తుంది.
కీవ్‌లోని బిలా జెర్‌క్వా సిటీపై ఈ ఒరెష్నిక్ మిస్సైల్‌ని ప్రయోగించింది రష్యా. ఈ మిస్సైల్ పడటంతో ఆ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. చుట్టుపక్కల ఉన్న అనేక ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు రాత్రికి రాత్రే శిథిలాలుగా మారిపోయాయి. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. అక్కడి విదేశాంగ మంత్రిత్వ శాఖ, మ్యూజియంల శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా స్థలంలో అత్యవసర సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమించి మృతదేహాలను, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.
ఈ దాడిపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా స్పందించింది. తామే ఒరెష్నిక్‌ను ప్రయోగించామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై తమ ప్రత్యేక సైనిక ఆపరేషన్లు అనుకున్న వ్యూహం ప్రకారమే కొనసాగుతాయని చెప్పింది. ఉక్రెయిన్‌ను లొంగదీసుకోవడానికి అవసరమైతే ఇంకా భారీ హైపర్‌సోనిక్ మిస్సైళ్లతో దాడులు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించింది.
ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఒరెష్నిక్‌ను రష్యా ఉపయోగించడం ఇది మూడోసారి. రష్యా ఈ బ్రహ్మాస్త్రాన్ని చాలా జాగ్రత్తగా, వ్యూహాత్మక సమయాల్లో మాత్రమే వాడుతోంది. మొదటిసారి- 2024 నవంబరులో ఉక్రెయిన్ నీప్రో సిటీపై ఈ మిస్సైల్‌ను తొలిసారి ప్రయోగించింది. ఆ తర్వాత, ఈ ఏడాది జనవరిలో వెస్ట్ ఉక్రెయిన్ 'లవీవ్' ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ రెండోసారి వినియోగించింది. ఇప్పుడు మూడోసారి, ఏకంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ మిస్సైల్‌తో విరుచుకుపడింది. దీంతో రష్యా ఈ యుద్ధాన్ని మరింత ప్రమాదకర స్థాయికి తీసుకెళ్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఉక్రెయిన్ సైన్యం కూడా రష్యాపై ప్రతిదాడికి దిగింది. తమకున్న అమెరికన్ పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌తో రష్యాకు చెందిన చాలా డ్రోన్లను, కొన్ని మిస్సైళ్లను గాల్లోనే విజయవంతంగా కూల్చివేసినట్టు జెలెన్‌స్కీ ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. ఒక్క రాత్రిలోనే ఏకంగా 600 డ్రోన్లు, 90 క్షిపణులు తుఫాన్‌లా ముంచెత్తడంతో.. ఉక్రెయిన్ రక్షణ కవచం కొన్ని చోట్ల పూర్తిగా విఫలమైంది. కొన్ని కీలక వ్యూహాత్మక ప్రాంతాల్లో, పవర్ గ్రిడ్ల వద్ద రష్యా అనుకున్న నష్టం జరిగిపోయింది. ఆర్థికంగా, మానసికంగా ఉక్రెయిన్‌ను దెబ్బతీయడంలో రష్యా సఫలమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి వెనుక అంతర్జాతీయ రాజకీయ వ్యూహం కూడా ఉందని రక్షణ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల అమెరికాతో పాటు వెస్ట్రన్ కంట్రీస్ ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని భారీగా పెంచడమే కాకుండా.. తమ లాంగ్ రేంజ్ మిస్సైళ్లను రష్యా భూభాగంపైకి ప్రయోగించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇది పుతిన్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీనికి తోడు, రష్యా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 'విక్టరీ డే' వేడుకలను భగ్నం చేయడానికి ఉక్రెయిన్ డ్రోన్లతో ప్రయత్నించిందనే కోపం కూడా ఉంది. అందుకే పుతిన్, ఉక్రెయిన్‌పై ఈ భీకర దాడులకు ఆర్డర్ ఇచ్చారు.
దీంతో ప్రపంచ దేశాలకు మళ్లీ టెన్షన్ మొదలైంది. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న హైపర్‌సోనిక్ క్షిపణిని రష్యా ఇలా ఓపెన్‌గా వాడటం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే ఒకవైపు మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తుంటే.. మరోవైపు యూరప్ నడిబొడ్డున యుద్ధం ఈ స్థాయికి చేరడం గ్లోబల్ ఎకానమీని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయి. గ్యాస్ సరఫరా నిలిచిపోతుందనే భయంతో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో పడుతున్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు మళ్లీ సంక్షోభంలోకి వెళ్లే అవకాశం ఉందని ఆందోళనలు పెరుగుతున్నాయి.
మొత్తంగా ఉక్రెయిన్‌ను పూర్తిగా లొంగదీసుకునే వరకు రష్యా ఊరుకోదనేది ఈ దాడితో స్పష్టమవుతోంది. మరి దీనికి ప్రతిగా అమెరికా, వెస్ట్రన్ కంట్రీస్ ఉక్రెయిన్‌కు ఎలాంటి ఆయుధాలు ఇస్తాయి..? ఈ పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా..? అన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది.
Follow Us