Washington Hilton Hotel : నాడు రొనాల్డ్, నేడు డొనాల్డ్...,అదే హోటల్‌..45 సంవత్సరాల తర్వాత సీన్‌ రిపీట్‌

వాషింగ్టన్‌లోని ప్రతిష్టాత్మక 'వాషింగ్టన్ హిల్టన్ హోటల్' మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. దాదాపు 45 ఏళ్ల క్రితం నాటి భయంకరమైన జ్ఞాపకాలను నెమరువేసుకునేలా చేస్తూ జరిగిన కాల్పుల ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

New Update
FotoJet - 2026-04-26T104108.612

Ronald then, Donald now...same hotel...scene repeats after 45 years

Washington Hilton Hotel : వాషింగ్టన్‌లోని ప్రతిష్టాత్మక 'వాషింగ్టన్ హిల్టన్ హోటల్' మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. దాదాపు 45 ఏళ్ల క్రితం నాటి భయంకరమైన జ్ఞాపకాలను నెమరువేస్తూ, తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకే హోటల్.. ఇద్దరు అధ్యక్షులు.. రెండు భారీ దాడులు..అమెరికా భద్రతా చరిత్రలో ఇదొక అరుదైన,ఆందోళనకరమైన యాదృచ్ఛిక ఘటనగా నిలిచిపోయింది.

1981: రోనాల్డ్ రీగన్‌పై ప్రాణాంతక దాడి

 మార్చి 30, 1981..అప్పటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ హిల్టన్ హోటల్‌లో ఒక కార్మిక సంఘం సమావేశాన్ని ముగించుకుని బయటకు వస్తుండగా ఈ దారుణం జరిగింది. జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి కేవలం 2.2 సెకన్ల వ్యవధిలో ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ రీగన్ ఊపిరితిత్తులకు తగిలి గుండెకు అత్యంత సమీపంలో ఆగింది. ఈ దాడిలో ప్రెస్ సెక్రటరీ జేమ్స్ బ్రాడీ తలకు తీవ్ర గాయమై జీవితాంతం పక్షవాతానికి గురయ్యారు. ఈ ఘటన తర్వాతే అమెరికాలో అధ్యక్ష భద్రతా వలయాన్ని (Secret Service) అత్యంత కఠినతరం చేశారు.

2026: డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో కాల్పుల మోత

 ఏప్రిల్ 25, 2026...సరిగ్గా 45 ఏళ్ల తర్వాత, అదే హోటల్ గ్రాండ్ బాల్‌రూమ్‌లో 'వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్' జరుగుతుండగా తుపాకీ శబ్దాలు వినిపించాయి. సుమారు 2,600 మంది అతిథులు ఉన్న సమయంలో హోటల్ లాబీ , బాల్‌రూమ్ వెలుపల 4 నుంచి 6 రౌండ్లు కాల్పులు జరిగాయి. మొదట బాణాసంచా అని భావించినా, ప్రజలు ప్రాణభయంతో బల్లల కింద దాక్కున్న దృశ్యాలు అక్కడ నెలకొన్న భీభత్సాన్ని తెలియజేస్తున్నాయి. కాల్పులు వినబడగానే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు మెరుపు వేగంతో స్పందించి, డొనాల్డ్ ట్రంప్,మెలానియా ట్రంప్‌లను రక్షణ కవచంలా చుట్టుముట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారు. హోటల్ లాబీ వద్దే నిందితుడిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.

చరిత్ర పునరావృతం - భద్రతా లోపమా?

వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌ను ఇప్పుడు "హింక్లీ హిల్టన్" అని కూడా పిలుస్తుంటారు. ఒకే హోటల్‌లో ఇద్దరు అధ్యక్షులపై దాడులు జరగడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. సాధారణంగా అధ్యక్షులు పాల్గొనే కార్యక్రమాల్లో బాల్‌రూమ్‌కు భారీ భద్రత ఉంటుంది, కానీ హోటల్‌లోని ఇతర బహిరంగ ప్రదేశాలను (లాబీ వంటివి) పూర్తిగా మూసివేయరు. ఇదే నిందితులకు వరంగా మారుతోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 1981లో రీగన్ హోటల్ బయట కారు ఎక్కుతుండగా దాడి జరిగితే, 2026లో ట్రంప్ లోపల ఉండగానే దాడి జరిగింది.

అదృష్టవశాత్తూ ఈ దాడిలో డొనాల్డ్ ట్రంప్ క్షేమంగా బయటపడ్డారు. షూటర్‌ను అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని సీక్రెట్ సర్వీస్ ధృవీకరించింది. అయితే, అమెరికా చరిత్రలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే 'వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్' వంటి వేదిక వద్ద కాల్పులు జరగడం భద్రతా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. 45 ఏళ్ల విరామంతో జరిగిన ఈ రెండు సంఘటనలు వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌ను అమెరికా రాజకీయ చరిత్రలో ఒక దురదృష్టకర మైలురాయిగా నిలబెట్టాయి. "మొదట రొనాల్డ్.. ఇప్పుడు డొనాల్డ్" అంటూ సోషల్ మీడియాలో ఈ పోలికలు వైరల్ అవుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు