Bhalendra Shah : నేపాల్ కొత్త పీఎంగా ర్యాపర్.. భారత్ కు ఇబ్బందేనా?

నేపాల్‌లో జెన్- జీ యువత ఆందోళనకు నేతృత్వం వహించిన  కాట్మాండు మాజీ మేయర్‌ బాలేంద్ర షా నేపాల్‌ ప్రధాని కానున్నారు. ఆయన పార్టీ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్పీ) విజయం దిశగా దూసుకుపోతుంది. భారత్ వ్యతిరేకిగా ముద్ర పడ్డ ఆయన వైఖరిపై సర్వత్రా చర్చ నెలకొంది.

New Update
FotoJet (31)

Balen Shah

Bhalendra Shah: హిమలయ దేశంగా పేరుగాంచిన నేపాల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. గత ఏడాది నేపాల్‌లో సోషల్‌ మీడియా మీద నిషేధం విధించిన సమయంలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ జెన్- జీ యువత(Nepal Gen Z protest) చేపట్టిన ఆందోళనలతో ఆ దేశం సంక్షోభంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. యువత ఆందోళనతో  ఆ దేశ అధ్యక్షుడు, ప్రధాన మంత్రి తమ పదవులను వదులుకోవలసి వచ్చింది. అయితే  ఆ ఆందోళనకు నేతృత్వం వహించిన  కాట్మాండు మాజీ మేయర్‌ బాలేంద్ర షా నేపాల్‌ ప్రధానిగా ఎన్నికయ్యేందుకు అవసరమైన మెజార్టీ దిశగా ఆయన పార్టీ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్పీ) దూసుకుపోతుంది. 2022లోనే పురుడు పోసుకున్న ఈ పార్టీని రవి లమిచ్ఛేన్‌ స్థాపించారు. అయితే కాట్మాండు మాజీ మేయర్‌ అయిన బాలేంద్ర షా ఈ ఏడాది జనవరి 18న ఈ పార్టీలో చేరగా ఆ పార్టీ ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. కేవలం రెండు నెలల కాలంలోనే ఆ పార్టీని ఆధికారంలోకి తీసుకురావడం గమనార్హం.

Also Read: ఇవేం ఎండలు బాబోయ్.. ఇక బతికి బయటపడటం కష్టమే!

గత ఏడాది సెప్టెంబర్‌లో సోషల్‌ మీడియాపై నిషేదాన్ని వ్యతిరేకిస్తూ జెన్‌జీ యువత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. రెండురోజుల పాటు దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలతో అట్టుడుకింది. తప్పనిసరి పరిస్థితుల్లో నేపాలీ కాంగ్రెస్‌, సీపీఎన్‌-యూఎంఎల్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం జరిగిన అనేక రాజకీయ పరిణామాల నేపథ్యం మొన్న గురువారం నేపాలి పార్లమెంటుకు ఎన్నికలు(Nepal Elections) జరిగాయి. ఈ ఎన్నికల్లో సంప్రదాయ పార్టీలను నేపాలీ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. నేపాల్‌ పార్లమెంటులో ఉన్న మొత్తం 275 స్థానాల్లో165 సీట్లకు గురువారం ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. తాజా వార్తలు అందే సమయానికి వందకు పైగా చోట్ల ఆర్‌ఎస్‌పీ విజయం దిశగా దూసుకుపోతుంది. 
 
ఎవరీ బాలేంద్ర షా ?

నేపాలీలు బాలెన్‌ షా గా పిలుచుకునే బాలేంద్ర షా మొదటి నుంచి సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్నాడు. 1990, ఏప్రిల్‌ 27న కాట్మాండులోని నరదేవిలో జన్మించిన బాలెన్‌ షా మధేసి సామాజికవర్గానికి చెందినవారు. ర్యాపర్‌ (సంగితకారుడు) గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. నేపాల్‌లోని రాజకీయ, ప్రభుత్వ వర్గాల్లో పేరుకుపోయిన అవినీతిని గురించి తన పాటలతో ఎండగట్టేవారు. గాయకుడిగా ఉంటూనే 2022లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన కాట్మాండు నగర మేయర్‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత దేశంలో పేరుకుపోయిన అవినీతిపై నేపాల్‌ యువత (జెన్‌జీ)లో చర్చను లేవనెత్తి  విపరీతమైన ఆదరణ సంపాదించుకున్నారు. కాట్మాండు నగర మేయర్‌గా ఆయన అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. నాలుగేళ్లపాటు మేయర్‌గా పనిచేసిన ఆయన యువతనుంచి మంచి మద్ధతు సంపాదించుకున్నారు. ఆ సమయంలోనే ఆయనను తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యువత పిలుపునిచ్చినప్పటికీ ఆయన మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ప్రధాని పదవి చేపడతానని తేల్చి చెప్పడం, ఇపుడు అది నిజం కావడం సంచలనమనే చెప్పాలి.

Also Read: నేపాల్ కొత్త పీఎంగా ర్యాపర్.. భారత్ కు ఇబ్బందేనా?

భారత వ్యతిరేకి ?

బాలెన్‌ షా భారత వ్యతిరేకిగా ముద్ర పడ్డారు. తమదేశంలో భారతదేశ ప్రభావం, ఆధిపత్యం ఉండరాదన్నది ఆయన వాదం. నేపాల్‌లో బాలీవుడ్‌ సినిమాలను నిషేధించాలని కూడా ఆయన డిమాండ్‌ చేస్తూ వచ్చారు.ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు, సోషల్ మీడియా పోస్టులు భారత్-నేపాల్ సంబంధాలలో వివాదాలకు దారితీశాయి. ఆయన తీసుకున్న చర్యలు నేపాల్ జాతీయవాదాన్ని ప్రతిబింబిస్తాయి.  "ఆదిపురుష్" చిత్రంలో సీతను భారతీయ కుమార్తెగా పేర్కొనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ, హిందీ చిత్రాల ప్రదర్శనను నేపాల్‌లో నిలిపివేయడం వివాదాస్పదమైంది.ఆయన చర్యలు నేపాల్‌లో యువత ఆదరణ పొందినా, భారత్‌తో సంబంధాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శకులు భావిస్తారు.అయితే, ఆయన తన నిర్ణయాలను నేపాల్ సార్వభౌమాధికారానికి సంబంధించినవిగా పేర్కొంటారు, ప్రత్యక్ష భారత వ్యతిరేకతగా కాదు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం పట్ల ఆయన వైఖరి ఎలా ఉంటుందనేది భవిష్యత్తులో తేలనుంది.

విజయం దిశగా అడుగులు

జెన్‌జీ యువత ఆందోళన తర్వాత జరిగిన తొలిసారి జరిగిన ఈ ఎన్నికల్లో బాలెన్‌ షా నేతృత్వం వహిస్తున్న రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్పీ) విజయం దిశగా అడుగులు వేస్తోంది. నేపాల్‌ రాజ్యాంగం ప్రకారం ఆ దేశ పార్లమెంటులో 275 సీట్లు ఉన్నాయి. అయితే, దేశంలో ప్రత్యక్ష ఎన్నికలు జరిగేది మాత్రం 165 సీట్లకు మాత్రమే. ఈ సీట్లకు ప్రజలు ఎంపీలను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. మిగిలిన 110 సీట్లను అనుపాత ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకుంటారు. అంటే పోలింగ్‌ కేంద్రంలో ప్రతి ఓటరుకు రెండు బ్యాలెట్‌ పేపర్లు ఉంటాయి. ఒకటి అభ్యర్థులకు చెందింది. అంటే వారు అభ్యర్థుల్లో నచ్చిన వ్యక్తికి ఓటరు ఓటు వేయవచ్చు. మరొక బ్యాలెట్‌ పార్టీలకు సంబంధించింది. ఓటరు ఏదో ఒక పార్టీకి ఓటు వేస్తారు. దేశవ్యాప్తంగా ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల ఆధారంగా ఈ 110 సీట్లను పంచుతారు. అలా ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రస్తుతం ఆర్‌ఎస్పీ వందకు పైగా సీట్లతో ఆధిపత్యం కొనసాగిస్తోంది.

Advertisment
తాజా కథనాలు