Norway Chess 2026 : నార్వే చెస్‌లో సరికొత్త చరిత్ర... టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద

భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్‌. ప్రజ్ఞానంద చదరంగ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'నార్వే చెస్ 2026' టోర్నమెంట్‌ క్లాసిక్ విభాగంలో టైటిల్‌ను కైవసం చేసుకుని, ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డులకెక్కాడు.

New Update
FotoJet - 2026-06-06T110109.647

Praggnanandhaa Norway Chess title

Norway Chess 2026 : భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్‌. ప్రజ్ఞానంద చదరంగ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'నార్వే చెస్ 2026' టోర్నమెంట్‌ క్లాసిక్ విభాగంలో టైటిల్‌ను కైవసం చేసుకుని, ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, యువ సంచలనం గుకేశ్‌ల వల్ల కూడా సాధ్యం కాని ఈ అరుదైన నార్వే టైటిల్‌ను 20 ఏళ్ల ప్రజ్ఞానంద తన వశం చేసుకోవడం విశేషం. ఈ అద్భుత విజయంతో భారత క్రీడా ప్రపంచంలో ప్రజ్ఞానంద పేరు మారుమోగిపోతోంది.

టోర్నమెంట్ చివరిదైన పదో రౌండ్‌లో ప్రజ్ఞానంద జర్మనీ క్రీడాకారుడు విన్సెంట్ కీమర్‌పై పట్టువిడవకుండా ఆడి అద్భుత విజయం సాధించాడు. ఈ రౌండ్‌కు ముందు 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న ప్రగ్.. చివరి మ్యాచ్ గెలుపుతో మరో 3 పాయింట్లను తన ఖాతాలో వేసుకుని మొత్తం 18 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. అంతవరకు 15.5 పాయింట్లతో టాప్‌లో ఉన్న అమెరికన్ గ్రాండ్ మాస్టర్ వెస్లీ సీ.. చివరి రౌండ్‌లో ఫ్రాన్స్ ఆటగాడు అలీరెజాతో మ్యాచ్‌ను డ్రా చేసుకోవడంతో 17 పాయింట్లకే పరిమితమయ్యాడు. దీంతో ఒక పాయింట్ ఆధిక్యంతో ప్రజ్ఞానంద ఛాంపియన్‌గా అవతరించాడు.

నార్వే చెస్ టోర్నీలో ప్రజ్ఞానంద పాల్గొనడం ఇది కేవలం రెండోసారి మాత్రమే. అయినప్పటికీ, ఏడుసార్లు ఈ టోర్నీ విజేతగా నిలిచిన ప్రపంచ నంబర్ 1 ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఈ టోర్నీలో ప్రజ్ఞానంద రెండుసార్లు ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నిజానికి ఈ టోర్నమెంట్ తొలి ఆరు రౌండ్లలో మూడింటిలో ఓడిపోయి ప్రజ్ఞానంద కాస్త వెనుకబడినప్పటికీ, టోర్నీ ద్వితీయార్థంలో అసాధారణమైన రీతిలో పుంజుకున్నాడు. వరుసగా నాలుగు విజయాలు నమోదు చేస్తూ హేమాహేమీలను వెనక్కి నెట్టి ట్రోఫీని కైవసం చేసుకున్నాడు.

భారత్‌కే చెందిన మరో స్టార్ గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్‌కు ఈ టోర్నీలో ఆశించిన ఫలితాలు దక్కలేదు. చివరి రౌండ్‌లో మాగ్నస్ కార్ల్‌సన్‌తో జరిగిన మ్యాచ్‌లో గుకేశ్ ఓటమిపాలయ్యాడు. టోర్నమెంట్ అంతటా ఒడిదొడుకులు ఎదుర్కొన్న గుకేశ్ చివరకు 8 పాయింట్లతో టేబుల్‌లో చివరి స్థానానికి పరిమితమయ్యాడు. 2013లో ప్రారంభమైన నార్వే చెస్ టోర్నమెంట్‌లో సాధారణంగా కార్ల్‌సన్ ఆధిపత్యం ఎక్కువగా ఉండేది, కానీ ఈసారి మాత్రం భారత యువ కిరణం ప్రగ్ తన మేధస్సుకు పదునుపెట్టి విజేతగా నిలిచాడు.

గౌతమ్ అదానీ అభినందనల వర్షం

ప్రజ్ఞానంద సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజ్ఞానందకు అఫీషియల్ స్పాన్సర్‌గా ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్త, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా అభినందించారు. "నిర్భయంగా, ఏకాగ్రతతో సిసలైన భారత ఛాంపియన్‌గా నిలిచావు. చెస్ ప్రపంచంలో సహనం, మేధస్సు, మానసిక దృఢత్వానికి ఇదొక అత్యున్నత పరీక్ష. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వేదికపై అత్యుత్తమ ఆటగాళ్లను ఓడించడం అద్భుతమైన ఘనత. నీ ఆటతీరుతో దేశం గర్వపడేలా చేశావు ప్రగ్" అంటూ అదానీ కొనియాడారు.

Advertisment
తాజా కథనాలు