Russia : మూడు దశాబ్దాల తర్వాత సముద్రంలోకి రష్యా మహా యుద్ధనౌక..వణికిపోతున్న నాటో దేశాలు!

రష్యా అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక ఇప్పుడు మళ్లీ సముద్రపు అలలను చీల్చుకుంటూ దూసుకుపోవడానికి సిద్ధమవుతోంది. అణుశక్తితో నడిచే కిరోవ్ క్లాస్‌కు చెందిన అడ్మిరల్ నఖిమోవ్ అనే ఈ భారీ క్రూజర్ యుద్ధనౌక సుదీర్ఘ నిరీక్షణ ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది.

New Update
russia

దాదాపు ముప్పై ఏళ్ల పాటు సైలెంట్‌గా ఉండిపోయిన రష్యా అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక ఇప్పుడు మళ్లీ సముద్రపు అలలను చీల్చుకుంటూ దూసుకుపోవడానికి సిద్ధమవుతోంది. అణుశక్తితో నడిచే కిరోవ్ క్లాస్‌కు చెందిన అడ్మిరల్ నఖిమోవ్ అనే ఈ భారీ క్రూజర్ యుద్ధనౌక సుదీర్ఘ నిరీక్షణ ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది. సుమారు 27 సంవత్సరాల పాటు డ్రై డాక్‌కే పరిమితమైన ఈ యుద్ధనౌక, ఎట్టకేలకు తిరిగి సముద్రంలోకి అడుగుపెట్టేందుకు ముందడుగు వేసింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఈ నౌక చివరి దశ సముద్ర పరీక్షల గుండా వెళ్తోంది. ఈ భారీ నౌక సామర్థ్యాన్ని, ఇందులో అమర్చిన ఆధునిక సిస్టమ్స్‌ను పరీక్షించడానికి ఈ ట్రయల్స్ ఎంతో కీలకం.

సోవియట్ యూనియన్ కాలంలో తయారైన ఈ భారీ వార్‌షిప్‌ను ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నావికాదళ నౌకల్లో ఒకటిగా పరిగణించేవారు. ఇప్పుడు రష్యా దీనికి సరికొత్త ఆయుధ సంపత్తిని, అత్యాధునిక రాడార్లను, అప్‌డేటెడ్ టెక్నాలజీని అమర్చి మళ్లీ రంగంలోకి దించుతోంది. ఒకవేళ అడ్మిరల్ నఖిమోవ్ ఈ సముద్ర పరీక్షల్లో విజయవంతంగా పాస్ అయితే, అది రష్యా నావికాదళ బలాన్ని ఒక్కసారిగా అమాంతం పెంచేస్తుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ప్రపంచ దేశాల మధ్య ఉన్న శక్తి సమతుల్యతను కూడా ఇది మార్చేసే అవకాశం ఉంది.

రష్యా తన నావికాదళాన్ని మరింత ఆధునికంగా, శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా మార్చే పనిలో పడింది. ఇందులో భాగంగానే ఈ భారీ యుద్ధనౌకలో అత్యాధునిక ఆయుధాలను అమరుస్తున్నారు. ప్రమాదకరమైన జిర్కాన్ హైపర్సోనిక్ మిసైళ్లతో పాటు, ఓనిక్స్, కాలిబర్ క్రూయిజ్ మిసైళ్లను కూడా ఇందులో పెట్టబోతున్నారు. ఈ సరికొత్త ఆయుధాలు తోడవడంతో సముద్రంపై రష్యా దాడి చేసే శక్తి మరింత పెరుగుతుందని ఆర్మీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఆర్కిటిక్ ప్రాంతంలో దీని ఉనికి రష్యాకు వ్యూహాత్మకంగా పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.

యుద్ధనౌక పెద్ద సవాలుగా

నాటో కూటమికి చెందిన ఉత్తర సరిహద్దు దేశాలకు ఈ కొత్త యుద్ధనౌక ఒక పెద్ద సవాలుగా మారబోతోంది. దీని మోహరింపు వల్ల ఆయా ప్రాంతాల్లో భద్రతా సమీకరణాలు మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ నౌక ఇప్పుడే పూర్తిగా యుద్ధానికి సిద్ధం కాలేదు. ఇంకా సాంకేతిక పరీక్షలు, తుది ఏర్పాట్లు బాకీ ఉండటం వల్ల 2027 కంటే ముందు ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం పాశ్చాత్య దేశాల దృష్టి అంతా ఉక్రెయిన్ యుద్ధంపైనే ఉండగా, రష్యా మాత్రం చాలా సైలెంట్‌గా ఆర్కిటిక్ ప్రాంతంలో తన సైనిక పట్టును, ప్రభావాన్ని పెంచుకుంటూ పోతోంది.

Advertisment
తాజా కథనాలు