/rtv/media/media_files/2026/06/09/jaac-protests-over-reservations-2026-06-09-08-37-19.jpg)
Jaac Protests Over Reservations
PoK : పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) మళ్లీ తీవ్ర హింసాత్మక నిరసనలతో అట్టుడుకుతోంది. పాకిస్తాన్ పాలకుల ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు, నిరసనకారులు పెద్దఎత్తున వీధుల్లోకి రావడంతో పీఓకే రణరంగంగా మారింది. నిరసనకారులకు, పాక్ భద్రతా దళాలకు మధ్య జరిగిన భీకర ఘర్షణల్లో, పోలీసుల కాల్పుల్లో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోగా, 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) పీఓకే వ్యాప్తంగా జూన్ 9న పూర్తి స్థాయి బంద్ (లాక్‌డౌన్) కు పిలుపునివ్వడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పీఓకేలో త్వరలో (జూలై 27న) శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, అక్కడి అసెంబ్లీలోని మొత్తం 45 స్థానాలకు గాను.. పాకిస్తాన్‌లో నివసిస్తున్న కశ్మీర్ శరణార్థులకు 12 స్థానాలను ప్రత్యేకంగా రిజర్వ్ చేయడాన్ని జేఏఏసీ (JAAC) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ స్థానాల్లో పోటీ చేసేవారెవరూ స్థానికంగా ఉండరని, అంతా పాకిస్తాన్‌లోనే నివసిస్తారని నిరసనకారులు వాదిస్తున్నారు. పీఓకే స్వతంత్ర ప్రతిపత్తిని అణచివేసి, తమ ప్రాంతాన్ని పూర్తి నియంత్రణలోకి తెచ్చుకోవడానికే పాక్ కేంద్ర ప్రభుత్వం ఈ అడ్డదారుల రిజర్వేషన్లను తీసుకొచ్చిందని ఆరోపిస్తున్నారు. దీనికి తోడు పీఓకేలో రోజురోజుకూ దిగజారుతున్న ఆర్థిక స్థితిగతులు, పాక్ పాలకుల పరిపాలనా అసమర్థతపై కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ రిజర్వేషన్ల వివాదం నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పీఓకేలో ఉద్రిక్తతలు సాగుతున్నాయి. పీఓకేలోని రావాల్‌కోట్ ఆసుపత్రిలో ఉన్న తమ కార్యకర్త మృతదేహాన్ని తీసుకునేందుకు వెళ్లిన జేఏఏసీ నేతలను పాక్ దళాలు అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. సోమవారం నాడు నిరసనకారులు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీస్ అధికారులు, అటుగా వెళ్తున్న ఒక సాధారణ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిస్పందనగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు నిరసనకారులు మరణించారని స్థానిక కమిషనర్ సర్దార్ వహీద్ ఖాన్ ధృవీకరించారు. అంతకుముందు ఆదివారం జరిగిన ఘర్షణల్లో 23 మంది పోలీసులు, 50 మంది నిరసనకారులు గాయపడగా, 30 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ చీఫ్ లియాఖత్ మాలిక్ వెల్లడించారు.
నిరసనలను అణచివేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకేలో సైన్యాన్ని, పారామిలిటరీ దళాలను భారీగా రంగంలోకి దించింది. నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) పై ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద జూన్ 5వ తేదీనే పాక్ అధికారులు నిషేధం విధించారు. అయినప్పటికీ తాము లొంగిపోయే ప్రసక్తే లేదని, తమ హక్కుల కోసం పోరాటం ఆపేది లేదని జేఏఏసీ నేతలు తేల్చి చెప్పారు. ప్రభుత్వం తమపై హింసాత్మక చర్యలకు పాల్పడుతోందని జేఏఏసీ నాయకుడు షౌకత్ నవాజ్ మిర్ మండిపడ్డారు.
పీఓకే వ్యాప్తంగా నిరసనకారుల కదలికలను అడ్డుకోవడానికి పాక్ ప్రభుత్వం టెలికాం సేవలపై నిషేధం విధించింది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడంతో సమాచార వ్యవస్థ స్తంభించిపోయింది. అక్కడ రకరకాల ఆంక్షలు అమల్లో ఉన్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశీయ, విదేశీ పర్యాటకులు ఎవరైనా ఉంటే వారు జూన్ 9వ తేదీలోగా పీఓకే ప్రాంతాన్ని విడిచి వెళ్లాలంటూ స్థానిక యంత్రాంగం ఇప్పటికే అత్యవసర సూచనలు జారీ చేసింది.
పీఓకేలో రోజురోజుకూ ముదురుతున్న హింసాత్మక పరిణామాలపై అంతర్జాతీయ దేశాలు స్పందించాయి. అక్కడ నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడా, ఆస్ట్రేలియా దేశాలు తమ పౌరులను అప్రమత్తం చేశాయి. పీఓకే పరిధిలో మొబైల్ సేవలు పని చేయడం లేదని, ఎక్కడికక్కడ కఠిన ఆంక్షలు ఉన్నాయని తమ పౌరులకు వివరించాయి. అల్లర్లు, హింస మిన్నంటిన పీఓకే ప్రాంతాలకు విదేశీ పౌరులు ఎవరూ వెళ్లవద్దని, ప్రస్తుతానికి ఆయా ప్రాంతాలకు వీలైనంత దూరంగా ఉండాలని కెనడా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు తమ పౌరులను హెచ్చరించాయి.
Follow Us