petrol prices : దిగొచ్చిన సర్కార్ .. లీటరు పెట్రోల్ ధర రూ. 80 తగ్గింపు!

పాకిస్థాన్‌లో పెట్రోల్ ధరలు భారీగా తగ్గాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతున్న ధరలపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పెట్రోల్ ధరను లీటరుకు 80 రూపాయల మేర తగ్గిస్తున్నట్లు ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు.

New Update
petrol

పాకిస్థాన్‌లో పెట్రోల్ ధరలు భారీగా తగ్గాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతున్న ధరలపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పెట్రోల్ ధరను లీటరుకు 80 రూపాయల మేర తగ్గిస్తున్నట్లు ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఈ తగ్గింపుతో ప్రస్తుతం అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 378 రూపాయలకు చేరుకుంది. పెట్రోలియం లెవీలో మార్పులు చేయడం ద్వారా ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

అయితే ఈ ఊరట లభించడానికి సరిగ్గా ఒకరోజు ముందే ఇస్లామాబాద్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచేసింది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగాయని సాకు చూపుతూ పెట్రోల్ ధరను 458.40 రూపాయలకు, డీజిల్ ధరను లీటరుకు 520.35 రూపాయలకు పెంచారు. అంటే డీజిల్ ధరను దాదాపు 54.9 శాతం, పెట్రోల్ ధరను 42.7 శాతం పెంచడం గమనార్హం.

యుద్ధ వాతావరణం వల్ల

అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు నియంత్రణ కోల్పోయాయని, అందుకే ధరల పెంపు అనివార్యమైందని పాక్ పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వైజ్ మాలిక్ వివరణ ఇచ్చారు. గడచిన నెల రోజుల్లోనే ధరలు పెరగడం ఇది రెండోసారి. అంతకుముందు అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో చమురు ధరలను సుమారు 20 శాతం మేర పెంచారు. పాకిస్థాన్ తన చమురు అవసరాల కోసం సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలపై ఎక్కువగా ఆధారపడటం వల్ల అంతర్జాతీయంగా వచ్చే చిన్న మార్పు కూడా ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఈ అమాంతం పెరిగిన ధరల వల్ల పాకిస్థాన్ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కట్టడమే కాకుండా, ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న తమపై ఇలాంటి భారం వేయడం సరికాదని ప్రజలు నిరసనలకు దిగారు. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడిని గమనించిన ప్రభుత్వం, ధరను తగ్గించడంతో పాటు కొన్ని ఉపశమన చర్యలను కూడా ప్రకటించింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు ఊరటనిస్తూ, నెలకు 20 లీటర్ల వరకు పెట్రోల్‌పై లీటరుకు 100 రూపాయల సబ్సిడీని ఇస్తామని ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ తెలిపారు. ఈ రాయితీ పథకం మూడు నెలల పాటు అమల్లో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు