Pentagon : ఇరాన్‌పైకి ఇప్పటివరకు 850కిపైగా తోమహాక్‌ క్షిపణుల ప్రయోగం..పెంటగాన్ ఆందోళన

ఇరాన్‌ పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు మొదలు పెట్టిన దాడులు నెలరోజులకు చేరుకున్నాయి. నెలరోజుల్లో అమెరికా 850కుపైగా తోమహాక్‌ క్షిపణులను ప్రయోగించింది. అయితే యుద్ధంకోసం ఇంత భారీఎత్తున క్షిపణులను వినియోగించడంపై కొంతమంది పెంటగాన్‌ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

New Update
iran

Israel attack on Iran

Pentagon : ఇరాన్‌ పై అమెరికా- ఇజ్రాయెల్ బలగాలు మొదలు పెట్టిన దాడులు నెలరోజులకు చేరుకున్నాయి. వాటికి ధీటుగా ఇరాన్‌ సమాధానం ఇస్తూనే ఉంది. యుద్ధం ప్రారంభమై నెల రోజులు అయినప్పటికీ ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. పైగా రోజురోజుకు యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఈ క్రమంలో పెంటగాన్‌ అధికారులు కీలక ప్రకటన చేశారు. అంతేకాదు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అదేంటంటే యుద్ధం ప్రారంభించిన నాటి నుంచి నేటివరకు నెలరోజుల్లో అమెరికా 850కుపైగా తోమహాక్‌ క్షిపణులను ప్రయోగించినట్లు వెల్లడించారు. అయితే ఒక యుద్ధం కోసం ఇంత భారీ ఎత్తున క్షిపణులను వినియోగించడం పై కొంతమంది పెంటగాన్‌ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో మరిన్ని తోమహాక్‌ క్షిపణులను ఎలా అందుబాటులోకి తీసుకురావాలనే దానిపై అంతర్గతంగా చర్చలు జరిగినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ వాషింగ్టన్‌ పోస్ట్‌ ఓ కథనాన్ని ప్రచురించింది.
 
అదే సమయంలో ఇరాన్‌ పై మరిన్ని దాడులు చేయడానికి సిద్ధమైనట్లు, దాడులను మరింత విస్తరిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ కట్జ్‌ వెల్లడించారు.కాగా పౌర ప్రాంతాలపై క్షిపణి దాడులను ఆపాలని తనతోపాటు ప్రధాని నెతన్యాహు.. టెహ్రాన్‌ను హెచ్చరించినప్పటికీ పద్ధతి మార్చుకోవడం లేదని ఆయన  ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘పదేపదే హెచ్చరించినప్పటికీ.. ఇరాన్‌ తన దాడులు కొనసాగిస్తోంది. ఇదిలాగే.. కొనసాగితే ఆ దేశంపై దాడులను మరింత తీవ్రతరం చేస్తాం. మరిన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటాం. ఈ యుద్ధ నేరానికి వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’’ అని కట్జ్‌ తీవ్రంగా హెచ్చరించారు.

ఈ మేరకు టెహ్రాన్‌లోని బాలిస్టిక్‌ క్షిపణులు, ఇతర ఆయుధాల తయారీ స్థావరాలను తాము లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్‌ సైన్యం శుక్రవారం ప్రకటించింది. పశ్చిమ ఇరాన్‌లోని క్షిపణి ప్రయోగ, నిల్వ కేంద్రాలపై పెద్ద ఎత్తున దాడులు చేసినట్లు వివరించింది. మరోవైపు.. అమెరికాకు సహకరిస్తున్నారన్న కారణంతో బహ్రెయిన్‌, ఖతార్‌, యూఏఈ తదితర గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ తన దాడులు కొనసాగించింది. చైనా ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌’లో భాగంగా తమ దేశంలో నిర్మాణంలో ఉన్న ముబారక్‌ అల్‌ కబీర్‌ పోర్ట్‌పై దాడి జరిగిందని కువైట్‌ ఆరోపించింది. కాగా, గల్ఫ్‌లో చైనా అనుబంధ ప్రాజెక్టుపై దాడి జరగడం ఇదే మొదటిసారని కువైట్‌ తెలిపింది.

Advertisment
తాజా కథనాలు