/rtv/media/media_files/2026/06/14/protest-in-iran-2026-06-14-13-53-53.jpg)
protest in iran
US-Iran Deal : అమెరికాతో ప్రతిపాదిత శాంతి ఒప్పందం (డీల్) కుదరనుందన్న వార్తలు ఇరాన్‌లో తీవ్ర రాజకీయ దుమారాన్ని, నిరసన జ్వాలలను రగిలించాయి. ఇరు దేశాల మధ్య త్వరలోనే ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఇరాన్‌లోని అతివాద (హార్డ్‌లైనర్) వర్గాలు ఒక్కసారిగా నిరసన బాట పట్టాయి. తమ దేశ ప్రయోజనాల విషయంలో విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఘాలిబఫ్ పూర్తిగా రాజీ పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇరాన్‌లోని పలు నగరాల్లో ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరాన్‌లోని ప్రముఖ నగరమైన మషాద్‌లోని విదేశాంగ శాఖ ప్రాంతీయ కార్యాలయం వెలుపల వందలాది మంది అతివాదులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. యూఎస్‌తో కుదుర్చుకోబోయే ఒప్పందం గురించి మంత్రి అరాగ్చీ బహిరంగంగా ప్రస్తావించినప్పటి నుండి ఈ ఆందోళనలు మరింత ఊపందుకున్నాయి. నిరసనకారులు అరాగ్చీకి వ్యతిరేకంగా తీవ్రమైన నినాదాలు చేస్తూ.. ఆయన దేశ సార్వభౌమత్వానికి తలవంపులు తెచ్చారని, దేశద్రోహానికి పాల్పడినందుకు ఆయనకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. రాజధాని టెహ్రాన్‌తో పాటు దేశంలోని అనేక ఇతర కీలక ప్రాంతాల్లోనూ ఈ నిరసనలు వెల్లువెత్తినట్లు తెలుస్తోంది.
Hardline Iranians have been protesting throughout the day against Foreign Minister Abbas Araghchi and Parliament Speaker Ghalibaf over the emerging U.S.-Iran deal. Demonstrators chanted "Death to Araghchi, the dishonorable compromiser," "Araghchi, have shame, stop giving in," and… pic.twitter.com/PRQrYfTxno
— Open Source Intel (@Osint613) June 13, 2026
ఈ ప్రతిపాదిత డీల్‌లో ఇరాన్ జాతీయ ప్రయోజనాలకు ఎలాంటి రక్షణలు లేవని, ఇది పూర్తిగా ఏకపక్ష ఒప్పందమని అతివాద వర్గాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఒప్పందం అమల్లోకి వస్తే, అంతర్జాతీయంగా అత్యంత వ్యూహాత్మకమైన 'హోర్ముజ్ జలసంధి' (Strait of Hormuz) పై ఇరాన్‌కు ఉన్న పట్టు, నియంత్రణ పూర్తిగా సడలిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం డీల్ కోసం అమెరికా విధించే కఠిన షరతులకు ఇరాన్ పాలకవర్గం తలలూపుతోందని, ఇది దేశ భద్రతను పణంగా పెట్టడమేనని వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
అయితే, ఈ నిరసనలపై ఇరాన్ అధికార వర్గాలు ప్రస్తుతానికి ఆచితూచి స్పందిస్తున్నాయి. ఈ ఒప్పందం పూర్తయితే గత కొన్ని ఏళ్లుగా అమెరికా ఇరాన్‌పై విధించిన కఠినమైన ఆర్థిక, దౌత్యపరమైన నిర్బంధాలు (ఆంక్షలు) పూర్తిగా తొలగిపోతాయని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ ఊపిరి పీల్చుకుంటుందని విదేశాంగ మంత్రి అరాగ్చీ ఇటీవల పేర్కొన్నారు. అయినప్పటికీ, దేశ అంతర్గత ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ అమెరికాకు లొంగిపోతున్నారనే భావనతో ఇరానీయన్లు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఇరు దేశాల దౌత్య సంబంధాల పరంగా ఈ పరిణామాలు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.
Follow Us