/rtv/media/media_files/2026/05/02/dosa-2026-05-02-07-51-54.jpg)
malasa dosa
Dosa : భారతీయ వంటకాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన దోశ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల వంటకాలను సమీక్షించే ప్రముఖ గ్లోబల్ ఫుడ్ గైడ్ 'టేస్ట్‌అట్లాస్' (TasteAtlas), మే 2026కు సంబంధించి విడుదల చేసిన ప్రపంచంలోని 'టాప్ 50 ఉత్తమ పాన్‌కేక్స్' జాబితాలో భారతీయ దోశలు మూడు స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. కేవలం రుచిలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ లవర్స్ ఇచ్చే రేటింగ్స్‌లో కూడా మన దేశీయ వంటకాలు అగ్రస్థానంలో నిలవడం గర్వకారణం.
ఈ జాబితాలో మసాలా దోశ 4.3 రేటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా 6వ స్థానాన్ని దక్కించుకుంది. క్రిస్పీగా ఉండే దోశ లోపల ఆలూ మసాలా మిశ్రమం, దానికి తోడుగా అందించే కొబ్బరి చట్నీ , సాంబార్ కలయిక అంతర్జాతీయ ఆహార ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక సాధారణ దోశ 4.2 రేటింగ్‌తో 15వ స్థానంలో, అలాగే అతి పల్చగా, కరకరలాడే పేపర్ దోశ 4.1 రేటింగ్‌తో 35వ స్థానంలో నిలిచాయి. దక్షిణ భారతదేశం నుంచి మొదలైన ఈ వంటకం, నేడు గ్లోబల్ స్టార్‌గా మారి విదేశీయుల మెనూలోనూ ముఖ్యమైన భాగంగా మారింది.
ఈ జాబితాలో మొదటి స్థానాన్ని లాట్వియాకు చెందిన 'కార్టుపెలు పంకుకాస్' (Kartupeļu pankūkas) కైవసం చేసుకుంది. ఇది బంగాళాదుంపలతో చేసే ఒక రకమైన పాన్‌కేక్. దీని తర్వాత ఫ్రాన్స్‌కు చెందిన ప్రసిద్ధ తీపి వంటకాలు 'క్రేప్స్ సుక్రేస్', 'క్రేప్స్' , 'నుటెల్లా క్రేప్స్' వరుసగా రెండు, మూడు ,నాలుగో స్థానాలను దక్కించుకున్నాయి. చైనాకు చెందిన 'జియాన్ బింగ్' ఐదో స్థానంలో నిలిచింది. ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి బలమైన పోటీ ఉన్నప్పటికీ, మన భారతీయ దోశలు టాప్-10లో స్థానం సంపాదించడం వాటికి ఉన్న ఆదరణను తెలియజేస్తోంది.
గతంలో కేవలం అల్పాహారంగా మాత్రమే పరిగణించబడే దోశ, ఇప్పుడు రకరకాల వైవిధ్యాలతో (ఫ్యూజన్ దోశలు) ప్రపంచవ్యాప్తంగా లభిస్తోంది. అమెరికా, యూరప్ వంటి ప్రాంతాల్లో కూడా 'దోశ సెంటర్లు' భారీగా వెలుస్తుండటం, తాజా టేస్ట్‌అట్లాస్ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు దక్కడం చూస్తుంటే, భారతీయ రుచులకు ప్రపంచ స్థాయిలో ఉన్న క్రేజ్ మరోసారి నిరూపితమైంది. దోశ కేవలం ఒక ప్రాంతీయ ఆహారం మాత్రమే కాదు, గ్లోబల్ పాకశాస్త్రంలో ఒక ముఖ్యమైన సంస్కృతిగా అవతరించింది.
Follow Us