New Covid variant : మళ్లీ కోవిడ్ కలకలం..  ప్రపంచ దేశాలను వణికిస్తున్న BA.3.2 వేరియంట్!

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించింది. ఇప్పుడు మరో కొత్త రకం కోవిడ్ వెరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తుంది. దీనికి శాస్త్రీయంగా BA.3.2 అని పేరు పెట్టారు.

New Update
new varient

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించింది. ఇప్పుడు మరో కొత్త రకం కోవిడ్ వెరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తుంది. దీనికి శాస్త్రీయంగా BA.3.2 అని పేరు పెట్టగా, పరిశోధకులు దీనిని అనధికారికంగా మాత్రం సికాడా అని పిలుస్తున్నారు. ఎందుకు ఇలా అంటే... చాలారోజుల పాటు భూమి అడుగున ఉండి ఒక్కసారిగా బయటకు వచ్చే సికాడా కీటకం లాగే, ఈ వైరస్ కూడా ఎవరికీ తెలియకుండా లోలోపల పరిణామం చెంది హఠాత్తుగా వెలుగులోకి రావడంతో దీనికి ఆ పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది అమెరికాలోని సగానికి పైగా రాష్ట్రాల్లో,  మరో 22 దేశాల్లో కూడా విస్తరించినట్లుగా రిపోర్టులలో తేలింది.

వేరియంట్ల కంటే ఇది చాలా భిన్నం

ఇక ఈ వేరియంట్ ఇంతలా చర్చనీయాంశం కావడానికి ప్రధాన కారణం ఇందులో ఉన్న 75 ఉత్పరివర్తనాలు. గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ఇది చాలా భిన్నంగా ఉంది. ముఖ్యంగా వైరస్ మానవ కణాల్లోకి ప్రవేశించడానికి ఉపయోగపడే స్పైక్ ప్రోటీన్ లో అనేక మార్పులు జరిగాయి. మనం తీసుకున్న వ్యాక్సిన్ల ద్వారా లేదా గతంలో కరోనా రావడం ద్వారా శరీరంలో తయారయ్యే యాంటీబాడీలు ఈ స్పైక్ ప్రోటీన్‌నే లక్ష్యంగా చేసుకుంటాయి. అయితే, సికాడా వేరియంట్‌లో ఈ ప్రోటీన్ మారిపోవడం వల్ల, మన రోగనిరోధక శక్తిని ఇది సులభంగా తప్పించుకునే  అవకాశం ఉందని ప్రాథమిక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

ఈ BA.3.2 రకాన్ని మొదటిసారిగా నవంబర్ 2024లో దక్షిణాఫ్రికాలో గుర్తించారు. మొదట్లో ఇది చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, 2025, 2026 ప్రారంభం నాటికి వివిధ ప్రాంతాల్లోని నిఘా వ్యవస్థల్లో బయటపడటం మొదలైంది. ఇది ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన BA.3 సంతతికి చెందినదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలో మొదటిసారిగా జూన్ 2025లో నెదర్లాండ్స్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వచ్చిన ఒక ప్రయాణికుడిలో ఈ వైరస్‌ను కనుగొన్నారు. ఆ తర్వాత మురుగునీటి పరీక్షలు ద్వారా ఇది సమాజంలో ముందే ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.

అయితే ఈ వేరియంట్ సోకిన రోగులందరూ కోలుకున్నారు. ఇది పాత వేరియంట్ల కంటే ప్రమాదకరమైన జబ్బును కలిగిస్తుందనడానికి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లేవు. ఆరోగ్య సంస్థల నివేదికల ప్రకారం, ఈ వైరస్ వ్యాప్తిలో ఉన్నప్పటికీ ప్రస్తుతానికి చాలా అరుదుగానే కనిపిస్తోంది. అయినప్పటికీ, దీని జన్యుపరమైన మార్పులు భవిష్యత్తులో వ్యాప్తిని లేదా వ్యాక్సిన్ల పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయనే అంశంపై నిపుణులు నిరంతరం నిఘా ఉంచుతున్నారు.

Advertisment
తాజా కథనాలు