/rtv/media/media_files/2026/03/27/nepal-2026-03-27-15-21-04.jpg)
నేపాల్ రాజకీయాల్లో ఒక సంచలనం నమోదైంది. కేవలం 35 ఏళ్ల వయస్సులోనే ప్రముఖ రాప్ సింగర్, మాజీ మేయర్ బాలేంద్ర షా ఆ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ఏడాది యువత నేతృత్వంలో జరిగిన భారీ నిరసనల తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో బాలెన్ నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) క్లీన్ స్వీప్ చేసింది. అవినీతి, వారసత్వ రాజకీయాలు, పాత తరం నాయకుల వైఫల్యాలతో విసిగిపోయిన నేపాల్ ప్రజలు, మార్పు కోరుకుంటూ బాలేంద్రకు పట్టం కట్టారు.
కర్ణాటకలో ఇంజనీరింగ్
1990లో ఖాట్మండులో జన్మించిన బాలేంద్ర షా వృత్తిరీత్యా స్ట్రక్చరల్ ఇంజనీర్. ఆయన ఇండియాలోని కర్ణాటకలో కూడా ఇంజనీరింగ్ చదివారు. అయితే, 2013లో ఒక రాప్ బ్యాటిల్ ద్వారా ఆయన పాపులర్ అయ్యారు. తన పాటల ద్వారా సమాజంలోని కుళ్లును, ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిని ప్రశ్నిస్తూ యువతకు ఐకాన్‌గా మారారు. ముఖ్యంగా ఆయన పాడిన బలిదాన్ వంటి పాటలు యూట్యూబ్‌లో కోట్లాది వ్యూస్ సాధించాయి. నల్లటి చతురస్రాకార కళ్లద్దాలు, బ్లాక్ బ్లేజర్ ఆయన ట్రేడ్ మార్క్ స్టైల్.
2022లో ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఖాట్మండు మేయర్ పదవికి పోటీ చేసి, దశాబ్దాలుగా ఏలుతున్న పార్టీలను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మేయర్‌గా నగరాన్ని శుభ్రం చేయడం, అక్రమ కట్టడాలను కూల్చివేయడం వంటి కఠిన నిర్ణయాలతో వార్తల్లో నిలిచారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి వంటి దిగ్గజాలను వారి సొంత నియోజకవర్గాల్లోనే ఓడించి, నేపాల్‌లోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా రికార్డు సృష్టించారు.
ప్రధానిగా భారీ లక్ష్యాలు
అయితే ప్రధానిగా బాలేంద్ర ముందు భారీ లక్ష్యాలు ఉన్నాయి. 12 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి, అవినీతి నిర్మూలన, న్యాయవ్యవస్థ సంస్కరణలు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అయితే, మేయర్‌గా ఉన్నప్పుడు వీధి వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. అలాగే, అనుభవం లేని ఆయన పార్టీ దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా గట్టెక్కిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా నవ్వుతున్న నేపాల్‌ను చూడాలనుకుంటున్నా అనే తన పాటలోని ఆకాంక్షను నెరవేర్చే దిశగా బాలెన్ అడుగులు వేస్తున్నారు. చూడాలి మరి ఆయన ఎలా రాణిస్తారు అనేది.
Follow Us