Balendra Shah : భారత భూభాగాలను నేపాల్ ఆక్రమించింది: నేపాల్ ప్రధాని బాలేంద్ర షా సంచలన వ్యాఖ్యలు

నేపాల్ నూతన ప్రధానమంత్రి బాలేంద్ర షా పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. భారత్‌తో సరిహద్దు వివాదాలపై ఎదురైనా ప్రశ్నలకు సమాధానమిస్తూ.. భారత్ మాత్రమే నేపాల్ భూభాగాలను ఆక్రమించలేదని, నేపాల్ కూడా భారత భూభాగాలను ఆక్రమించిందని వ్యాఖ్యానించారు.

New Update
FotoJet (92)

Nepal Prime Minister Balendra Shah'

Balendra Shah : భారత్-నేపాల్ సరిహద్దు వివాదంపై నేపాల్ నూతన ప్రధానమంత్రి బాలేంద్ర షా పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆదివారం పార్లమెంటు సమావేశాలకు హాజరైన ఆయనకు విపక్షాల నుంచి భారత్‌తో సరిహద్దు వివాదాలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటికి సమాధానమిస్తూ.. భారత్ మాత్రమే నేపాల్ భూభాగాలను ఆక్రమించలేదని, నేపాల్ కూడా పలుచోట్ల భారత భూభాగాలను ఆక్రమించిందని వ్యాఖ్యానించారు. తాను ప్రధానమంత్రి అయిన తర్వాతే ఈ ఆశ్చర్యకరమైన వాస్తవం తనకు తెలిసిందని ఆయన సభకు వివరించారు.

చాలాకాలంగా ఇరు దేశాల మధ్య నలుగుతున్న కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా సరిహద్దు వివాదాల నేపథ్యంలో ప్రధాని బాలేంద్ర షా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. బ్రిటీష్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని వీడి వెళ్లినప్పటి నుంచే ఈ సమస్య నెలకొని ఉందని, అందువల్ల తాము ఈ విషయంలో బ్రిటన్‌తో పాటు చైనాను కూడా సంప్రదించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ ఆక్రమణలపై సమగ్ర అధ్యయనం జరగాలని, దౌత్యపరమైన చర్చలతో పాటు చరిత్రకారులు, సర్వేయర్లు, నిపుణుల సాయంతో స్నేహపూర్వక వాతావరణంలో ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి భారత్, నేపాల్‌లు ఒక అంగీకారానికి వచ్చాయని ప్రధాని వెల్లడించారు.

అయితే, స్వయంగా దేశ ప్రధానమంత్రే భారత భూభాగాలను నేపాల్ ఆక్రమించిందని అంగీకరించడంపై దేశీయంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. బాలేంద్ర షా వ్యాఖ్యలు నేపాల్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసేలా, పక్క దేశానికి లొంగిపోయే ధోరణిలో ఉన్నాయంటూ ప్రతిపక్షాలు పార్లమెంటులో భగ్గుమన్నాయి. అటు సామాజిక మాధ్యమాల్లోనూ ప్రధాని వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు, ఆగ్రహం వ్యక్తమవడంతో ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర వివాదానికి దారితీసింది.

ఈ వివాదం ముదరడంతో నేపాల్ విదేశాంగ శాఖ తక్షణమే రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు చేపట్టింది. ప్రధాని వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. సరిహద్దులను దాటి ఇరువైపులా కొన్ని నివాస ప్రాంతాలు ఏర్పడటం, మరికొన్ని నిర్మానుష్య ప్రాంతాలలో జరిగిన స్థానిక ఆక్రమణలను ఉద్దేశించి మాత్రమే ప్రధాని మాట్లాడారని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అంతేకానీ, దేశ అధికారిక ప్రాదేశిక హక్కులతో గానీ, సార్వభౌమత్వంతో గానీ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు ఎటువంటి సంబంధం లేదని వివరణ ఇస్తూ వివాదానికి తెరదించే ప్రయత్నం చేసింది.

Advertisment
తాజా కథనాలు