/rtv/media/media_files/2026/03/24/blast-2026-03-24-14-42-26.jpg)
అమెరికాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టెక్సాస్ రాష్ట్రం పోర్ట్ ఆర్థర్‌లో ఉన్న ఒక భారీ చమురు శుద్ధి కర్మాగారంలో భయంకరమైన అగ్నిప్రమాదం జరిగింది. వాలెరో ఎనర్జీ సంస్థకు చెందిన ఈ రిఫైనరీలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనతో భారీగా నల్లటి పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి, ఇవి చాలా మైళ్ల దూరం వరకు కనిపిస్తున్నాయి.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, సోమవారం సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో రిఫైనరీలోని ఒక ఇండస్ట్రియల్ హీటర్‌లో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ధాటికి పోర్ట్ ఆర్థర్ మాత్రమే కాకుండా సమీపంలోని గ్రోవ్స్, నెదర్లాండ్స్ ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఈ రిఫైనరీ రోజుకు సుమారు 3.8 లక్షల బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం కలిగి ఉండటంతో, దేశ ఇంధన సరఫరాపై దీని ప్రభావం ఎలా ఉంటుందో అన్న ఆందోళన మొదలైంది.
నివాసితులకు కీలక ఆదేశాలు
ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. నగరంలోని పశ్చిమ ప్రాంత నివాసితులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గాలిలో విషపూరిత పొగలు వ్యాపించే అవకాశం ఉన్నందున, ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని, కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని షెల్టర్-ఇన్-ప్లేస్ హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి.
అయితే, ఈ పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా లేదా ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది అనే విషయంలో వాలెరో ఎనర్జీ యాజమాన్యం నుండి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం రిఫైనరీలో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయా లేదా అన్నది కూడా స్పష్టంగా తెలియడం లేదు. అమెరికా ఇంధన అవసరాలను తీర్చడంలో ఈ ప్లాంట్ ఎంతో కీలకమైనది కావడంతో అధికారులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు.
Follow Us