/rtv/media/media_files/2026/04/03/pakistan-2026-04-03-21-37-47.jpg)
Lockdown in pakistan
Lockdown : ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో మరోసారి లాక్ డౌన్ అనే మాట వినపడుతోంది. అయితే ఇది గతంలో మనం చూసిన లాక్ డౌన్ లాంటిది కాదు. ఒక దేశం ఆర్థికంగా, రాజకీయంగా, అంతర్జాతీయ యుద్ధ పరిణామాల వల్ల సంక్షోభంలోకి వెళ్లినపుడు ప్రకటించేది. ఇప్పటికే బంగ్లాదేశ్ లో లాక్ డౌన్ పరిస్థితులు నెలకొనగా తాజాగా పాకిస్థాన్ లోనూ అదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో పాటు తీవ్రమైన 'ఇంధన కొరత' ను ఎదుర్కొంటుంది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ (మధ్య ప్రాచ్యం)లో జరుగుతున్న యుద్ధ పరిణామాల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ వద్ద ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు అత్యంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. అంటే, బయట దేశాల నుండి పెట్రోల్, డీజిల్ లేదా గ్యాస్ కొనడానికి అవసరమైనంత డబ్బు వారి వద్ద లేదు. ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్న కొద్దిపాటి ఇంధనాన్ని పొదుపు చేయడానికి 'స్మార్ట్ లాక్‌డౌన్' విధించాలని ప్రభుత్వం భావిస్తోందట.
ఈ విషయపై చర్చించడానికి పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ ఇటీవల ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా రాత్రిపూట మార్కెట్లను , వ్యాపార సముదాయాలను త్వరగా మూసివేయాలని వారు సూచించారు. అంటే పాకిస్తాన్‌లో రాత్రి 8 లేదా 9 గంటలకే అన్ని షాపింగ్ మాల్స్, మార్కెట్లు మూసివేయాలని తీర్మానం చేశారు. అలాగే వారంలో 5 రోజులు కాకుండా, కేవలం 3 లేదా 4 రోజులు మాత్రమే ఆఫీసులకు రావాలని, మిగిలిన రోజులు 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేయాలని తెలిపారు. దీనివల్ల రవాణా ఖర్చులు, ఏసీలు అలాగే విద్యుత్ వినియోగం తగ్గుతుందని వారి అంచనా.
పాకిస్తాన్ లోని కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ చేయాలని ఆలోచిస్తున్నప్పటికీ పాకిస్తాన్‌లోని ప్రావిన్షియల్ ప్రభుత్వాలు (రాష్ట్రాలు) మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారని, ఇప్పుడు మళ్ళీ లాక్‌డౌన్ విధిస్తే వ్యాపారాలు దెబ్బతిని నిరుద్యోగం మరింత పెరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్ , సింధ్ ప్రావిన్సులు పూర్తి స్థాయి లాక్‌డౌన్ వద్దని, కేవలం కొన్ని నియంత్రణలు మాత్రమే విధిద్దామని స్పష్టం చేస్తున్నాయి. గత కొద్ది రోజల క్రితం పాకిస్తాన్‌లో "కంప్లీట్ వీకెండ్ లాక్‌డౌన్" విధించారంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే పాకిస్తాన్ సమాచార శాఖ దీనిని ఖండించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలాంటి అధికారిక లాక్‌డౌన్ లేనప్పటికీ కేవలం పొదుపు చర్యలు మాత్రం అమల్లో ఉన్నాయి. అయితే ఏ నిమిషమైనా లాక్ డౌన్ వార్తలు వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఒక రకంగా చూస్తే, పాకిస్తాన్ ప్రస్తుతం ఒక ఆర్థిక లాక్‌డౌన్ లో ఉందనేది వాస్తవం. అధికారికంగా షాపులు తెరిచి ఉన్నా, కొనే శక్తి ప్రజలకు లేదు. ప్రభుత్వం పెట్రోల్ ఆదా చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అది ఎంతవరకు సఫలమవుతుందో చెప్పలేం. పొరుగు దేశంలో నెలకొన్న ఈ అస్థిరత దక్షిణాసియా ప్రాంతంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
Follow Us