/rtv/media/media_files/2026/05/28/mango-2026-05-28-21-24-43.jpg)
అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ మామిడి పండ్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అల్ఫాన్సో, కేసర్, లంగ్రా, బంగనపల్లి వంటి ప్రీమియం రకాలకు విదేశాల్లో భారీ డిమాండ్ ఉంటుంది. అయితే, భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగులుతూ.. భారతీయ మామిడి పండ్ల దిగుమతులను జపాన్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ఏడాది ప్రారంభంలో జపాన్ క్వారంటైన్ అధికారులు భారత్‌లోని పండ్ల శుద్ధి కేంద్రాల్లో జరిపిన తనిఖీల్లో కీటకాల నియంత్రణ విధానాలలో లోపాలు బయటపడటమే ఇందుకు ప్రధాన కారణం.
భారతీయ మామిడి పండ్లపై జపాన్ ఇలాంటి ఆంక్షలు విధించడం గత రెండు దశాబ్దాలలో ఇదే మొదటిసారి. అంతకుముందు ఫ్రూట్ ఫ్లైస్ సమస్య కారణంగా జపాన్ నిషేధం విధించగా.. భారత్ తన క్వారంటైన్ నిబంధనలను కఠినతరం చేయడంతో 2006లో ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. కాగా, వాతావరణ, మొక్కల ఆరోగ్య ప్రమాణాల విషయంలో జపాన్ ఎలాంటి లోపాలను సహించని విధానాన్ని అనుసరిస్తుంది.
ప్రతి ఏటా మామిడి ఎగుమతుల సీజన్ ప్రారంభానికి ముందు, జపాన్ దేశ క్వారంటైన్ అధికారులు ఇండియాలోని వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ కేంద్రాలను తనిఖీ చేస్తారు. రసాయనాలు వాడకుండా, నిర్దేశిత వేడి, తేమతో కూడిన గాలి ద్వారా మామిడి పండ్లలోని కీటకాలు, వాటి లార్వాలను నాశనం చేసే ప్రక్రియను ఈ కేంద్రాల్లో నిర్వహిస్తారు. రెండు దేశాల మధ్య ఉన్న ఎగుమతి ఒప్పందం ప్రకారం ఈ ట్రీట్‌మెంట్ తప్పనిసరి.
అయితే, ఈ ఏడాది మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని రెహమాన్‌పూర్ VHT కేంద్రంలో జపాన్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడి ల్యాబ్‌లలో క్రిమిసంహారక, ఫ్యూమిగేషన్ ప్రక్రియల్లో సాంకేతిక లోపాలు ఉన్నట్లు వారు గుర్తించారు. దీనిపై స్పందించిన జపాన్‌కు చెందిన యోకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్.. 2026 మార్చి 25 తర్వాత జారీ చేసిన ఇన్‌స్పెక్షన్ సర్టిఫికెట్లు గల భారతీయ మామిడి షిప్‌మెంట్లను ఇకపై అనుమతించబోమని స్పష్టం చేసింది.
భారతదేశానికి జపాన్ అతిపెద్ద మామిడి మార్కెట్ కాకపోయినప్పటికీ, అక్కడ భారతీయ మామిడి పండ్లకు లభించే ప్రీమియం ధరల కారణంగా ఈ నిషేధం ఎగుమతిదారులకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ప్రపంచంలోనే అత్యధికంగా ఏటా దాదాపు 2.8 కోట్ల మెట్రిక్ టన్నుల మామిడిని భారత్ ఉత్పత్తి చేస్తుంది. జపాన్ విధించిన ఈ తాత్కాలిక నిషేధం వల్ల అంతర్జాతీయంగా భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల క్వాలిటీ కంట్రోల్ వ్యవస్థలపై ఇతర దేశాలకు కూడా అనుమానాలు వచ్చే ప్రమాదం ఉందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మామిడి రైతులు ఆవేదన
ఈ నిషేధం సరైన సమయంలో రాలేదని మహారాష్ట్రలోని అల్ఫాన్సో మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ నినో వాతావరణ మార్పుల కారణంగా ఈ ఏడాది దేశంలో విపరీతమైన ఎండలు, మితిమీరిన వేడి వల్ల ఇప్పటికే మామిడి దిగుబడి ఘోరంగా పడిపోయింది. కొన్ని ప్రభుత్వ సర్వేల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 85 నుండి 90 శాతం వరకు పంట నష్టం వాటిల్లింది. ఒకవైపు దిగుబడి తగ్గి, మరోవైపు వ్యాపారానికి కీలకమైన మే నెలలోనే జపాన్ నిషేధం విధించడంతో అటు రైతులు, ఇటు వ్యాపారులు భారీగా నష్టపోయే పరిస్థితి నెలకొంది.
Follow Us