/rtv/media/media_files/2026/04/05/iran-2026-04-05-10-33-02.jpg)
పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదురుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ కూటమికి త్వరలోనే కోలుకోలేని విధంగా ఒక బిగ్ సర్ప్రైజ్ ఇస్తామంటూ ఇరాన్ ఉన్నత స్థాయి భద్రతా అధికారి ఒకరు హెచ్చరించారు. ఈ మేరకు లెబనాన్‌కు చెందిన అల్-మయాదీన్ టెలివిజన్ నెట్‌వర్క్‌తో మాట్లాడిన సదరు అధికారి, తమ వ్యూహకర్తలు నిర్ణయించిన లక్ష్యాల జాబితా ప్రకారం ఇరాన్ సైన్యం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ఇటీవల ఇరాన్ సరిహద్దుల్లో అమెరికా జరిపిన దాడులు తమకు కలిసొస్తాయని, సరైన సమయం కోసం వేచి చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇస్తున్న హెచ్చరికలపై కూడా ఇరాన్ అధికారి ఘాటుగా స్పందించారు. ట్రంప్ చేస్తున్న ప్రకటనలు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని, కేవలం యుద్ధంలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మీడియా ద్వారా ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా సాధారణ ప్రజలకు సంబంధించిన మౌలిక వసతులను టార్గెట్ చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని ఆయన కొట్టిపారేశారు. అమెరికా తన యుద్ధ లక్ష్యాల విషయంలో స్పష్టత లేకుండా ఉంటే, ఇరాన్ మాత్రం పక్కా ప్రణాళికతో దాడులు చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు.
అమెరికా స్థావరాలే లక్ష్యంగా
తాజా పరిణామాల ప్రకారం, ఆదివారం తెల్లవారుజామునే ఇజ్రాయెల్, కువైట్‌లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ భారీగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా ట్రంప్ ఇరాన్‌కు 48 గంటల అల్టిమేటం జారీ చేశారు. "తమ నిబంధనలకు అంగీకరించి డీల్ కుదుర్చుకోకపోతే నరకం చూపిస్తాం" అని ట్రంప్ హెచ్చరించగా, ఇరాన్ జనరల్ అలీ అబ్దోల్లాహి అలీయాబడి దీనిని "పిరికిపంద చర్య" అని అభివర్ణించారు. 48 గంటల తర్వాత నరకం చూసేది అమెరికాయేనని ఆయన ప్రతి సవాల్ విసిరారు.
యుద్ధం తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఇరు దేశాలు ఆర్థిక, వ్యూహాత్మక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఇరాన్ తన నియంత్రణలో ఉన్న 'హార్ముజ్ జలసంధి'ని అస్త్రంగా వాడుకుంటూ ప్రపంచ ఇంధన రవాణాను స్తంభింపజేసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బుషెహర్ అణు ప్లాంట్ సమీపంలో జరిగిన దాడిలో ఒక భద్రతా సిబ్బంది మరణించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఇరు పక్షాల మధ్య పెరుగుతున్న మాటల యుద్ధం, క్షిపణి దాడులు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Follow Us