Underground Missile Cities : అమెరికా బాంబులకు లొంగని ఇరాన్...మళ్లీ యాక్టివ్ అయిన భూగర్భ క్షిపణి నగరాలు

అమెరికా, ఇజ్రాయెల్‌ కూటమి ఇరాన్‌పై భీకర దాడులు చేసి, అక్కడి పర్వతాలను బాంబులతో బద్దలు కొట్టినప్పటికీ ఆ దేశ రహస్య క్షిపణి నిధి సురక్షితంగానే ఉంది. ఇరాన్ భూగర్భ క్షిపణి స్థావరాలే లక్ష్యంగా భారీ దాడులు జరిపినప్పటికీ, ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్నికోల్పోలేదు.

New Update
FotoJet (95)

Iran underground missile cities are active again

Underground Missile Cities : అమెరికా, ఇజ్రాయెల్‌ కూటమి ఇరాన్‌పై భీకర దాడులు చేసి, అక్కడి పర్వతాలను బాంబులతో బద్దలు కొట్టినప్పటికీ ఆ దేశ రహస్య క్షిపణి నిధి సురక్షితంగానే ఉంది. యుద్ధంలో ఇరాన్ భూగర్భ క్షిపణి స్థావరాలే లక్ష్యంగా మిత్రదేశాలు భారీ వ్యూహాత్మక దాడులు జరిపినప్పటికీ, ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని మళ్లీ పుంజుకుంది. తాజాగా విడుదలైన అంతర్జాతీయ శాటిలైట్ (ఉపగ్రహ) చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అమెరికా వైమానిక దాడుల్లో ధ్వంసమైన 69 భూగర్భ సొరంగాల ప్రవేశ మార్గాలలో (ఎంట్రీ పాయింట్లు) ఇప్పటికే 50 మార్గాలను ఇరాన్ విజయవంతంగా పునరుద్ధరించి, తిరిగి అందుబాటులోకి తెచ్చింది.

ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ 'సీఎన్ఎన్' (CNN) విడుదల చేసిన పరిశోధనాత్మక నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా జరిపిన భారీ దాడుల వల్ల ఇరాన్ క్షిపణి వ్యవస్థ పూర్తిగా కుప్ప కూలింద ని భావించారు. అయితే, తాజా ఉపగ్రహ చిత్రాలు పూర్తి భిన్నమైన వాస్తవాలను వెల్లడిస్తున్నాయి. ఇరాన్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 18 వ్యూహాత్మక భూగర్భ క్షిపణి నగరాలలోని (Underground Missile Cities) సొరంగాలను ఇరాన్ శరవేగంగా పునర్నిర్మిస్తోంది. యుద్ధ విరమణ (సీజ్‌ఫైర్) ప్రకటించిన వెంటనే ఇరాన్ మిలిటరీ యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగి ఈ మరమ్మతు పనులను ప్రారంభించింది.

యుద్ధ సమయంలో అమెరికా కూటమి ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సొరంగాల ముఖద్వారాలు, అక్కడికి వెళ్లే రహదారులను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంది. దీంతో అనేక చోట్ల కొండచరియలు విరిగిపడి సొరంగాల ద్వారాలు పూర్తిగా మట్టిదిబ్బల కింద పూడిపోయాయి. కానీ, తాజా శాటిలైట్ చిత్రాలలో ఇరాన్ దళాలు బుల్డోజర్లు, డంప్ ట్రక్కులు, భారీ లోడర్లతో రాత్రింబవళ్లు శ్రమించి ఆ మల్బాను తొలగిస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలకు రవాణా సౌకర్యాలను కల్పించి, క్షిపణి ప్రయోగాలకు వీలుగా రహదారులను తిరిగి నిర్మించారు.

ఈ పరిణామాలపై అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జేమ్స్ మార్టిన్ సెంటర్ ఫర్ నాన్‌ప్రొలిఫరేషన్ స్టడీస్ రీసెర్చ్ అసోసియేట్ 'సామ్ లేయర్' విశ్లేషణ ప్రకారం.. బాంబు దాడులతో ఒక సొరంగం పైభాగాన్ని లేదా ప్రవేశ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేయడం సులువే కానీ, వందలాది అడుగుల లోతున ఉన్న గట్టి పర్వతాలు, బండరాళ్ల కింద దాచి ఉంచిన అసలు క్షిపణి నిధిని నాశనం చేయడం దాదాపు అసాధ్యం. ప్రస్తుతం ఇరాన్ వద్ద క్షిపణి లాంచర్లు, వాటిని ప్రయోగించే నైపుణ్యం గల సైనిక సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, వారు మళ్లీ భారీ ఎత్తున దాడులు చేయడానికి ఎలాంటి సాంకేతిక అడ్డంకులు లేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సైనిక నిపుణుల అంచనాల ప్రకారం.. ఇరాన్ భూగర్భ నెట్‌వర్క్‌లో ఇప్పటికీ దాదాపు 1,000 కి పైగా శక్తివంతమైన బాలిస్టిక్, క్రూజ్ క్షిపణులు సురక్షితంగా ఉన్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఇరాన్ తన భూగర్భ సైనిక స్థావరాలను ఎంతటి శక్తివంతమైన వైమానిక దాడులనైనా తట్టుకునేలా అత్యాధునిక సాంకేతికతతో నిర్మించుకోవడమే దీనికి ప్రధాన కారణం. యుద్ధ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని, లాంచ్ సిస్టమ్స్‌ను పూర్తిగా తుడిచిపెట్టడమే తమ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ తీశామని చేసిన ప్రకటనలు తాజా పరిణామాలతో సందేహంలో పడ్డాయి.

కేవలం క్షిపణి స్థావరాలపైనే కాకుండా ఇరాన్‌కు చెందిన మిసైల్ తయారీ ఫ్యాక్టరీలు, రాకెట్ ఇంధన ఉత్పాదక కేంద్రాలు , ఎలక్ట్రానిక్ విడిభాగాల పరిశ్రమలపై కూడా అమెరికా, ఇజ్రాయెల్‌లు బాంబుల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ మాట్లాడుతూ.. ధ్వంసమైన రక్షణ పరిశ్రమను, లాంచర్లను ఇరాన్ అంత సులభంగా మళ్లీ నిర్మించుకోలేదని పేర్కొన్నారు. అయితే, అమెరికా అంచనాలను తలకిందులు చేస్తూ ఇరాన్ కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే తన వ్యూహాత్మక స్థావరాలను పునరుద్ధరించడం పశ్చిమాసియాలో అగ్రరాజ్యానికి సరికొత్త సవాలుగా మారింది.

Advertisment
తాజా కథనాలు