Iran warns US : దిగ్బంధం కొనసాగిస్తామంటే.. ప్రతీకార చర్యలు తప్పవు..అమెరికాకు ఇరాన్‌ హెచ్చరిక

అమెరికా విధిస్తున్న ఆంక్షలపై ఇరాన్ సైనిక కమాండ్ అత్యంత కఠినంగా స్పందించింది. ఒకవేళ అమెరికా తన దిగ్బంధనాన్ని మొండిగా కొనసాగిస్తే, తమ శక్తిమంతమైన సాయుధ బలగాల నుంచి తీవ్ర ప్రతీకారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ హెచ్చరించింది.

New Update
Hormuz

Iran warns US of retaliation if sanctions continue

 Iran warns US : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా విధిస్తున్న ఆంక్షలపై ఇరాన్ సైనిక కమాండ్ అత్యంత కఠినంగా స్పందించింది. ఒకవేళ అమెరికా తన దిగ్బంధనాన్ని మొండిగా కొనసాగిస్తే, తమ శక్తిమంతమైన సాయుధ బలగాల నుంచి తీవ్ర ప్రతీకారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ హెచ్చరించింది. దేశ భూభాగం, సార్వభౌమాధికారం , జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు తమ సేనలు మునుపటి కంటే మెరుగైన యుద్ధ సంసిద్ధతతో ఉన్నాయని, శత్రువుల ప్రతి కదలికను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేసింది.

ముఖ్యంగా హోర్మూజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగుతుందని, అమెరికా దురాక్రమణకు పాల్పడితే గట్టిగా ఎదురుదెబ్బ తీస్తామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. ఈ సైనిక హెచ్చరికల మధ్యే, పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన అమెరికా-ఇరాన్ రెండో విడత ప్రత్యక్ష చర్చలపై అనిశ్చితి నెలకొంది. ఈ క్రమంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ శనివారం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయి పశ్చిమాసియాలోని తాజా పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. అంతకుముందు ఆయన పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌లతో సమావేశమై అమెరికాతో జరగాల్సిన శాంతి చర్చల విధివిధానాలపై సంప్రదింపులు జరిపారు.

మరోవైపు, ఇరాన్‌లో సామాన్య ప్రజల జీవనానికి సంబంధించిన కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా ఇరాన్‌లో వాణిజ్య విమాన సేవలను పునరుద్ధరించారు. టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇస్తాంబుల్, మస్కట్, మదీనా వంటి నగరాలకు విమానాలు రాకపోకలు ప్రారం భించాయి. కాల్పుల విరమణ నేపథ్యంలో గగనతలాన్ని పాక్షికంగా తెరవడంతో ఈ సేవలు పునఃప్రారంభ మయ్యాయి. 

అయితే, దేశ ఆర్థిక పరిస్థితి ,మౌలిక సదుపాయాలపై శత్రువుల దాడుల దృష్ట్యా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రజలకు కీలక విన్నపం చేశారు. దేశం చుట్టూ ముట్టడి కొనసాగుతున్నందున విద్యుత్, ఇంధన వాడకాన్ని తగ్గించాలని ఆయన కోరారు. ఇంట్లో అవసరం లేని లైట్లను ఆర్పేయడం ద్వారా ఇంధనాన్ని పొదుపు చేయాలని, పది లైట్ల బదులు కేవలం రెండు లైట్లను వెలిగిస్తే వచ్చే ఇబ్బందేమీ లేదని ఆయన సూచించారు. అటు యుద్ధ సంసిద్ధత, ఇటు దౌత్య ప్రయత్నాలు, మరోవైపు అంతర్గత పొదుపు చర్యలతో ఇరాన్ ప్రస్తుతం ఒక క్లిష్టమైన దశను ఎదుర్కొంటోంది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందో లేదో అన్న ఉత్కంఠను పెంచుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు