Iran : హార్ముజ్ జలసంధిలో ఇరాన్ కొత్త రూల్

ప్రపంచంలోనే చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును మరింత బిగించాలని చూస్తోంది. అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.

New Update
iran

ప్రపంచంలోనే చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును మరింత బిగించాలని చూస్తోంది. అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఈ మార్గం ద్వారా ప్రయాణించే చమురు ట్యాంకర్ల నుంచి ప్రతి బ్యారెల్‌కు ఒక డాలర్ చొప్పున టోల్ ఫీజు వసూలు చేయాలని ఇరాన్ యోచిస్తోంది. విశేషం ఏంటంటే, ఈ చెల్లింపులను నగదు రూపంలో కాకుండా బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల ద్వారానే చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.

హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ప్రతి నౌకను నిశితంగా పర్యవేక్షించాలని ఇరాన్ భావిస్తోంది. ఆయుధాల అక్రమ రవాణా జరగకుండా చూడటమే తమ ఉద్దేశమని ఇరాన్ ఆయిల్ ఎగుమతిదారుల సంఘం ప్రతినిధి హమీద్ హొస్సేని తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రతి ట్యాంకర్ తన కార్గో వివరాలను ముందుగానే ఇమెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. అధికారులు ఆ వివరాలను పరిశీలించి ఫీజును ఖరారు చేస్తారు. అయితే, ఈ తనిఖీల వల్ల ప్రయాణం ఆలస్యమయ్యే అవకాశం ఉంది, దీనిపై స్పందిస్తూ "మాకేం తొందర లేదు" అని ఇరాన్ వ్యాఖ్యానించడం గమనార్హం.

కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు

మరోవైపు, అనుమతి లేకుండా ఈ జలసంధి దాటే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. రేడియో బ్రాడ్‌కాస్ట్‌ల ద్వారా నౌకలను హెచ్చరిస్తూ, "అనుమతి లేకుండా వెళ్లే ఏ నౌకనైనా ధ్వంసం చేస్తాం" అని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతం ఒక భారీ 'కార్ పార్కింగ్' లాగా మారిపోయింది. సుమారు 400 నౌకలు, లక్షలాది బ్యారెళ్ల చమురుతో ప్రయాణం కోసం వేచి చూస్తున్నాయి. షిప్పింగ్ కంపెనీలు భద్రతా కారణాల దృష్ట్యా తమ నౌకలను ముందుకు కదపడానికి భయపడుతున్నాయి.

ఈ సమస్య అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను వణికిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. హార్ముజ్ జలసంధిని తక్షణమే, సురక్షితంగా తెరిస్తేనే కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందని హెచ్చరించారు. అయితే ఇరాన్ మాత్రం తన పర్యవేక్షణలోనే రవాణా జరగాలని పట్టుబడుతోంది. మరోవైపు, ఈ టోల్ పద్ధతిని ఒమన్ దేశం వ్యతిరేకిస్తోంది. ప్రస్తుత అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఇలాంటి పన్నులు వసూలు చేయడం కుదరదని ఒమన్ స్పష్టం చేసింది.

Advertisment
తాజా కథనాలు