/rtv/media/media_files/2026/05/14/trump-2026-05-14-10-53-41.jpg)
మీకు అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య-2 సినిమా గుర్తింది కదా.. అందులో పెళ్లి సీన్ ఉంటుంది. ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధంగా ఉన్న విలన్లు.. పైకి నవ్వుతూనే లోపల ఒకరి మీద ఒకరు ఎన్ని అనుమానాలతో ఉంటారు. పెళ్లికి వచ్చిన వారందరినీ మెటల్ డిటెక్టర్లతో చెక్ చేయడం, ప్రతి వస్తువునూ అనుమానంగా చూడటం.. సరిగ్గా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనలోనూ సీన్ అలాగే కనిపిస్తోంది.
బయటికి రెండు దేశాల ప్రతినిధులు కరచాలనం చేసుకుంటున్నా, లోపల మాత్రం అమెరికా అధికారులు చైనా వాడు ఎప్పుడు మన డేటాను ఎగరేసుకుపోతాడో అన్న టెన్షన్‌లో ఉన్నారు. అందుకే అక్కడ వాళ్ళు పాటిస్తున్న డిజిటల్ ప్రోటోకాల్స్ చూస్తుంటే.. అబ్బే ఆర్య-2 విలన్లు కూడా మా ముందు చిన్నపిల్లలే అనిపిస్తోంది.
అమెరికా అధికారులు చైనా గడ్డపై అడుగుపెట్టే ముందే తమ పర్సనల్ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లను అమెరికాలోనే వదిలేశారు. వాటికి బదులు కేవలం అత్యవసర ఫీచర్లు మాత్రమే ఉన్న పరికరాలు వాడుతున్నారు. చైనాలో అడుగుపెట్టిన క్షణం నుంచి వాళ్ళ ప్రతి అడుగు, ప్రతి మాటా నిఘా నీడలోనే ఉంటుందని అమెరికా భయం. అందుకే క్లౌడ్ డేటా లేదు, కాంటాక్ట్ లిస్ట్ లేదు.. చివరకు పర్సనల్ మెసేజింగ్ యాప్స్ కూడా వాడట్లేదు.
ఛార్జ్ చేసుకుంటే చాలు
హైవే పక్కన ఫ్రీగా ఉంది కదా అని ఏదో ఒక USB పోర్ట్‌లో ఫోన్ పెట్టి ఛార్జ్ చేసుకుంటే చాలు.. మీ ఫోన్ లోని డేటా మొత్తం చైనా సైబర్ టీమ్ చేతికి వెళ్ళిపోతుంది. దీనినే జ్యూస్ జాకింగ్ అంటారు. ఈ ముప్పు ఎంత దారుణంగా ఉందంటే.. అధికారులు తమతో పాటు సొంతంగా అప్రూవ్ చేసిన ఛార్జర్లు, పవర్ బ్యాంకులు మాత్రమే తెచ్చుకున్నారు. బయట ఏ వస్తువునూ ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు.
వైట్ హౌస్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. చైనాలో ప్రతి డిజిటల్ కదలిక రికార్డ్ అవుతుంది. అందుకే అత్యంత కీలకమైన చర్చల కోసం SCIF (Sensitive Compartmented Information Facility) అనే ప్రత్యేక గదులను వాడుతున్నారు. ఇవి ఎలక్ట్రానిక్ నిఘా ఛేదించలేని అతి సురక్షితమైన గదులు. అంటే పక్కన ఉన్నవాడు కూడా వినలేనంత జాగ్రత్త అన్నమాట.
ఈ రూల్స్ కేవలం అధికారులకే కాదు.. ట్రంప్‌తో పాటు వెళ్లిన ఆపిల్, బోయింగ్, బ్లాక్‌రాక్ వంటి భారీ కంపెనీల బాసులకు కూడా వర్తిస్తాయి. బిలియన్ డాలర్ల వ్యాపార రహస్యాలు ఎక్కడ లీక్ అవుతాయో అని వీళ్లంతా కూడా డిజిటల్ లాక్ డౌన్ లో బతుకుతున్నారు. చైనా మాత్రం ఇవన్నీ అబద్ధాలని, తాము ఎవరి డేటా దొంగిలించమని చెబుతున్నా.. గతంలో జరిగిన సైబర్ దాడులు, గూఢచారి బెలూన్ల ఉదంతాల తర్వాత అమెరికా అస్సలు రిస్క్ తీసుకోవడం లేదు.
Follow Us