/rtv/media/media_files/2026/03/12/us-2026-03-12-19-38-16.jpg)
పెన్సిల్వేనియాకు చెందిన భారత సంతతి సోదరులు భాస్కర్ సవాని, అరుణ్ సవాని భారీ మోసాలకు పాల్పడి అడ్డంగా దొరికిపోయారు. దాదాపు పదేళ్ల పాటు సాగించిన ఈ విదేశీ వీసా మోసాలు, హెల్త్‌కేర్ కుంభకోణాలు, మనీ లాండరింగ్ వంటి నేరాల్లో వీరిద్దరూ దోషులుగా తేలారు.
అమెరికాలోని పలు రాష్ట్రాల్లో వీరు సవాని గ్రూప్ పేరుతో ఒక నెట్‌వర్క్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ పథకాలను తప్పుదోవ పట్టించి కోట్లాది రూపాయలు వెనకేసినట్లు అధికారులు గుర్తించారు. వృత్తిరీత్యా డెంటిస్ట్ అయిన భాస్కర్ సవాని తన హోదాను వాడుకుని మరీ ఈ దందాలు నడిపించినట్లు తేలింది.
హెచ్-1బి వీసాల మోసం
వీరి అక్రమాల్లో ప్రధానంగా హెచ్-1బి వీసాల మోసం షాకింగ్‌గా ఉంది. భారత్ నుంచి వచ్చిన కార్మికులను వీసా పేరుతో రప్పించి, వారి జీతాల్లో కోత విధించడమే కాకుండా, తిరిగి తమకే డబ్బులు కట్టాలని వారిని వేధించేవారు. ఇటు వైద్య రంగంలో కూడా వీరు ఆగడాలు సాగించారు. మెడికేడ్ ప్రోగ్రామ్ నుంచి వీరికి రావాల్సిన కాంట్రాక్టులు రద్దయినా, ఇతరుల పేర్లతో దొంగ బిల్లులు సృష్టించి సుమారు 30 మిలియన్ డాలర్ల మేర ప్రభుత్వం నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేశారు. విదేశాల్లో ఉన్న వైద్యుల పేర్లతో బిల్లులు వేయడం, లైసెన్సులు లేని వారితో చికిత్సలు చేయించడం వంటి ఘోరాలకు కూడా వెనకాడలేదు.
మరో దారుణమైన విషయం ఏమిటంటే, రోగుల ప్రాణాలతో కూడా వీరు ఆటలాడుకున్నారు. అమెరికాలోని ఎఫ్.డి.ఏ (FDA) అనుమతి లేని, "మనుషులపై వాడకూడదు" అని స్పష్టంగా ఉన్న నకిలీ డెంటల్ ఇంప్లాంట్లను రోగులకు తెలియకుండానే వారి శరీరాల్లో అమర్చారు. ఇంతటి దారుణాలకు పాల్పడుతూనే, మరోవైపు పన్నులు ఎగ్గొట్టి ఆ డబ్బుతో తమ పిల్లల కాలేజీ ఫీజులు, విలాసవంతమైన ఇళ్ల నిర్వహణ ఖర్చులు చూసుకునేవారు. తమపై విచారణ జరుగుతున్నా పట్టించుకోకుండా, ఎఫ్.బి.ఐ డైరెక్టర్ కాష్ పటేల్‌ను కలిసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ గొప్పలు చెప్పుకోవడం గమనార్హం.
ప్రస్తుతం కోర్టు వీరిద్దరినీ దోషులుగా ప్రకటించింది. 60 ఏళ్ల భాస్కర్ సవానికి 420 ఏళ్లు, 58 ఏళ్ల అరుణ్ సవానికి 415 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. వీరితో పాటు ఉన్న మరో సహచరుడు అలెగ్జాండ్రా రాడోమియాక్‌కు కూడా 40 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. వీరి నేరాల తీవ్రత దృష్ట్యా 2026 జూలై 8, 9 తేదీల్లో కోర్టు తుది తీర్పు వెలువరించనుంది.
Follow Us