/rtv/media/media_files/2026/04/08/china-2026-04-08-16-42-04.jpg)
అమెరికా-ఇరాన్ మధ్య 38 రోజుల పాటు సాగిన భీకర యుద్ధానికి తెరదించుతూ కుదిరిన కాల్పుల విరమణ వెనుక చైనా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. పశ్చిమ ఆసియాలో రక్తపాతాన్ని ఆపడానికి ఇరాన్‌ను చర్చల టేబుల్ వద్దకు తీసుకురావడంలో చైనా కృషి ఉందని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంగీకరించారు.
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గడం చైనాకు చాలా అవసరం. ముఖ్యంగా మే నెల మధ్యలో డోనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లి అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. ఈ పర్యటన సజావుగా సాగాలంటే యుద్ధం ఆగాలని చైనా భావించింది. ఇరాన్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కావడంతో, తనకున్న ప్రభావాన్ని ఉపయోగించి ఇరాన్‌ను శాంతి మార్గంలోకి మళ్లించేలా చైనా పావులు కదిపింది.
చైనా నేరుగా రంగంలోకి దిగకుండా తెర వెనుక ఉండి పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాల ద్వారా ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చింది. వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం కూడా శాంతి కోసం తాము "అలుపెరగని కృషి" చేస్తున్నామని స్పష్టం చేసింది. యుద్ధం కారణంగా వాయిదా పడిన తన పర్యటనను ట్రంప్ రీషెడ్యూల్ చేయడం కూడా చైనా దౌత్య విజయంగా భావిస్తున్నారు.
ఈ తాత్కాలిక కాల్పుల విరమణ ఫలితంగా ఏప్రిల్ 10న పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. అమెరికా తరపున వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ గాలిబాఫ్ ఈ చర్చలకు నాయకత్వం వహించనున్నారు. యుద్ధం మొదలైన తర్వాత రెండు దేశాల మధ్య జరుగుతున్న మొదటి ముఖాముఖి భేటీ ఇదే.
హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభం:
రెండు వారాల పాటు అమల్లో ఉండే ఈ కాల్పుల విరమణ సమయంలో, ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన 'హోర్ముజ్ జలసంధి'ని తిరిగి షిప్పింగ్ కోసం తెరుస్తారు. ఈ మార్గం ద్వారా వెళ్లే ఓడల నుంచి ఓమాన్ సమన్వయంతో ఇరాన్ కొంత రుసుము వసూలు చేయనుంది. ఈ నిధులను యుద్ధం వల్ల దెబ్బతిన్న ప్రాంతాల పునర్నిర్మాణం కోసం ఉపయోగించనున్నారు. మొత్తం మీద చైనా జోక్యంతో పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి తొలగిపోయినట్లు కనిపిస్తోంది.
Follow Us