/rtv/media/media_files/2026/04/11/iran-2-2026-04-11-12-46-30.jpg)
ఇరాన్‌లోని కాషన్‌లో ఉన్న యాహ్యాబాద్ రైల్వే వంతెనపై రైళ్ల సేవలు పునఃప్రారంభమయ్యాయి. కేవలం మూడు రోజుల క్రితం ఇజ్రాయెల్ పేల్చివేసిన ఈ వంతెనను, ఇరాన్ ఇంజనీర్లు రికార్డు సమయంలో మరమ్మతు చేసి తిరిగి వినియోగంలోకి తెచ్చారు. ఇరాన్ రక్షణ, నిర్మాణ రంగంలో ఎంత వేగంగా కోలుకోగలదో చెప్పడానికి ఇదొక నిదర్శనంగా నిలుస్తోంది.
అసలేం జరిగిందంటే, ఏప్రిల్ 7వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మీద దాడులు చేశాయి. ఇరాన్ ఆర్థిక, రవాణా వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా అక్కడి వంతెనలు, రోడ్లు, రైల్వే లైన్లను వారు టార్గెట్ చేశారు. అందులో భాగంగానే కాషాన్ సమీపంలోని యాహ్యాబాద్ వంతెన కూడా నేలమట్టమైంది. ఈ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు.
అయితే ఇరాన్ ఎక్కడా కూడా తన స్థైర్యాన్ని కోల్పోలేదు. శత్రువుల అంచనాలను తలకిందులు చేస్తూ కేవలం 72 గంటల్లోనే యుద్ధ ప్రాతిపదికన ఆ వంతెనను మరమ్మత్తు చేశారు అక్కడి ఇంజనీర్లు. ఏప్రిల్ 10న మొదటి గూడ్స్ రైలు వంతెనను విజయవంతంగా దాటింది. ఆ తర్వాత ఇతర రైళ్లు కూడా ప్రయాణించాయి. వంతెనను వేగంగా మరమ్మతు చేయడం ద్వారా, ఇరాన్ తన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని , వనరుల లభ్యతను ప్రపంచానికి ప్రదర్శించిందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలోని మిగిలిన చోట్ల దెబ్బతిన్న రోడ్లు, వంతెనల పనులు కూడా ఇరాన్ ఇలాగే వేగంగా పూర్తి చేస్తోంది.
Today, history comes alive again.
— Iran Embassy in Indonesia (@IraninIndonesia) April 11, 2026
The first train finally crosses the Yahyaabad Bridge in Kashan—once destroyed by an attack.
They tried to break it… but we rebuilt it.
Iran still stands.
/////
Hari ini, sejarah kembali hidup.
Kereta pertama akhirnya melintasi Jembatan… pic.twitter.com/uMaKlBXtLV
కాల్పుల విరమణ ఒప్పందం
ఇదిలా ఉండగా, ఇరు పక్షాల మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఈరోజు అమెరికా-ఇరాన్ ముఖాముఖి చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ స్పీకర్ నేతృత్వంలోని ఇరాన్ ప్రతినిధి బృందం పాకిస్తాన్‌కు చేరుకోగా, ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం కూడా అక్కడికి వచ్చింది. ట్రంప్ అభ్యర్థన మేరకు, లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులను కూడా నిలిపివేసింది. చర్చలలో ఇరాన్ పాల్గొనడానికి ఇది ఒక కీలక షరతు.
ఈ చర్చలలో హోర్ముజ్ జలసంధిని తెరవడం, ఆంక్షలను ఎత్తివేయడం, ప్రాంతీయ స్థిరత్వం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. యుద్ధానికి పూర్తి ముగింపు పలకడం కోసం ఇరాన్, అమెరికాకు 10- డిమాండ్లను ఇప్పటికే సమర్పించింది. అయితే ఇరాన్ డిమాండ్లకు అమెరికా స్పందన ఎలా ఉంటుందో, ఈ చర్చలు ఏమైనా ఫలితాలనిస్తాయో లేక మధ్యప్రాచ్యంలో మరో యుద్ధానికి దారితీస్తాయో వేచి చూడాలి.
Follow Us