/rtv/media/media_files/2026/04/21/trump-2026-04-21-06-39-49.jpg)
Iran-US peace deal
Iran-US peace deal : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు తెరదించుతూ ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. గత కొన్ని నెలలుగా పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో యుద్ధ వాతావరణాన్ని సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించిన పరిణామాలకు ఈ డీల్‌తో ఎట్టకేలకు చెక్ పడింది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ఇకపై ఎలాంటి సుంకాలు (టారిఫ్‌లు) లేకుండా స్వేచ్ఛా రవాణా కోసం తెరుచుకుంటుందని ఆయన వెల్లడించారు.
ఈ చారిత్రాత్మక నిర్ణయం నేపథ్యంలో ఇరాన్ ఓడరేవులపై విధించిన దిగ్బంధనాన్ని, అమెరికా నావికా దళ (Naval) ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని ట్రంప్ తన సైన్యాన్ని ఆదేశించారు. ఈ పరిణామాన్ని హర్షిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురు రవాణా నౌకలకు ఆయన ఉత్సాహంగా పిలుపునిచ్చారు. "ప్రపంచంలోని నౌకలారా.. మీ ఇంజిన్లను స్టార్ట్ చేయండి, హోర్ముజ్ జలసంధి ద్వారా చమురును తరలించండి" అంటూ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో ట్రంప్ పేర్కొన్నారు. ఈ శాంతి ఒప్పందం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి స్థాయి నిబంధనలు, లోతైన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
అమెరికా ప్రకటనపై ఇరాన్ సైతం సానుకూలంగా స్పందిస్తూ అమెరికాతో అవగాహన ఒప్పందం కుదిరినట్లు ధ్రువీకరించింది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని ముగించేందుకు ఈ డీల్ దోహదపడుతుందని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ శాఖ మంత్రి ఘరీబా బాదీ ప్రకటించారు. ఈ శాంతి ఒప్పందం కోసం గత 60 రోజులుగా ఇరు పక్షాల మధ్య రహస్యంగా, సుదీర్ఘంగా చర్చలు జరిగాయని ఆయన వెల్లడించారు. ఈ నెల 19వ తేదీన స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాలు ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేయనున్నట్లు తెలిపారు.
అయితే, ఇదే సమయంలో ఇరాన్ తన పాత శత్రువు పట్ల కొంత అప్రమత్తతను వ్యక్తంచేసింది. "అమెరికాతో డీల్ కుదుర్చుకున్నంత మాత్రాన శత్రువును పూర్తిగా నమ్మినట్లు కాదు" అని ఘరీబా బాదీ స్పష్టం చేశారు. ఒప్పందంలో భాగంగా అమెరికా ఇచ్చిన హామీలకు ఎంతవరకు కట్టుబడి ఉంటుందో తాము నిశితంగా పరిశీలిస్తామని చెప్పారు. ఈ శాంతి ఒప్పందం అమలులోకి వస్తే.. కేవలం ఇరాన్‌లోనే కాకుండా లెబనాన్‌తో పాటు పశ్చిమాసియాలోని ఇతర సమస్యాత్మక ప్రాంతాలలో జరుగుతున్న మిలిటరీ ఆపరేషన్స్ (సైనిక దాడులు) అన్నీ పూర్తిగా నిలిచిపోనున్నాయి.
మరోవైపు, పొరుగు దేశమైన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం ఈ అంతర్జాతీయ శాంతి ఒప్పందాన్ని ధ్రువీకరించారు. ఇరు దేశాల మధ్య వచ్చే శుక్రవారం (ఈ నెల 19న) సంతకాల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు అదుపులోకి రావడంతో పాటు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరట లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
Follow Us