/rtv/media/media_files/2026/06/13/declining-population-in-china-2026-06-13-08-10-22.jpg)
Declining population in China
China : అగ్రరాజ్యం అమెరికాతో పోటీ పడుతూ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలను కుంటున్న చైనా కలలకు ఆ దేశ జనాభా సంక్షోభమే పెద్ద ప్రతిబంధకంగా మారింది. చైనాలో వేగంగా పడిపోతున్న జనాభా రేటు కారణంగా దేశాభివృద్ధి కుంటుపడనుందని అమెరికన్ ఇన్వెస్టర్, మార్టిన్ క్యాపిటల్ సంస్థ వ్యవస్థాపకుడు రాడ్ డీ మార్టిన్ తాజాగా విశ్లేషించారు. ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే చైనా జనాభా మళ్లీ పుంజుకోవడం దాదాపు అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. కాలం గడిచే కొద్దీ చైనాలో వినియోగదారులు తగ్గిపోయి, మార్కెట్ కుంచించుకు పోతుందని.. ఫలితంగా గ్లోబల్ సూపర్ పవర్ కావాలన్న చైనా ఆశలు అడియాసలవుతాయని ఆయన హెచ్చరించారు.
చైనా పతనానికి మునుపటి తరంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలే ప్రధాన కారణమని ఆర్థిక, సామాజిక నిపుణులు బలంగా చెప్తున్నారు. 1980 నుండి 2016 మధ్య కాలంలో చైనా కఠినంగా అమలు చేసిన ‘ఏక సంతాన విధానం’ (సింగిల్ చైల్డ్ పాలసీ) వల్ల జనాభాలో స్త్రీ, పురుష నిష్పత్తి ఘోరంగా దెబ్బతింది. ఈ విధానానికి తోడు సమాజంలో అబ్బాయిలే కావాలనే పాతచింతకాయ భావనలు, ఆడపిల్లలు పుట్టకుండా చేసిన అబార్షన్ల కారణంగా ప్రస్తుతం చైనాలో సంతానోత్పత్తికి సరిపడా సంఖ్యలో మహిళలే లేరని రాడ్ డీ మార్టిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐరోపా, జపాన్ దేశాలలో కూడా జనాభా తగ్గుతున్నప్పటికీ.. అక్కడ ప్రక్రియ క్రమంగా జరుగుతోందని, కానీ చైనాలో మాత్రం మహిళల సంఖ్య విపరీతంగా తగ్గిపోవడంతో ఈ మార్పులు అత్యంత తీవ్రస్థాయిలో, ఆకస్మికంగా కనిపిస్తున్నాయని వివరించారు.
చైనా జాతీయ గణాంక వ్యవస్థ తాజాగా విడుదల చేసిన దేశవ్యాప్త జనాభా రిపోర్టు ఈ భయాలను నిజం చేస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాలలో ఒకటైన చైనాలో గత నాలుగేళ్లుగా జనాభా పెరుగుదల రేటు నిరంతరం పడిపోతోంది. కిందటేడాది దేశ మొత్తం జనాభా 140.83 కోట్లు ఉండగా, ప్రస్తుత గణాంకాల ప్రకారం అది 140.49 కోట్లకు పడిపోయింది. అంటే కేవలం ఒకే ఏడాదిలో దేశ జనాభా ఏకంగా 34 లక్షల మేర తగ్గిపోయింది. 2015 నాటి పరిస్థితులతో పోల్చి చూస్తే.. గడిచిన ఈ పదేళ్ల కాలంలోనే చైనాలో వార్షిక జననాల సంఖ్య దాదాపు కోటి వరకు తగ్గిపోవడం గమనార్హం.
ఇక 2025లో నమోదైన జననాల సంఖ్య చైనా చరిత్రలోనే ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా కేవలం 79 లక్షల మంది శిశువులు మాత్రమే జన్మించారు. ఇది అంతకుముందు ఏడాది (2024) నమోదైన 95.4 లక్షల జననాలతో పోలిస్తే ఏకంగా 17 శాతం తక్కువ. 1949లో చైనా రికార్డుల నమోదు ప్రారంభమైనప్పటి నుండి అత్యల్ప జననాలు నమోదైన సంవత్సరంగా నిలిచిన 2023 రికార్డును, ఈ ఏడాది గణాంకాలు తిరగరాశాయి. జనాభా క్షీణతను ముందుగానే ఊహించిన చైనా ప్రభుత్వం 2016లోనే ఏక సంతాన విధానానికి స్వస్తి పలికి, ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను కనేందుకు అనుమతులు ఇచ్చినప్పటికీ.. పెరిగిన జీవన, విద్యా ఖర్చుల భారం కారణంగా ప్రస్తుత తరం యువత పిల్లలను కనేందుకు ఆసక్తి చూపడం లేదు.
Follow Us