/rtv/media/media_files/2026/05/24/pakistan-train-attack-2026-05-24-12-59-55.jpg)
Pakistan train attack
Pakistan train attack : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఆదివారం ఉదయం ఘోర ఉగ్రదాడి సంభవించింది. ప్రావిన్స్ రాజధాని క్వెట్టా-చమన్ గేట్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న 'జాఫర్ ఎక్స్‌ప్రెస్' రైలును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ భీకర పేలుడులో 23 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్న పిల్లలతో పాటు పాక్ సైనిక సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
స్థానిక మీడియా మరియు భద్రతా అధికారుల కథనం ప్రకారం.. ఈ దాడి అత్యంత వ్యూహాత్మకంగా జరిగింది. క్వెట్టా కంటోన్మెంట్ నుండి పెషావర్‌కు బయలుదేరిన జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో పాకిస్థాన్ సైన్యానికి చెందిన భారీ సంఖ్యలో సిబ్బంది, ఇంటెలిజెన్స్ అధికారులు ప్రయాణిస్తున్నారు. పాక్ ఆర్మీకి వీలైనంత ఎక్కువ స్థాయిలో ప్రాణ నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే రైల్వే ట్రాక్ సమీపంలో ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం రైలు చమన్ గేట్ సమీపానికి రాగానే ఈ పేలుడు సంభవించింది.పేలుడు ధాటికి జాఫర్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఒక బోగీ పూర్తిగా ధ్వంసమవడమే కాకుండా, అందులో భారీగా మంటలు చెలరేగాయి.
ఈ పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే.. రైల్వే ట్రాక్‌కు సమీపంలో ఉన్న అనేక ఇళ్లు, భవనాల కిటికీలు, అద్దాలు పగిలిపోయాయి. పట్టాల పక్కన నిలిపి ఉంచిన పలు వాహనాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఘోర ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని నిషేధిత ఉగ్రవాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) అధికారికంగా ప్రకటించుకుంది. ఈ సంస్థకు చెందిన అత్యంత ప్రమాదకరమైన 'మజీద్ బ్రిగేడ్' ఈ దాడిని అమలు చేసినట్లు తెలుస్తోంది."క్వెట్టా కంటోన్మెంట్ నుండి పెషావర్‌కు పాకిస్థాన్ సైనిక సిబ్బంది ప్రయాణిస్తున్నారనే కచ్చితమైన సమాచారంతోనే ఈ ఆత్మాహుతి దాడి చేశాం." అని BLA ప్రతినిధి జియాండ్ బలూచ్ ప్రకటించారు.
గతంలో కూడా ఈ జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును బలూచ్ తిరుగుబాటుదారులు లక్ష్యంగా చేసుకున్నారు. ఒకానొక సందర్భంలో ఈ రైలును హైజాక్ చేసి, పాక్ ఆర్మీ అధికారులను ఊచకోత కోసిన చరిత్ర కూడా ఉంది. క్వెట్టా-పెషావర్ మార్గంలో సైనిక కదలికలు ఎక్కువగా ఉండటమే ఈ రైలుపై తరచూ దాడులు జరగడానికి ప్రధాన కారణం.ఘటన జరిగిన వెంటనే పాకిస్థాన్ రక్షణ దళాలు, సహాయక చర్యల బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని దిగ్బంధించాయి. క్షతగాత్రులను వెంటనే క్వెట్టా సివిల్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. క్వెట్టా సివిల్ హాస్పిటల్‌లో అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) ప్రకటించి బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
బలూచిస్థాన్ హోం వ్యవహారాల ప్రత్యేక సహాయకుడు బాబర్ యూసఫ్‌జాయ్ మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు స్థానిక ప్రజలు పేలుడు జరిగిన ప్రాంతంలో గుమిగూడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తి గుర్తింపును కనుగొనేందుకు, ఈ దాడి వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను ఛేదించడానికి పోలీసులు, ఇంటెలిజెన్స్ సంస్థలు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నాయి.
Follow Us