/rtv/media/media_files/2024/10/27/NfjYu3JLNOYk3CXs9uRN.jpg)
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో లోపాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. పాశ్చాత్య నిఘా సంస్థలు ఆయన ఇంటర్నల్ సెక్యురిటీ సర్కిల్‌లోకి చొరబడ్డాయనే సంచలన వార్తలు వెలుగులోకి వచ్చాయి. 2025 వేసవిలో ఇజ్రాయెల్ దాడుల భయంతో ఇరాన్ తన VIPలందరి మొబైల్ ఫోన్లను నిషేధించింది. అయితే, టెహ్రాన్ చేసిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు ఆ దేశ అగ్ర నాయకత్వానికే ముప్పుగా మారింది.
డ్రైవర్లు, అంగరక్షకుల ఫోన్లే లక్ష్యంగా..
నేతల ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఇరాన్ ప్రభుత్వం, వారి సెక్యురిటీ, డ్రైవర్ల ఫోన్లపై ఫొకస్ పెట్టలేదు. దీనిని అవకాశంగా తీసుకున్న మొసాద్, రక్షణ సిబ్బంది మొబైల్ ఫోన్లతో నాయకుల కదలికలను ట్రాక్ చేయడం ప్రారంభించింది. విచారణలో ఖమేనీకి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక అంగరక్షకుడు CIA గూఢచారిగా పనిచేస్తున్నట్లు డైలీ మెయిల్ నివేదిక పేర్కొంది.
ఇరాన్‌లో నిరసనలు మొదలైనప్పటి నుండి ఖమేనీ ఒక రహస్య బంకర్‌లో తలదాచుకుంటున్నారు. ఆ బంకర్‌లోకి వెళ్లే లిఫ్ట్ కిందకు చేరడానికే ఐదు నిమిషాల సమయం పడుతుందంటే దాని లోతును అర్థం చేసుకోవచ్చు. ఆ స్పైతోనే దాడికి సరైన సమయాన్ని నిఘా సంస్థలు నిర్ధారించుకున్నట్లు సమాచారం.
ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్
చాలా ఏళ్ల క్రితమే టెహ్రాన్ నగర ట్రాఫిక్ కెమెరా నెట్‌వర్క్‌ను మొసాద్ హ్యాక్ చేసింది. ముఖ్యంగా పాశ్చర్ స్ట్రీట్‌లోని అత్యున్నత స్థాయి కాంపౌండ్ ప్రవేశ ద్వారం వద్ద కెమెరాలను నిశితంగా పరిశీలించడం ద్వారా, ఏ అధికారికి ఏ అంగరక్షకుడు ఉన్నాడు, వారి వాహనాలు ఎక్కడ పార్క్ చేస్తున్నారు అనే వివరాలను సేకరించింది. ఈ పక్కా ప్లాన్‌తోనే శనివారం క్షిపణి దాడికి వ్యూహం రచించారు. దాడి సమయంలో గూఢచారి అన్ని కమ్యూనికేషన్లను నిలిపివేసి అక్కడి నుండి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రార్థన యాప్ ద్వారా మనస్తత్వ యుద్ధం
టెహ్రాన్‌పై బాంబు దాడి ప్రారంభమైన వెంటనే, ఇజ్రాయెల్ మరొక వినూత్న వ్యూహాన్ని అమలు చేసింది. ఇరాన్‌లో లక్షలాది మంది వాడుతున్న "బడేషెబా" అనే ప్రార్థన సమయ క్యాలెండర్ యాప్‌ను ఇజ్రాయెల్ హ్యాక్ చేసింది. ఉదయం 9:52 గంటలకు, మొదటి పేలుడు సంభవించిన వెంటనే, ఇరాన్ ప్రజల ఫోన్లకు సందేశాలు రావడం మొదలయ్యాయి. "సహాయం అందుతోంది... మీ మతాధికారులకు వ్యతిరేకంగా తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది" అనే సందేశాలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ పరిణామాలు ఇరాన్ ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని ఎత్తిచూపుతుండగా, ఇజ్రాయెల్ తన సాంకేతిక, గూఢచారి సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.
Follow Us