China : చైనాను వణికిస్తున్న వింత వ్యాధి: వేల సంఖ్యలో పశువుల మృతి!

చైనాలో జంతువులకు సోకుతున్న ఒక ప్రమాదకరమైన వ్యాధి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. మన పొరుగు దేశమైన చైనాలో 'ఫుట్ అండ్ మౌత్' (గాలికుంటు వ్యాధి) వేగంగా వ్యాపిస్తుండటంతో ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తమైంది

New Update
china

చైనాలో జంతువులకు సోకుతున్న ఒక ప్రమాదకరమైన వ్యాధి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. మన పొరుగు దేశమైన చైనాలో 'ఫుట్ అండ్ మౌత్' (గాలికుంటు వ్యాధి) వేగంగా వ్యాపిస్తుండటంతో ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా వాయువ్య ప్రాంతాల్లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడటంతో చైనా తన సరిహద్దుల వద్ద నిఘాను కట్టుదిట్టం చేసింది. ఈ వ్యాధిని అదుపు చేయడానికి వ్యాక్సిన్ల తయారీని వేగవంతం చేయడమే కాకుండా, ఇప్పటికే వ్యాధి సోకిన వేలాది పశువులను చంపేస్తోంది.

SAT-1 సెరోటైప్

చైనా వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం, ఇది వారి దేశంలో పుట్టిన వ్యాధి కాదు, బయట దేశాల నుంచి వచ్చిందని వారు చెబుతున్నారు. గన్సు ప్రావిన్స్, షిన్జియాంగ్ ప్రాంతాల్లో సుమారు 6,229 పశువులు ఈ వ్యాధి బారిన పడ్డాయి. వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి అధికారులు పశువులను చంపి, ఆ ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారు. ఈ వ్యాధిని SAT-1 సెరోటైప్ అని పిలుస్తారు. ఇది సాధారణంగా దక్షిణాఫ్రికా ప్రాంతాల్లో కనిపిస్తుంది, కానీ చైనాలో బయటపడటం ఇదే మొదటిసారి అని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఈ కొత్త రకం వ్యాధిపై పనిచేయడం లేదు. 2025 తర్వాత ఈ వ్యాధి ఆఫ్రికా నుంచి మధ్యప్రాచ్యం, పశ్చిమ ఆసియా, దక్షిణ ఆసియాలోని కొన్ని ప్రాంతాలకు పాకింది. కజకిస్తాన్, మంగోలియా, రష్యా సరిహద్దుల ద్వారా అక్రమ రవాణా లేదా స్మగ్లింగ్ వల్ల ఈ వ్యాధి తమ దేశంలోకి వచ్చి ఉంటుందని చైనా అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే సరిహద్దు రాష్ట్రాల్లో గస్తీని పెంచి, జంతువుల రవాణాను కఠినంగా పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైనదని, దీనివల్ల మరణాల రేటు 50 శాతం కంటే ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం జంతువుల స్పర్శ ద్వారానే కాకుండా, గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది. చిన్న చిన్న జంతువులు దీనివల్ల త్వరగా చనిపోతున్నాయి. దీనివల్ల పశువుల ఉత్పత్తి తగ్గిపోయి ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి చైనా రెండు కొత్త వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఇవి ఒక నెలలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

చైనా పశుసంవర్ధక రంగం ఇప్పటికే మాంసం ధరలు పడిపోవడం, తక్కువ డిమాండ్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతోంది. ఇప్పుడు ఈ కొత్త వ్యాధి రావడంతో పశువుల ధరలు ఇంకా పడిపోయే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున వ్యాధి సోకకుండా అడ్డుకోవడం ఇప్పుడు చైనా ముందున్న అతిపెద్ద సవాలు.

Advertisment
తాజా కథనాలు