/rtv/media/media_files/2026/05/24/returns-after-three-years-2026-05-24-08-34-14.jpg)
China Beauty Influencer
China Beauty Influencer : డిజిటల్ ప్రపంచంలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఈ రోజుల్లో పెద్ద విశేషమేమీ కాదు. అయితే, అంతర్జాతీయంగా సెలబ్రిటీ హోదా ఉన్నవారికే ఇలాంటి అద్భుతాలు సాధ్యమవుతుంటాయి. ఉదాహరణకు, గ్లోబల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 2024లో యూట్యూబ్‌లోకి అడుగుపెట్టిన 24 గంటల్లోనే దాదాపు రెండు కోట్ల (20 మిలియన్లు) మంది సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుని ప్రపంచ రికార్డులను తిరగరాశారు. రొనాల్డోకు ఉన్న ప్రపంచవ్యాప్త క్రేజ్ దృష్ట్యా అది సాధ్యమైందని అందరూ భావించారు. కానీ, దానికి ఏమాత్రం తీసిపోని విధంగా చైనాకు చెందిన ఓ సాధారణ యువతి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై అకౌంట్ ఓపెన్ చేసిన కేవలం 24 గంటల్లోనే కోటి (10 మిలియన్లు) మంది ఫాలోవర్స్‌ను సంపాదించి సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఆమె పేరే జియాంగ్ చెంగ్లాన్. చైనాలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్యూటీ మేకప్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ 'డౌయిన్' (Douyin - చైనీస్ టిక్‌టాక్) లో ఆమె గతంలో చాలా చురుగ్గా ఉండేది. ఆ సమయంలో ఆమెకు ఏకంగా 3 కోట్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉండేవారు. అయితే, ఎంతో విజయవంతంగా సాగుతున్న తన సోషల్ మీడియా ప్రయాణాన్ని ఆమె 2023 మే నెలలో అకౌంట్ వాడటం ఆపేయడం ద్వారా అకస్మాత్తుగా ముగించేసింది. ఆమె ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకుందో, అసలు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియక మిలియన్ల కొద్దీ ఉన్న ఆమె అభిమానులు తీవ్ర అయోమయానికి గురయ్యారు.
దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, మే 13వ తేదీన జియాంగ్ చెంగ్లాన్ మళ్లీ అదే 'డౌయిన్' యాప్‌లో తన సొంత పేరుతో సరికొత్త అకౌంట్‌ను ప్రారంభించింది. ఇక్కడే డిజిటల్ ప్రపంచం ముక్కున వేలేసుకునేలా ఒక వింత జరిగింది. సోషల్ మీడియాలో నిత్యం కొత్త ముఖాలు వస్తున్న ఈ రోజుల్లో.. మూడేళ్లుగా దూరంగా ఉన్నా కూడా అభిమానులు ఆమెను అస్సలు మర్చిపోలేదు. ఆమె కొత్త అకౌంట్ క్రియేట్ చేసినట్లు తెలిసిన వెంటనే అభిమానులు ఎగబడ్డారు. ఫలితంగా, కేవలం 24 గంటల వ్యవధిలోనే ఆమె అకౌంట్ కోటి మంది ఫాలోవర్ల మార్కును దాటి సరికొత్త రికార్డును నమోదు చేసింది.
ఈ అసాధారణ రికార్డుతో చైనా మీడియాలో జియాంగ్ చెంగ్లాన్ పేరు మారుమోగిపోయింది. ఈ నేపథ్యంలో స్థానిక మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన మూడేళ్ల అజ్ఞాతవాసానికి గల అసలు కారణాలను వెల్లడించింది.
"మూడేళ్ల క్రితం నా మాజీ ఏజెన్సీ అయిన 'షాంగై జిన్ జియా' కంపెనీతో నాకు కొన్ని తీవ్రమైన విభేదాలు, గొడవలు జరిగాయి. ఆ చట్టపరమైన సమస్యల వల్లే నేను ఇన్నాళ్లూ సోషల్ మీడియాకు, నా అభిమానులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. నా పాత అకౌంట్ అయిన 'చెంగ్షియాన్' ట్రేడ్‌మార్క్ హక్కులు పూర్తిగా ఆ కంపెనీ పేరు మీదే ఉన్నాయి. అందుకే ఆ అకౌంట్‌ను వదిలేసి, ఇప్పుడు నా సొంత పేరుతో సరికొత్త అకౌంట్‌ను ప్రారంభించాను. ఆ పాత అకౌంట్ పేరు మీద ప్రస్తుతం నడుస్తున్న ఆన్‌లైన్ షాపులతో నాకు ఎలాంటి సంబంధం లేదు, అవి నావి కావు. నాపై ఉన్న నమ్మకం, ప్రేమాభిమానాలతో అభిమానులెవరూ ఆ పాత షాపుల నుంచి ఎలాంటి వస్తువులను ఆర్డర్ చేయవద్దని కోరుతున్నాను" అని జియాంగ్ స్పష్టం చేసింది.
కంపెనీలతో వివాదాలు వచ్చి కెరీర్ నాశనమైపోతుందనుకున్న తరుణంలో, కేవలం తన టాలెంట్, అభిమానుల నమ్మకంతో జియాంగ్ చెంగ్లాన్ సాధించిన ఈ విజయం సోషల్ మీడియా చరిత్రలోనే ఒక అద్భుతంగా నిలిచిపోయింది. కంటెంట్ బాగుంటే అభిమానులు ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటారని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
Follow Us