PoK : పాక్ పాపం పండింది.. POKలో పోలీసులను కొట్టి చంపిన ప్రజలు.. అసలేం జరుగుతోంది?

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ జరుగుతున్న హింసాత్మక నిరసనలు పాక్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. సైన్యం కాల్పులు, లాఠీఛార్జ్ మూలంగా ఐదుగురు పోలీసులు సహా మొత్తం ఎనిమిది మంది చనిపోయినట్లు తెలుస్తోంది.

New Update
FotoJet - 2026-06-08T122153.611

People attacked Pak police in pok. Five killed..

PoK : పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ జరుగుతున్న హింసాత్మక నిరసనలు పాక్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. నిరసనకారులను అదుపు చేయడం అటు పోలీసులకు, ఇటు ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదు. జూన్ 9న జరగనున్న భారీ నిరసన ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని, ప్రాంతంలోని ప్రతి అంగుళాన్ని సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అక్కడ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. అయినప్పటికీ, ఈ మార్చ్‌లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని 'జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ' (JAAC) పిలుపునిచ్చింది.

శవయాత్రలో చెలరేగిన హింస

పీఓకేలో నిరసనలు కొత్తేమీ కాకపోయినప్పటికీ, ఈసారి హింస ఊహించని స్థాయికి చేరుకుంది. ఆదివారం అర్థరాత్రి, గత నిరసనల్లో మరణించిన 'షాజైబ్' అనే వ్యక్తి అంత్యక్రియల సందర్భంగా పాకిస్తాన్ సైన్యానికి, స్థానిక ప్రజలకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. అంత్యక్రియలకు హాజరైన వారిపై సైన్యం కాల్పులు జరపడం, లాఠీఛార్జ్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఈ తాజా హింసలో ఐదుగురు పోలీసులు సహా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. రావలకోట్ ప్రాంతంలో జరిగిన ఈ ఘర్షణల అనంతరం, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జూన్ 9న లాంగ్ మార్చ్‌కు పిలుపునివ్వడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.

టెర్రరిజం ఆరోపణలను తిరస్కరించిన JAAC

ఉద్యమాన్ని అణచివేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం జాయింట్ అవామీ యాక్షన్ కమిటీపై తీవ్ర నిబంధనలు విధించింది. ఈ సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని, ప్రాంతంలో అరాచకం సృష్టిస్తోందని ఆరోపిస్తూ దీనిని యాంటీ టెర్రరిజం చట్టం పరిధిలోకి తెచ్చింది. అయితే, జేఏఏసీ కీలక నేత శౌకత్ నవాజ్ మీర్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాము ఏ దేశానికి, సంస్థకు లేదా వ్యక్తికి వ్యతిరేకం కాదని, తమ శాంతియుత ప్రజా ఉద్యమానికి ఉగ్రవాద రంగు పులమడం ఘోరమైన అన్యాయమని ఆయన ఆడియో సందేశంలో పేర్కొన్నారు. అలాగే, జూన్ 9న జరగబోయే చారిత్రాత్మక మార్చ్‌లో ప్రజలంతా ఐక్యంగా పాల్గొనాలని కోరారు.

నిరసనకారుల ప్రధాన డిమాండ్లు ఏమిటి?

జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ముఖ్యంగా కొన్ని ప్రధాన డిమాండ్లతో ఈ పోరాటాన్ని నడుపుతోంది:

రాజకీయ ప్రాతినిధ్యంపై అభ్యంతరం: జమ్మూ కాశ్మీర్ నుండి వలసవచ్చి పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాలలో నివసిస్తున్న వారి కోసం పీఓకే అసెంబ్లీలో 12 సీట్లు కేటాయించారు. ఈ రిజర్వ్‌డ్ సీట్లను రద్దు చేయాలని సంస్థ డిమాండ్ చేస్తోంది. ఈ సీట్ల వల్ల స్థానికేతరులు పీఓకే రాజకీయాలను శాసిస్తున్నారని, పాకిస్తాన్‌లోని పెద్ద రాజకీయ పార్టీలు ఇక్కడి ప్రభుత్వాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నాయని వారి ఆరోపణ.

మౌలిక వసతులు, ఆర్థిక సంస్కరణలు: ఈ ప్రాంతానికి చౌకగా విద్యుత్ సరఫరా చేయాలని, ఉచిత ఆరోగ్య సేవలు అందించాలని, ఆర్థిక సంస్కరణలు చేపట్టాలని ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.


చేతులెత్తేసిన స్థానిక పోలీసులు.. రంగంలోకి పాక్ సైన్యం

నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. పీఓకేలో ప్రస్తుత శాంతిభద్రతల క్షీణత స్థానిక పరిపాలన, పోలీసు వ్యవస్థల వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్ ఇప్పటికే తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP), బలూచ్ తిరుగుబాటుదారులు,  అఫ్గాన్ తాలిబాన్ వంటి తీవ్రవాద శక్తులతో బహుముఖ పోరాటం చేస్తోంది. భద్రతా దళాల వనరులను ఆయా సరిహద్దు ప్రాంతాలకు తరలించడం వల్లే పీఓకేలో పరిస్థితి చేయి దాటిందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి అలజడిని అణచడానికి ఇస్లామాబాద్ నుండి ప్రత్యేక పారామిలట్రీ దళాలు, అదనపు రేంజర్స్ బలగాలను రప్పించారు. స్థానిక నేత అంత్యక్రియల్లో సైన్యాన్ని ప్రజలు ఎదిరించడం తీవ్రమైన విషయమని, ఇంటర్నెట్ బంద్ ,సెర్చ్ ఆపరేషన్ల వల్ల ప్రజల్లో అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

స్తంభించిన జనజీవనం

పీఓకే రాజధాని ముజఫరాబాద్‌లో వాతావరణం అత్యంత భయానకంగా మారింది. సైన్యం అంగుళం అంగుళాన్ని జల్లెడ పడుతుండటంతో, ఎప్పుడు లాక్‌డౌన్ విధిస్తారో అనే భయంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. అంతర్జాతీయ డిజిటల్ నిఘా సంస్థ 'నెట్‌బ్లాక్స్' (NetBlocks) తెలిపిన వివరాల ప్రకారం, పీఓకేలో మొబైల్ ఇంటర్నెట్ , టెలికాం సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అదనపు సైనిక బలగాల మోహరింపు, సమాచార వ్యవస్థల బంద్ కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనలో గడుపుతున్నారు.

Advertisment
తాజా కథనాలు