/rtv/media/media_files/2026/03/13/oman-2026-03-13-21-37-37.jpg)
ఓమన్‌లోని సోహార్ నగరంలో జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు. దీని పట్ల భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో సోహార్‌లోని అల్-అవాహి పారిశ్రామిక ప్రాంతంలో ఈ డ్రోన్ కూలిపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో మొత్తం 11 మందికి గాయాలు కాగా, వారిలో 10 మంది భారతీయ పౌరులే ఉన్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గల్ఫ్ విభాగం అదనపు కార్యదర్శి అసిమ్ మహాజన్ వెల్లడించారు. గాయపడిన వారిలో ఐదుగురు ఇప్పటికే చికిత్స పొంది ఆస్పత్రి నుంచి డిస్కార్జ్ అయ్యారని, మిగిలిన ఐదుగురికి చికిత్స అందుతోందని, ఎవరికీ ప్రాణాపాయం లేదని ఆయన భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు సహాయం చేయడానికి, వారి పార్థివ దేహాలను స్వదేశానికి తీసుకురావడానికి భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
భద్రతపై ప్రభుత్వం గట్టి నిఘా
గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కోటి మందికి పైగా భారతీయుల భద్రతపై ప్రభుత్వం గట్టి నిఘా ఉంచింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడి ఈ ప్రాంతంలోని భారతీయుల రక్షణ, ఇంధన రవాణా మార్గాల భద్రత గురించి చర్చించారు. మరోవైపు, ఇరాన్‌లో ఉన్న సుమారు 170 మంది భారతీయులు భూ సరిహద్దు దాటి ఆర్మేనియాకు చేరుకున్నారని, వారిని త్వరలోనే విమానాల ద్వారా భారతదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. సముద్ర మార్గాల్లో ఉన్న నావికుల భద్రత కోసం కూడా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి సమీపంలో వేల సంఖ్యలో ఉన్న భారత నావికుల రక్షణకు సంబంధించి షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు తాజా మార్గదర్శకాలను జారీ చేస్తూ పరిస్థితిని సమీక్షిస్తోంది.
పశ్చిమాసియా యుద్ధం వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ లేదా గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న భయాలను ప్రభుత్వం పూర్తిగా కొట్టిపారేసింది. భారత్ ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించిందని, రిఫైనరీలన్నీ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. అయితే, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల వల్ల ప్రజలు భయపడి గ్యాస్ సిలిండర్లను అధికంగా బుక్ చేస్తున్నారని, రోజువారీ బుకింగ్స్ 50 లక్షల నుండి ఏకంగా 80 లక్షలకు పెరిగాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో చమురు,వంటగ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎవరూ భయాందోళనలకు గురై స్టాక్ జమ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వంటగ్యాస్ పై ఒత్తిడి తగ్గించడానికి వీలైన వారు పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వైపు మొగ్గు చూపాలని కోరుతూ, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Follow Us