Afghanistan : అఫ్గానిస్థాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు: నిద్రలోనే 11 మంది చిన్న పిల్లలు దుర్మరణం!

అఫ్గాన్ సరిహద్దు ప్రాంతాలపై పాకిస్తాన్ సైన్యం అర్ధరాత్రి వేళ ఆకస్మికంగా బాంబుల వర్షం కురిపించింది. ఈ భయానక వైమానిక దాడుల్లో 11 మంది అమాయక చిన్న పిల్లలు సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

New Update
pak

పాకిస్తాన్, అఫ్గానిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పీక్స్‌కు చేరాయి. అఫ్గాన్ సరిహద్దు ప్రాంతాలపై పాకిస్తాన్ సైన్యం అర్ధరాత్రి వేళ ఆకస్మికంగా బాంబుల వర్షం కురిపించింది. ఈ భయానక వైమానిక దాడుల్లో 11 మంది అమాయక చిన్న పిల్లలు సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంబుల దాడి జరిగిన సమయంలో బాధితులంతా గాఢనిద్రలో ఉండటంతో ప్రాణాలు రక్షించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.

అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వ అధికారిక ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఈ దాడులకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అఫ్గాన్‌లోని ఖోస్ట్ ,  కునార్, పక్తికా ప్రాంతాల్లోని పౌరుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పాక్ యుద్ధ విమానాలు బాంబులు కురిపించాయి.ఈ దాడుల్లో 11 మంది చిన్నారులు, ఒక మహిళ, ఒక వృద్ధుడు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన 14 మందిలో ఎక్కువ శాతం మహిళలు, పిల్లలే ఉన్నారు. ఖోస్ట్ ప్రాంతంలోని స్పెరా జిల్లాలో ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమవడంతో ఒకేచోట తొమ్మిది మంది చనిపోయారు. 

ఉగ్ర దాడుల నేపథ్యమే

ఈ దాడులపై పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించనప్పటికీ, గత కొద్దిరోజులుగా సరిహద్దుల్లో జరుగుతున్న ఉగ్ర దాడుల నేపథ్యమే దీనికి కారణమని తెలుస్తోంది. తమ దేశంలో దాడులకు తెగబడుతున్న తెహ్రీక్-ఎ-తాబన్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు అఫ్గానిస్థాన్ ఆశ్రయం ఇస్తోందని, వారి స్థావరాలనే తాము టార్గెట్ చేస్తున్నామని పాక్ గతంలో పలుమార్లు ప్రకటించింది. నిన్ననే పాక్ సరిహద్దు చెక్‌పోస్ట్‌పై జరిగిన దాడిలో ఆరుగురు పాక్ భద్రతా సిబ్బంది మరణించారు. దానికి ప్రతీకారంగానే పాక్ ఈ దాడులు చేసినట్లు భావిస్తున్నారు. 

అయితే తమ దేశంలో ఎలాంటి ఉగ్రవాద స్థావరాలు లేవని, పాకిస్తాన్ కావాలనే అఫ్గాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ పౌరులను చంపుతోందని తాలిబన్లు మండిపడుతున్నారు. గత ఫిబ్రవరి నెలలో ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగింది. ఆ సమయంలో అఫ్గాన్‌లోని ప్రధాన నగరాలైన కాబూల్, కాందహార్‌లపై కూడా పాక్ దాడులు చేసింది. ఆ తర్వాత చైనా మధ్యవర్తిత్వంతో కొద్దిరోజులు శాంతి చర్చలు జరిగి సరిహద్దులు ప్రశాంతంగా మారాయి. అయితే, తాజా దాడులతో ఇరు దేశాల మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. కేవలం ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే ఇరు దేశాల ఘర్షణల వల్ల 372 మంది అఫ్గాన్ పౌరులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.  

Advertisment
తాజా కథనాలు