Ebola Virus : 550 ఎబోలా కేసుల్లో 100 మంది మృతి: కాంగో వెల్లడి

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) లో ప్రాణాంతక ఎబోలా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా ఆ దేశంలోని ఇటురి ప్రావిన్సులో ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. మొత్తం 550 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

New Update
FotoJet - 2026-06-09T134221.991

100 deaths out of 550 Ebola cases

Ebola Virus : డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) లో ప్రాణాంతక ఎబోలా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా ఆ దేశంలోని ఇటురి ప్రావిన్సులో ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుండటంతో మృతుల సంఖ్య వంద దాటి, ప్రస్తుతం 101కి చేరుకుంది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అధికారిక నివేదిక ప్రకారం.. మొత్తం 550 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో 35 కొత్త కేసులు వెలుగుచూడటంతో పాటు 10 మంది మరణించినట్లు ప్రభుత్వం ధృవీకరించింది. కాంగో ప్రభుత్వం గత మే 15వ తేదీనే ఈ ఎబోలాకు చెందిన ‘బుందిబుగ్యో స్ట్రెయిన్’ను అధికారికంగా మహమ్మారిగా ప్రకటించింది. పొరుగు దేశమైన ఉగాండా నుండి ఈ కొత్త స్ట్రెయిన్ కాంగోలోకి వ్యాపించి ఉంటుందని అధికారులు బలంగా భావిస్తున్నారు.

నియంత్రణకు అడ్డుపడుతున్న సాయుధ గ్రూపులు

సుమారు 10 కోట్ల జనాభా ఉన్న కాంగో దేశంలో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందడం ఇది 17వ సారి. 1976లో ఇక్కడే తొలిసారిగా ఈ వైరస్‌ను గుర్తించారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి ఇంతలా అదుపు తప్పడానికి ప్రధాన కారణం ఆరంభంలో కేసులను గుర్తించడంలో జరిగిన ఆలస్యమేనని తెలుస్తోంది. ప్రస్తుతం ఇటురి, నార్త్ కివు, సౌత్ కివు ప్రావిన్సుల్లో ఎబోలా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. కాగా, వైరస్ పీడిత ప్రాంతాలైన జుగు, ఇరుము, మాంబసా వంటి చోట్ల క్రియాశీలంగా ఉన్న సాయుధ దళాలు (రెబెల్ గ్రూపులు) వైద్య సేవలకు, వైరస్ నియంత్రణ చర్యలకు పెను సవాల్‌గా మారాయి. ఆయా ప్రాంతాల్లో సాయుధ గ్రూపుల ఉనికి కారణంగా వైరస్‌ను అదుపు చేయడం అసాధ్యంగా మారుతోంది.

ఎబోలా తీవ్రత ఎక్కువగా ఉన్న మూడు కీలక ప్రావిన్సుల్లో సుమారు 120 సాయుధ దళాలు విస్తరించి ఉన్నాయి.ఇక్కడి ప్రాంతాల్లో నిరంతరం జరిగే వర్గ పోరు, రాజకీయ ప్రత్యర్థుల ఘర్షణలు మరియు విచ్చలవిడి అవినీతి వల్ల హింస రోజురోజుకు పెరిగిపోతోంది.ఈ అశాంతి కరమైన  హింసాత్మక వాతావరణం కారణంగా వైద్య బృందాలు ఆయా ప్రాంతాలకు నేరుగా వెళ్లి బాధితులను గుర్తించడం, వారిని ఐసోలేట్ చేయడం, అలాగే తగిన చికిత్స అందించడం అత్యంత కష్టసాధ్యంగా మారింది. ఒకవైపు ప్రాణాంతక వైరస్ వేగంగా విస్తరిస్తుండటం, మరోవైపు సాయుధ దళాల హింసాత్మక చర్యల నడుమ కాంగోలో ఎబోలా కేసులను గుర్తించి, మహమ్మారిని అదుపు చేయడం స్థానిక ప్రభుత్వానికి, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలకు ఒక పెద్ద పరీక్షగా మారింది.

Advertisment
తాజా కథనాలు