కేంద్ర బలగాల ఆధీనంలో హర్యానా..ఇంటర్నెట్ సేవలు నిలిపివేత..!!

author-image
By Bhoomi
New Update
కేంద్ర బలగాల ఆధీనంలో హర్యానా..ఇంటర్నెట్ సేవలు నిలిపివేత..!!

హర్యానాలోని గురుగ్రామ్ లో విశ్వహిందూ పరిషత్ చేపట్టిన మత ఊరేగింపు రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణకు దారి తీసింది. సోమవారం నుహ్ వద్ద వీహెచ్‎పి చేపట్టిన బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర నేపథ్క్ష్యంలో హింసచెలరేగింది. రెండు వర్గాలు పరస్పరం రాళ్లదాడికి దిగారు. దాదాపు 50వాహనాలకు నిప్పుపెట్టారు. హింసాత్మక ఘటనల్లో ఇద్దరు హోంగార్డులు మరణించారని..డీఎస్పీ సజ్జన్ సింగ్ తలకు గాయంకాగా, ఓ ఎస్సై తీవ్రంగా గాయపడ్డాడని స్థానిక పోలీసులు తెలిపారు.

హర్యానాలోని నుహ్‌లో కలకలం తర్వాత, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ ఘటనాస్థలానికి చేరుకున్నాయి. నుహ్ ప్రాంతం అంతా సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధీనంలోకి వెళ్లింది. 20 RAF కంపెనీలను నుహ్‌లో మోహరించారు. సీఆర్‌పీఎఫ్‌ బలగాలు కూడా నుహ్ ప్రాంతంలో మోహరించాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు చెబుతున్నారు. హింసను పూర్తిగా నియంత్రించడానికి వివిధ జిల్లాల 4 ఎస్పీలను పంపారు.

ఈ ఘర్షణపై రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ నిరసనకారులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు జరిగిన ఘటన దురదృష్టకరమని, రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ప్రస్తుతం నుహ్ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. కాగా ఈ ఘర్షణలో గాయపడిన పోలీసులు మేదాంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఘర్షణకు కారణం ఏంటంటే..
గురుగ్రామ్, అల్వార్ జాతీయ రహదారిపై మత ఊరేగింపును కొంతమంది అడ్డుకోవడంతో హింస చెలరేగింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరు వర్గాల వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. బుధవారం వరకు ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. ఘర్షణలు చెలరేగడంతో యాత్రలో పాల్గొన్న 2500 మంది భయందోళనతో సమీపంలోని నుల్హర్ మహదేవ్ ఆలయంలో తలదాచుకున్నారు. భజరంగ్ దళ్ కార్యకర్త సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ వీడియో ఈ ఘటనకు కారణమని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు