Hanuman Fifty Days: ఏభై రోజుల హనుమాన్ విజయవిహారం! ఎన్ని థియేటర్లో తెలిస్తే అవాక్కవుతారు!!

ఇప్పుడు ఒక సినిమా 30 రోజులు థియేటర్లలో కనిపించడమే వండర్. కానీ తేజా సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన హనుమాన్ 50 రోజుల పాటు 150 థియేటర్లలో రన్ అయి.. శతదినోత్సవం వైపు పరుగులు తీస్తోంది. చిన్న సినిమాగా వచ్చి.. సరికొత్త చరిత్ర సృష్టించింది హనుమాన్. 

New Update
Hanuman Fifty Days: ఏభై రోజుల హనుమాన్ విజయవిహారం! ఎన్ని థియేటర్లో తెలిస్తే అవాక్కవుతారు!!

Hanuman Fifty Days: ఒకప్పుడు ప్రజలకు సినిమానే అత్యంత ఇష్టమైన వినోదం. ఇప్పుడు కాదని కాదు. కానీ, సినిమా చూసే విధానం మారిపోయింది. అప్పట్లో ఒక సినిమా ఎన్ని రోజులు.. ఎన్ని థియేటర్లలో ఆడిందనేది సినిమా హిట్ లేదా ఫ్లాప్ అని చెప్పడానికి కొలమానంగా ఉండేది. అభిమానులు కూడా తమ హీరో సినిమా ఇన్ని సెంటర్లలో ఫిఫ్టీ.. అన్ని సెంటర్లలో హండ్రడ్ డేస్ అని చెప్పుకుని కాలర్ ఎగరేసేవారు. ఇప్పుడు ఆ విధానం మారిపోయింది. ఎంత డబ్బు వచ్చింది అనేదే లెక్క. ఆ లెక్క సరిపోతేనే హిట్టా.. ఫ్లాపా అనే అంచనా. ఒకేసారి వేలాది థియేటర్లలో రిలీజ్.. మొదటి నాలుగు రోజులు వీలైనంత ఎక్కువ రేట్లు పెట్టి డబ్బు వచ్చిందా లేదా అనేది లెక్కేసుకోవడం.. ఆనక నెల తిరక్కుండానే ఓటీటీకి సినిమాని నెట్టేయడం. ఇదే పద్ధతి. ఎంత పెద్ద హీరో అయినా.. దాదాపుగా ఇదే లెక్క. ఇప్పుడు ఆ లెక్కను తిరగరాసింది ఒక సినిమా. చిన్న సినిమా అని పక్కకు జరగమన్నా.. పెద్ద సినిమాల మధ్య క్రష్ అయిపోతావు ఆగిపో అన్నా.. కంటెంట్ ఈజ్ కింగ్.. మా సినిమాలో కంటెంట్ ఉంది. ప్రేక్షకులను మూడు గంటల పాటు సీట్లకు అతుక్కుపోయేలా చేసే దమ్ముంది అంటూ సంక్రాంతి బరిలో గట్టిగా నిలబడింది తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హను-మాన్ సినిమా. 

థియేటర్లు దొరకని పరిస్థితిలో అతికష్టం మీద సినిమా మీద నమ్మకంతో ఒకరోజు ముందే ప్రీమియర్ షోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్.. తరువాత కంటెంట్ దమ్ముతో దుమ్ము రేపుతూ కలెక్షన్ల సునామీని సృష్టించింది. అప్పుడెప్పుడో పిల్లాపాపలతో కలిసి సినిమాకి వెళ్లిన పరిస్థితి ఉండేది అని చెప్పుకుంటున్న ఈరోజుల్లో ఇప్పుడు కూడా ఇంటిల్లిపాదినీ థియేటర్లకు లాక్కొచ్చి జై హనుమాన్.. అనిపించారు. ఈ క్రమంలో ఏకంగా 350 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టారని కూడా లెక్కలు చెప్పారు సినీ విశ్లేషకులు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే.. హనుమాన్ సినిమాకి ఎక్కడా టికెట్ రేట్లు పెంచలేదు. ఇంకా కాస్త తక్కువ రేట్లతోనే సినిమాను థియేటర్లలో నడిపించారు. అయినా కానీ.. పెద్ద హీరోల సినిమాలే వంద కోట్ల క్లబ్ లో చేరడానికి ఆపసోపాలు పడుతుంటే, హనుమాన్ ఆడుతూ పాడుతూ వందల కోట్ల డబ్బు.. లక్షలాది ప్రేక్షకుల అభిమానాన్ని మూటగట్టేసుకున్నాడు. 

Also Read: హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్ అదే.. అందుకోసమే ఆరోజు!

ఇప్పుడు మళ్ళీ చరిత్ర తిరగరాశాడు హనుమాన్. అవును.. అప్పుడెప్పుడో.. చూసిన ఏభై రోజుల సినిమా ఫీట్ హనుమాన్ సాధించాడు. అదీకూడా ఏకంగా 150 థియేటర్లలో 50 రోజుల పాటు అప్రతిహతంగా విజయవిహారం చేసింది హనుమాన్ సినిమా. కొన్ని రోజుల క్రితం 300 థియేటర్లలో 30 రోజులు ఆడి సరికొత్త చరిత్రతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన హనుమాన్ ఇప్పుడు అర్థ శతదినోత్సవాన్ని 150 థియేటర్లలో జరుపుకోబోతోంది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోల తరువాత ఏ సినిమా కూడా ఇన్ని థియేటర్లలో 50 రోజులు నిలిచింది లేదు. ముందే చెప్పినట్టు.. సినిమా రావడం హిట్ అయితే.. 30 రోజులు థియేటర్లలో కనిపించడం. తరువాత ఓటీటీ బాట పట్టేయడమే కొన్నేళ్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కానీ, హనుమాన్ సినిమా 50 రోజులు అయినా.. ఇంకా ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఇది కూడా ఈమధ్య కాలంలో ఓ రికార్డ్. 

చిన్న సినిమా.. విడుదలకు థియేటర్లు దొరకని సినిమా.. పెద్ద హీరోల సినిమాల మధ్య వాయిదా వేసుకోమని ఇండస్ట్రీ పెద్దలు సలహా ఇచ్చిన సినిమా.. ఇప్పుడు అనుకున్న తేదీకి విడుదలై.. అందరికీ షాక్ ఇస్తూ ఇప్పటి హీరోలు ఎవరూ అందుకోలేని ఫీట్ సాధించి కంటెంట్ ఉంటె తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంత విజయాన్ని కట్టపెడతారో రుజువు చేసింది హనుమాన్ సినిమా. సినిమా యూనిట్ కష్టం.. విడుదల సమయంలో భరించిన ఇబ్బంది.. అన్నిటినీ మటుమాయం చేసింది ఈ విజయం. ఇప్పటి తరం సినిమాలకు బెంచ్ మార్క్ గా ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ హనుమాన్.. మర్చి 8న ఓటీటీలో రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. శివరాత్రి సందర్భంగా ఓటీటీలో ప్రత్యక్షం కాబోతున్న హనుమాన్ అక్కడ ఎన్ని రికార్డులు సృష్టిస్తాడనేది వేచి చూడాల్సిందే. హనుమాన్ సాధించిన ఈ ఫీట్ కి ఇండస్ట్రీ.. ప్రేక్షకులు అంతా వావ్ అంటూ సినిమా యూనిట్ కి అభినందనలు చెబుతున్నారు. 

హనుమాన్ 50 రోజుల థియేటర్స్ రికార్డ్ విషయాన్ని సినిమా యూనిట్ ట్వీట్ చేసింది.. ఆ ట్వీట్ ఇక్కడ మీరు చూడొచ్చు.. 

Advertisment
Advertisment
తాజా కథనాలు