ACA vs Vihari: విహారిని అందుకే పీకేశాం.. ఏసీఏ సంచలన లేఖ!

ఆంధ్ర జట్టులోకి విహారి రావడం, పోవడంవల్ల స్థానికంగా ఉన్న ఆటగాళ్లు అవకాశాలు కోల్పోతున్నారని, ఆటగాళ్ల తల్లిదండ్రులు ఎన్నోమార్లు అసోసియేషన్‌ దృష్టికి తీసుకువచ్చారంటూ విహారిపై ఏసీఏ ఫైర్ అయ్యింది. దీనిపై మరింత సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
ACA vs Vihari: విహారిని అందుకే పీకేశాం.. ఏసీఏ సంచలన లేఖ!

Hanuma Vihari Row: ప్రస్తుతం క్రికెట్‌ సర్కిల్స్‌లో ఎక్కడ చూసినా హనుమ విహారి వర్సెస్‌ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ గురించే చర్చ జరుగుతుంది. ఇకపై ఆంధ్ర క్రికెట్‌కు ఆడనంటూ విహారి సంచలన ప్రకటన చేయడం.. దీనికి ఏసీఏని బాధ్యుడిని చేయడం రచ్చలేపింది. తిరుపతి వైసీపీ 25వ వార్డు కార్పొరేటర్‌ కొడుకైన ప్రృథ్విరాజ్‌ కారణంగానే తనను కెప్టెన్సీ నుంచి తీసి వేశారని విహారి చెప్పుకొచ్చాడు. ఇది రాజకీయంగా పెను దుమారానికి దారి తీసింది. వైసీపీ ప్రత్యర్థి పార్టీలు జగన్‌ టార్గెట్‌గా నిప్పులు చెరిగాయి. దీనిపై తాజాగా ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్పందించింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, మీడియా మేనేజర్ డి. రాజగోపాల్ జరుగుతున్న పరిణామాలపై క్లారిటీ ఇచ్చారు.

publive-image

రాజగోపాల్‌ లేఖలో ఏముందో కింద చదవండి:

'క్రికెట్ అనేది ఒక జెంటిల్మెన్ గేమ్. క్రికెట్‌ అభివృద్ధి విస్తరణలో దేశంలోని అనేక అసోసియేషన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతిష్టాత్మక ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌కూడా క్రికెట్‌ అభివృద్ధికి విశేషకృషిచేస్తోంది. ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళి, నిర్వహణలో నిర్దేశిత నియమ నిబంధనలు అనుసరిస్తూ అసోసియేషన్‌ ముందుకు సాగుతోంది. ఇందులో పక్షపాతం, రాగద్వేషాలకు ఎక్కడా తావులేదు.

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ను ఉద్దేశిస్తూ హనుమ విహారి ఇంస్టాగ్రామ్ ద్వారా చేసిన ఆరోపణలు మా దృష్టికి వచ్చాయి. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌పై ఇలాంటి ఆరోపణలు విచారకరం. ఆటగాళ్లమధ్య చిన్నచిన్న పొరపొచ్చాలు వచ్చినా వారి మధ్య సమన్వయం కుదిర్చి మంచి ఫలితాలు సాధించడం అన్నది జట్టు మేనేజ్‌మెంట్‌మీద ఉన్న ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగా ఏ ఆటగాడైనా తొందరపడ్డా, లేక మరో రకంగా ప్రవర్తించినా వారి విషయంలో అత్యంత సంయమనంతో వ్యవహరించి జట్టును ఒక్కతాటిపైకి తీసుకురావడానికి మేనేజ్‌మెంట్‌ నిరంతరం ప్రయత్నిస్తుంది. జట్టు ప్రయోజనాలను, క్రికెట్‌ స్ఫూర్తిని పరిగణలోకి తీసుకుని లోలోపలే వాటిని సర్దుబాటు చేయడానికి యత్నిస్తుంది. పరిధి దాటినప్పుడు నిర్దేశిత నియమావళి, పద్ధతులు ప్రకారం వివక్షలేకుండా చర్యలు తీసుకుంటుంది.

publive-image

సీనియర్‌ ఆటగాడు హనుమ విహారి సామాజిక మాధ్యమాల వేదికగా బహిరంగంగా ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌పైనా, తోటి ఆటగాళ్లపైనా విమర్శలు చేసిన నేపథ్యంలో, కొన్ని రాజకీయపక్షాల నాయకులు వాటిని ఆసరాగా తీసుకుని అసోసియేషన్‌ నాయకత్వంపైనా, మేనేజ్‌మెంట్‌పైనా ఆరోపణలు చేసిన నేపథ్యంలో అసోసియేషన్‌ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని వాస్తవ అంశాలను తెలియజేస్తున్నాం.

హనుమ విహారి బాల్యం నుంచి అన్ని ఏజ్ గ్రూప్‌ల్లోనూ హైదరాబాద్ తరఫున ఆడారు. 2017లో ఏపీకి వచ్చి రంజీ ట్రోఫీ ఆడారు. ఇక్కడి నుంచే ఇండియా జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. తర్వాత 2020 సీజన్లో తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. మళ్లీ ఆంధ్ర జట్టుకు తిరిగి వచ్చారు. ఆంధ్రాలో చేరినప్పటి నుండి విహారి తనకు వస్తున్న ఆఫర్లు నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి తరచుగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) అడిగేవారు. హనుమవిహారి విజ్ఞప్తులను పలుమార్లు ఏసీఏ మన్నించింది. కాని ఈసారి ఎన్‌వోసీ ఇవ్వకపోవడంతో, భారతజట్టుకు ఎంపిక కాకపోవడంపట్ల తాను ఫ్రస్టేషన్‌లో ఎమోషన్‌కు గురయ్యానంటూ క్షమాపణలు కోరుతూ, ఆంధ్రా తరపున కొనసాగించాలంటూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ను కోరాడు. జట్టులోకి విహారి రావడం, పోవడంవల్ల స్థానికంగా ఉన్న ఆటగాళ్లు అవకాశాలు కోల్పోతున్నారని, ఆటగాళ్ల తల్లిదండ్రులు ఎన్నోమార్లు అసోసియేషన్‌ దృష్టికి తీసుకు వచ్చారు. కాని, విహారికి ఉన్న అనుభవం దృష్ట్యా జట్టు మేనేజ్‌మెంట్‌ అతన్ని ఇక్కడే కొనసాగించింది. అయినప్పటికీ విహారి సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరం.

publive-image

కెప్టెన్‌గా తననే కొనసాగించాలంటూ జట్టులోని ఆటగాళ్లు అంతా మద్దతు పలికినప్పటికీ తనను తొలగించారని హనుమ విహారి ఆరోపణలు చేశారు. ఈ విషయంలో సంబంధిత ఆటగాళ్లు హనుమ విహారిపై ఆంధ్ర క్రికెట్‌ ఆసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. తమను బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని కొందరు ప్లేయర్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేశారు. వచ్చిన అన్ని ఫిర్యాదులపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్షుణ్ణంగా విచారణ జరిపి వాస్తవాలను బీసీసీఐకి నివేదిస్తుంది.

జట్టులో మరో ఆటగాడైన కె.ఎన్‌.పృథ్విరాజ్‌పైనా హనుమ విహారి ఆరోపణలు చేస్తూ, రాజకీయంగా ప్రభావితం చేసే వ్యక్తి అంటూ ఆరోపణల్లో పేర్కొన్నారు. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఆంధ్రా రంజీ ట్రోఫీలో 17వ సభ్యుడుగా ఉన్న కె.ఎన్. పృథ్వి రాజ్ ఒకే సారి రంజీ జట్టులోకి రాలేదు. బాల్యం నుంచి అండర్ 14 మరియు, 16 ఏజ్ గ్రూప్, అండర్-19, వినూ మన్కండ్ మరియు కూచ్ బిహార్, అండర్ 23, మరియు 25 కల్నల్ సి. కె. నాయుడు ట్రోఫీలో ఆడి చక్కటి ప్రతిభను చూపారు. 2023లో విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో ఆడారు. ఈ ఏడాది జనవరిలో బెంగాల్‌తో ఆడిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో జట్టుకు అప్పుడు కెప్టెన్ గా ఉన్న హనుమవిహారి పృథ్విరాజ్‌ను కాదని గాయపడిన ఇంకొక వికెట్ కీపర్‌ను ఆడించారు. బెంగాల్తో రంజీ మ్యాచ్‌ సందర్భంగా విహారి వ్యక్తిగతంగా ఆ ఆటగాడిని అందరి ముందు దూషించారంటూ మాకు ఫిర్యాదుకూడా వచ్చింది. బాధిత ఆటగాడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు అధికారికంగా ఫిర్యాదు చేశాడు.

అంతేకాకుండా హనుమ విహారి గతంలో ముస్తాక్ అలీ టోర్నీ సందర్భంగా అసభ్య పదజాలం వాడటం, తోటి ఆటగాళ్ల పట్ల అనుచింతంగా ప్రవర్తించడంపట్ల ఆంధ్రా జట్టు మేనేజర్ అసోసియేషన్‌కు ఫిర్యాదుచేశారు. హనుమ విహారి వ్యవహారశైలికారణంగా జట్టులో వర్గ విభేదాలు చోటుచేసుకున్నాయని అందులో పేర్కొన్నారు.

హనుమ విహారి తీరుపై ఫిర్యాదులు రావడంతో జనవరి 2024లో, మొదటి రంజీ ట్రోఫీ మ్యాచ్‌ తర్వాత ఏసీఏ సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ వాసిరెడ్డి చంద్రమౌళి ప్రసాద్ చౌదరి కొత్త కెప్టెన్ ను ప్రతిపాదిస్తూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు ఒక ఇ-మెయిల్‌ పంపారు. దీనికి విహారి స్పందిస్తూ సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి వంద శాతం కట్టుబడి ఉంటానని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు ప్రతిగా మెయిల్‌కూడా పంపారు. ఈ వ్యవహారంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏమాత్రం జోక్యంచేసుకోలేదు. నిర్ణయాధికారాన్ని పూర్తిగా సెలక్షన్‌ కమిటీయే తీసుకుంది.

వాస్తవాలు ఇలా ఉంటే, ప్రతిష్ట్మాతక ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌పై హనుమ విహారి సామాజిక మాధ్యమాల్లో చేసిన ఆరోపణలను వేదికగా చేసుకుని కొన్ని రాజకీయపార్టీలు, ఆ పార్టీలకు చెందిన నాయకులు విమర్శలు చేయడం అత్యంత విచారకరం. క్రికెట్‌పై రాజకీయాలు తగవని వారికి ఏసీఏ సవినయంగా విజ్ఞప్తిచేస్తుంది.'

డి. రాజగోపాల్ మాటల బట్టి చూస్తే విహారిని కెప్టెన్సీ నుంచి తొలగించడానికి కేవలం పృథ్విరాజ్‌ ఎపిసోడ్‌తో పాటు ఇతర ఫ్యాక్టర్లు కూడా ఉన్నాయని అర్థమవుతోంది.

Also Read: ఇవాళ్టి నుంచి ఇంటర్‌ పరీక్షలు స్టార్ట్.. ఆ పొరపాటు చేయవద్దు!

Advertisment
Advertisment
తాజా కథనాలు