Telangana News: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. రోడ్లు, హాస్పిటల్స్ నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు! రోడ్ల నిర్మాణంలో అలసత్వానికి తావు ఉండకూడదని మంత్రి కోమటిరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంతలు లేని రోడ్లను ప్రజలకు అందిస్తామని మాటిచ్చామని అందుకోసం పనులు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. By Bhoomi 31 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి రోడ్ల నిర్మాణంలో ఎక్కడా అలసత్వానికి తావు లేకుండా, నాణ్యతలో రాజీపడకుండా రోడ్లు నిర్మించి.. ప్రమాదరహిత తెలంగాణ దిశగా విస్తృతంగా పనిచేయాలని అధికారులకు ఆదేశాలు చేశారు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy). ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో జాప్యం జరగకుండా ప్రతీ ఒక్క ప్రాజెక్టుకు ఒక సీఈ స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్ గా పెట్టి పనులను మానిటరింగ్ చేయాలని సూచించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పలు సూచనలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంతలు లేని రోడ్లను ప్రజలకు అందిస్తామని మాటిచ్చామని.. అందుకోసం ఇప్పడు చేస్తున్న పనులకంటే మరింత వేగంగా పనులు చేయాలని ఆయన అధికారులకు దిశానిర్ధేశం చేశారు. గత ప్రభుత్వంలో ప్రతిరోజు పదుల సంఖ్యలో ప్రజలు ప్రమాదాల్లో చనిపోయేవారని.. అలాంటి పరిస్థితి తలెత్తకుండా పనిచేయాలని అధికారులకు సూచించారు. పదిహేను (15) రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు వచ్చే నెల మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ని ఢిల్లీకి వెళ్లి విన్నవిస్తామని తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా ఈ విషయం గురించి ప్రధానికి విన్నవించారని ఆయన తెలిపారు. అంతేకాదు.. ఢిల్లీలో నిర్మించ తలపెట్టిన తెలంగాణ భవన్ కు సంబంధించిన భూమి విషయం కొలిక్కి వచ్చిందని.. రేపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ కమీషనర్లు ఇద్దరి సమక్షంలో ఎంఓయూ చేసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇక రాష్ట్రంలో.. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB)లు, రోడ్ అండర్ బ్రిడ్జి (RUB) ల నిర్మాణం గురించి అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి నిర్మాణంలో ఉన్న బసంత్ నగర్ ఫ్లైఓవర్ రెండు నెలల్లో పూర్తి చేసి, ప్రారంభించేలా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం లేదని.. ఎవరైనా నాసిరకమైన పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకు వంతపాడి రోడ్డు మెయింటినెన్స్ చేసే చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల రోడ్ల మెయింటినెన్స్ లేక గుంతలు పడి ప్రజలు రోడ్లపై ప్రయాణించాలంటే భయపడే పరిస్థితికి వచ్చిందని ఆయన అన్నారు. ఇక నల్గొండలో నిర్మించ తలపెట్టిన ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్ లో ప్రజలకు ఇబ్బందులు కాకుండా మంత్రి పలు సూచనలు చేశారు. గత ప్రభుత్వంలోలా భూనిర్వాసితులకు ఇబ్బందులు కలగకుండా.. తగు జాగ్రత్తలు తీసుకొని వారికి నష్టపరిహారం అందించేలా ప్యాకేజీ రూపొందిద్దామని ఆయన సూచించారు. పట్టణానికి దూరంగా రింగ్ రోడ్డు నిర్మిస్తే నిరుపయోగంగా మారుతుందని.. అలా కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా రింగురోడ్డు నిర్మాణం మాస్టర్ ప్లాన్ ఉండాలని ఆయన ఆదేశించారు. ఇవేకాకుండా.. హైదరాబాద్ నలుదిశలా నిర్మిస్తున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్(Tim's Super Specialty Hospital) భవనాల గురించి, వరంగల్ పట్టణంలో నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం పనులు నత్తనడకన సాగుతుండటంపై ఆరాతీసిన మంత్రి.. పనులను నాణ్యతతో పాటు, వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం జరగకుండా ప్రతీ ఒక్క ప్రాజెక్టుకు ఒక సీఈ స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్ గా పెట్టి పనులను మానిటరింగ్ చేయాలని అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ తయారు చేయాలని తెలిపారు. ఏదైన మార్పులు చేర్పులు ఉంటే తాను సూచిస్తానని చెప్పారు. ఇక నల్గొండ, హైదరాబాద్ లో పాత కలెక్టరేట్ల స్థానంలో కొత్తవి నిర్మించాల్సిన అవసరం ఎంతమేరకు ఉందన్నది పరిశీలిస్తున్నామని.. అవసరాన్ని బట్టి కొత్త కలెక్టరేట్లను నిర్మిస్తామని చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లో.. అఖిలపక్షంతో కలిసి శిథిలావస్థకు చేరిన ఉస్మానియా దవాఖాన (Osmania Hospital)ను సందర్శించి.. చేపట్టాల్సిన చర్యలపై నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి సమర్పించి తదుపరి చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. సమావేశానంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి .. ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమై.. రివ్యూ అంశాలను సిఎం దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సెక్రెటరీ శ్రీమతి విజయేంద్ర బోయి, ఈఎన్ సీ రవీందర్ రావు, గణపతిరెడ్డి, సీఈలు మోహన్ నాయక్, సతీష్, మధుసూధన్ రెడ్డి, తిరుమల, జయభారతీ, శారదా, రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా అమృత్ భారత్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే! #telangana-news #komati-reddy-venkat-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి