Gangs of Godavari Review: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి..అందంగా ఉందా..విశ్వక్ మరో హిట్టు కొట్టాడా? 

ఇటీవలే గామి సినిమాతో హిట్ కొట్టి ఊపు మీద ఉన్న విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి మరో హిట్ కొట్టాడా? గోదావరి బ్యాక్ డ్రాప్ లో రాజకీయాలు.. రౌడీయిజం ఆకట్టుకుంటాయా? తెలియాలంటే ఈ పూర్తి రివ్యూ చదివేయాల్సిందే  

New Update
Gangs of Godavari Review: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి..అందంగా ఉందా..విశ్వక్ మరో హిట్టు కొట్టాడా? 

Gangs of Godavari Review: ఈతరం నటుల్లో ఒక ప్రత్యేకత ఉన్న నటుడిగా విశ్వక్ సేన్ ను చెప్పుకోవచ్చు. ఎప్పుడూ ఎదో ప్రయోగం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయోగంలో కూడా మాస్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటాడు. ఇటీవల వచ్చిన పూర్తి ప్రయోగాత్మక చిత్రం గామి బాక్సాఫీస్ వద్ద సంచలనమే సృష్టించింది. అదే ఊపులో ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో ప్రేక్షకులను పలకరించడానికి వచ్చేశాడు విశ్వక్ సేన్. పూర్తి గోదావరి వాతావరణంలో తీసిన ఈ సినిమా ఎలా ఉంది? విశ్వక్ (Vishwak Sen) మరో హిట్ కొట్టాడా? గోదావరి బ్యాక్ డ్రాప్ లో రాజకీయాలను చూపించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రివ్యూలో తెలుసుకుందాం. 

Gangs of Godavari Review

ఇంతవరకూ గోదావరి బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో గోదావరి అందాలను చూపిస్తూ.. గోదావరి జిల్లాల ప్రజల జీవనవిధానంలో పాజిటివ్ కోణాల్ని చూపిస్తూ వచ్చిన సినిమాలే ఎక్కువ. అప్పుడప్పుడు గోదావరి జిల్లాల్లో రాజకీయాలు.. చిన్న చిన్న గ్యాంగ్ వార్స్ టచ్ చేసినా.. ఎక్కువ శాతం మాత్రం వెన్నెల్లో గోదారిని చూపించినవే. ఇటీవల వచ్చిన రంగస్థలం లాంటి సినిమాలు అందుకు మినహాయింపుగా చెప్పుకోవచ్చు. దాదాపుగా అదే విధానంలో వచ్చిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. గోదావరి గలగలల మధ్యలో ఉండే రాజకీయ కల్లోలాలు.. గోదారి గుండెల్లో ఉండే ప్రేమ కథల్లో కనిపించని మరో కోణం ఈ సినిమాలో కనిపిస్తాయి. పాత కథే అయినా.. కొత్త కథనంతో ముందుకు తీసుకువెళ్లాడు దర్శకుడు కృష్ణ చైతన్య. 

Gangs of Godavari Review

కథ ఏమిటంటే.. 
Gangs of Godavari Review: కథగా చెప్పుకోవడానికి కొత్తగా ఏమీ ఉండదు. అనాధ అయిన ఒక యువకుడు.. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బతికేస్తుంటాడు. వేశ్య వృత్తి చేసుకునే ఒక స్నేహితురాలు తప్ప ఎవరూ అతనికి ఉండరు. దొంగతనాలు చేస్తూ ఎన్నాళ్లు అనిపించి బాగా సంపాదించాలని అనుకుంటాడు. ఆ క్రమంలో గోదావరి ఇసుక మాఫియా వెనుక ఎమ్మెల్యే ఉన్నాడని తెలుస్తుంది. జాగ్రత్తగా అతని పంచన చేరి.. క్రమంగా ఎదుగుతాడు. ఈలోపు ఆ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంలో ఉండే ఒకని కూతురుని ప్రేమిస్తాడు. తరువాత ఇద్దరినీ అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే అయిపోతాడు. కానీ, అనుకోకుండా తన మామను హత్య చేస్తాడు. ఆ తరువాత ఈ యువకుని హత్య చేయడానికి సొంత మనుషులే ప్రయత్నిస్తారు. సొంత మనుషులే ఎందుకు ఇతన్ని హత్య చేయాలనుకున్నారు? మరి దాని నుంచి బయటపడ్డాడా? తన తండ్రిని చంపిన భర్తను అతని భార్య క్షమించిందా? అతని స్నేహితురాలు ఏమైంది? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ జి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సమాధానం చెబుతుంది. 

publive-image

ఎలా ఉందంటే..
సినిమాలో పాత కథను కొత్తగా చూపించే ప్రయత్నం బానే కుదిరింది. దానికోసం ‘కత్తి కట్టడం’ అనే పదబంధాన్ని బాగా వాడుకున్నాడు దర్శకుడు. సినిమా దానితోనే మొదలు పెడతాడు. ఒక వ్యక్తిని చంపాలని అనుకున్నలంక గ్రామాల వారు అక్కడి గుహలో అమ్మవారికి మొక్కి ఎవరిని చంపాలని అనుకుంటున్నారో వారి పేరు రాస్తారు. దీనినే కత్తి కట్టడం అంటారు. ఈ పాయింట్ బేస్ గా కథనాన్ని నడిపించాడు. అయితే, ఒక రౌడీ ఎమ్మెల్యే అయిపోవడం.. ఎమ్మెల్యే అయినా కూడా రౌడీలానే బిహేవ్ చేయడం.. లాజిక్ లేకుండా సాగినట్టు కనిపిస్తుంది. ఇక వాస్తవికతకు దగ్గరగా అన్నట్టుగా హింసను చాలా ఎక్కువ చూపించడం కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. 

publive-image

ఎవరెలా చేశారంటే..
Gangs of Godavari Review: అనాధగా.. రౌడీగా.. ఎమ్మెల్యేగా విశ్వక్ సేన్ అదరగొట్టేశాడు. నూరుశాతం తన పాత్రకు జీవం పోశాడు. గోదావరి యాస కోసం పడ్డ ప్రయాస కొంచెం ఇబ్బంది పెట్టినా.. ఓవరాల్ గా విశ్వక్ చాలాబాగా చేశాడు. వేశ్యగా.. హీరో స్నేహితురాలిగా అంజలి (Anjali) బాగా చేసింది. హీరోయిన్ గా నేహా శెట్టి (Neha Shetty) అందంగా చేసింది. ఇక నాజర్‌, సాయి కుమార్‌ హైపర్‌ ఆది వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. 

publive-image

టెక్నీకల్ గా ఎలా ఉందంటే..
 గోదావరి బ్యాక్ డ్రాప్.. అదీ 90ల్లో కథ అంటే ఫొటోగ్రఫీకి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది కదా. అనిత్ మాదాడి కెమెరా పనితనం బావుంది. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ సంగీతం సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ ఫర్వాలేదు అన్నిస్థాయిలో ఉంది. నిర్మాణ విలువలు కూడా బావున్నాయి. ఎక్కడా రాజీపడకుండా సినిమా తీసినట్టు అర్ధం అవుతుంది. 

publive-image

మొత్తమ్మీద గోదారి అందాలు చూద్దామని అనుకుని సినిమాకి వెళితే నిరాశ తప్పదు. యాక్షన్ ప్యాక్.. హింసాత్మక మూవీ చూడటం ఇష్టపడే వారికి సినిమా కనెక్ట్ అవుతుంది. లాజిక్ వదిలేసి.. సినిమా చూస్తే బాగానే అనిపిస్తుంది. 

చివరగా ఒక్క మాట.. సినిమా చూస్తున్నపుడు కొన్ని హిట్ సినిమాలు గుర్తుకు వస్తే మాత్రం అది మీ తప్పుకాదు. 

గమనిక: ఇక్కడ ఇచ్చిన రివ్యూ కేవలం సినిమాపై  రచయిత వ్యక్తిగత అభిప్రాయంగానే చూడాలి. ఇది సినిమా చూడమని కానీ.. వద్దని కానీ సూచించడం లేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు