Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్‌..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది.

New Update
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్‌..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది మార్చి 21న లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఢిల్లీలోని తీహార్‌ జైల్లో ఉంటున్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జూన్ 1 వరకు కొన్ని రోజుల పాటు మధ్యంతర బెయిల్‌పై ఆయన బయటికి వచ్చారు. బెయిల్ గడువు ముగిశాక మళ్లీ జైలు అధికారులకు లొంగిపోయారు. అయితే తాజాగా ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేయడం సంచలనం రేపుతోంది. తీహార్‌ జైలు నుంచి ఆయన రేపు (శుక్రవారం) విడుదలయ్యే అవకాశం ఉంది.

Also Read: తక్షణమే నీట్ పరీక్ష రద్దు చేయాలి.. రాహుల్ గాంధీ డిమాండ్

ఈడీ విజ్ఞప్తి తిరస్కరణ

లిక్కర్‌ కేసులో తనకు సాధారణ బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్‌ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై గురువారం విచారణ జరిగిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. ఆ తర్వాత మళ్లీ కోర్టు వెకేషన్ బెంచ్‌ జడ్జి న్యాయ బిందు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. బెయిల్‌ బాండుపై సంతకం చేసేందుకు వీలుగా 48 గంటలపాటు స్టే విధించాలని ఈడీ కోర్టును కోరింది. దీంతో హైకోర్టులో సవాలు చేసేందుకు వీలు కలుగుతుందని తెలిపింది. కానీ న్యాయస్థానం ఈడీ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఎట్టకేలకు ఆయనకు బెయిల్ మంజూరు కావడంతో ఆప్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కస్టడీ పొడిగింపులు

ఇదిలాఉండగా.. లిక్కర్‌ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ అరెస్టవ్వడం ఇటీవల దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన్ని ఢిల్లీలోని తీహార్‌ జైలుకు తరలించారు. రౌస్‌ అవెన్యూ కోర్టులో ఆయన బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేసినప్పటి నుంచి దీనిపై విచారణ జరుగుతూనే వస్తోంది. ఇప్పటికే చాలాసార్లు ఆయన కస్టడీని కూడా పొడిగిస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో కేజ్రీవాల్‌ అయినప్పటికీ తన పదవికి ఆయన రాజీనామా చేయలేదు. జైలు నుంచే పరిపాలన అందించారు. అయితే మధ్యంతర బెయిల్ సందర్భంగా సీఎంగా విధులు నిర్వహించకూడదని కోర్టు షరతు విధించింది. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ రావడంతో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.

తర్వాత ఏం చేయబోతున్నారు ?

లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యమంతర బెయిల్‌పై విడుదలైన కేజ్రీవాల్‌ వచ్చి రావడంతోనే బీజేపీ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే.. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల సీఎంలు కూడా అరెస్టు అవుతారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. అయితే ఇప్పుడు కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చిన నేపథ్యంలో తర్వాత ఆయన ఏం చేయబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.

కవిత సంగతేంటి ?

మరోవైపు ఇదే కేసులో.. బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఇప్పుడు తీహార్‌ జైల్లోనే ఉంటున్నారు. ఇటీవల కవిత కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ.. ఆమెకు బెయిల్ లభించలేదు. తనను అక్రమంగా అరెస్టు చేశారని.. ఇది మనీలాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసని అప్పట్లో కవిత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇప్పుడు ఆమె కస్టడీని కూడా కోర్టు పొడిగిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు కేజ్రీవాల్‌కు బెయిల్‌ వచ్చిన నేపథ్యంలో త్వరలోనే కవిత పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆమెకు కూడా త్వరలోనే బెయిల్ వచ్చే అవకాశం ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు.

Also read: నీట్‌ పరీక్షలో అక్రమాలను సహించేది లేదు: ధర్మేంద్ర ప్రధాన్

Advertisment
Advertisment
తాజా కథనాలు