రూ. 10వేల కోట్ల నష్టం.. వరుణుడి కోపానికి ఉత్తరాది రాష్ట్రాలు విలవిల

హిమాచల్‌ ప్రదేశ్‌తో పాటు ఉత్తరాది రాష్ట్రాలపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌లో వరుస వరదల కారణంగా దాదాపు 10వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్టు అంచనా. మరోవైపు యమున నది డేంజర్ లెవల్ దాటి ప్రవహిస్తోండటంతో ఢిల్లీ వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

New Update
రూ. 10వేల కోట్ల నష్టం.. వరుణుడి కోపానికి ఉత్తరాది రాష్ట్రాలు విలవిల

Floods in northern states: సుందరమైన పర్వతాలకు నిలయమైన హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా ఈ ఏడు రోజుల్లోనే దాదాపు 60 మంది మరణించారు. వారం నుంచి భారీ వర్షాలతో హిమాచల్‌ ప్రదేశ్‌ అతలాకుతలమవుతోంది. ఈ వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి ఒక సంవత్సరం పడుతుందని ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు చెప్పారు. 30 రోజుల వ్యవధిలో సంభవించిన భారీ వర్షాలతో సుమారు రూ. 10,000 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు .

ఉత్తరభారతాన్ని భారీ వర్షాలు మరోసారి వణికిస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు ఉప్పొంగుతున్నాయి. యమునా నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. రానున్న 24 గంటల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ-ఐఎండీ అంచనా వేసింది. దీంతో పాటు ఆయా ప్రాంతాలకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటికే 65 మందికి పైగా మరణించినట్లు సమాచారం. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కొండ చరియలు విరిగిపడటం వల్ల ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది. మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి.

పొంగుతున్న యమున:
యమున నది డేంజర్ లెవల్ దాటి ప్రవహిస్తోండటంతో ఢిల్లీ వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే యమున నది ప్రాజెక్టుపై ఉన్న గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు హర్యానా హత్నీకుండ్ బ్యారేజీ నుంచి 30 వేల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో దిల్లీలో మరోసారి వరదలు వచ్చే చాన్స్ ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. యమునా నదికి మరింత వరద నీరు వచ్చి చేరితే పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. దీంతో అక్కడ ప్రజల్ని సురక్షితప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

మరో నాలుగు రోజులు ఇంతే:
భారీగా కొండచరియలు విరిగిపడిన హిమాచల్‌ ప్రదేశ్‌ శిమ్లాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 21 మృతదేహాలను వెలికి తీసినట్లు సమాచారం. డ్యామ్ లు పొంగిపొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలు, గ్రామాలను వరదలు ముంచెత్తాయి. కాంగ్రాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల్లో చిక్కుకుని ఉన్న వారిని రక్షించేందుకు హిమాచల్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. మరోవైపు ఉత్తరాఖండ్‌ లోని రుద్రప్రయాగ్‌లోని బంటోలిలో కాలినడక వంతెన కూలిపోయింది. దీంతో రుద్రప్రయాగ్‌కు వెళుతున్న దాదాపు 200 మంది యాత్రికులు, స్థానికులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో వచ్చే రెండో రోజులు, ఉత్తరాఖండ్ లో మరో నాలుగు రోజులు పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు