Dark Patterns : ఆన్‌లైన్ బ్యాంకింగ్ లో చూస్తూ..చూస్తూనే మోసపోతాం.. ఇలా!

ఆన్‌లైన్ బ్యాంకింగ్ లో ఆన్‌లైన్ షాపింగ్ లో లానే డార్క్ ప్యాట్రన్స్ తో మోసపోతాం. మనకు తెలిసీ.. అందులో చిక్కుకుపోతాం. ఈ డార్క్ ప్యాట్రన్స్ అంటే ఏమిటి? వీటితో ఎలా మోసపోతాం? మోసపోకుండా ఎలా బయటపడాలి? తెలుసుకోవడానికి టైటిల్ పై క్లిక్ చేసి ఆర్టికల్ ఫాలో అయిపోండి. 

New Update
Dark Patterns : ఆన్‌లైన్ బ్యాంకింగ్ లో చూస్తూ..చూస్తూనే మోసపోతాం.. ఇలా!

Dark Patterns : డార్క్ ప్యాట్రన్స్(Dark Patterns).. అంటే మనం ఏదైనా ఒక వస్తువు కొనాలనుకున్నపుడు లేదా ఏదైనా సర్వీస్ ను ఉపయోగించుకున్నపుడు ఆయా సంస్థలు మనల్ని తప్పుదారి పట్టించే పద్ధతులు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. మీరు ఒక వస్తువు ఆన్ లైన్ లో కొనాలని అనుకుంటున్నారని అనుకుందాం. అప్పుడు మీరు ఆ వస్తువు కోసం ఆన్ లైన్ షాపింగ్ సైట్(Shopping Site) లో వెతుకుతారు. అప్పుడు మీకు మొదట ఒక ధర కనిపిస్తుంది. తీరా మీరు పేమెంట్ దగ్గరకు వచ్చేసరికి ధరలో తేడా కనిపిస్తుంది. లేదా మీరు ఆ వస్తువు కొనాలని ఫిక్స్ అయి పేమెంట్ చేసే సమయంలో ఆ వస్తువు స్పెసిఫికేషన్స్ మారిపోవచ్చు. ఇలా ఆన్ లైన్ షాపింగ్(Online Shopping) లో జరిగే మోసాలను డార్క్ ప్యాట్రన్స్ అంటారు. ఈ డార్క్ ప్యాట్రన్స్ మోసం ఆన్ లైన్ షాపింగ్ లోనే కాదు.. బ్యాంకింగ్ రంగంలోనూ జరుగుతుందని చెబుతున్నారు. 

మీరు మీ పర్శనల్ లోన్ ప్రీ క్లోజ్ చేయాలనీ అనుకున్నారు. ఆ లోన్ ఆన్ లైన్ లోనే తీసుకున్నారు. కానీ, దానిని క్లోజ్ చేయడానికి ఆన్ లైన్ లో వీలుపడకపోవచ్చు. మిమ్మల్ని బ్యాంకుకు రావాలని సూచన అందవచ్చు. లోన్ ఇచ్చినపుడు సులభంగా ఆన్ లైన్ లో ఇచ్చి.. క్లోజ్ చేయడానికి బ్యాంకుకు రమ్మనడం ద్వారా మీరు లోన్ క్లోజ్ చేసే విధానంలో అడ్డంకులు సృష్టించడం చేస్తారు. మీరు బ్యాంకుకు వెళ్లే పరిస్థితి లేకపోతే, ఆ లోన్ ఈఎంఐలు కడుతూ మీరు లోన్ ను కంటిన్యు చేస్తారు. లేదా బ్యాంకుకు వెళ్లిన తరువాత అక్కడ సిబ్బంది మిమ్మల్ని లోన్ కంటిన్యు చేసేవిధంగా ప్రోత్సహిస్తారు. పెరుగుతున్న డిజిటల్ బిజినెస్ పరిస్థితుల్లో కస్టమర్ల నిర్ణయాలను ప్రభావితం చేయడానికి బ్యాంకులు ఇలా డార్క్ ప్యాట్రన్స్(Dark Patterns) ఉపయోగించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ కొంతకాలం క్రితం ఒక సమావేశంలో చెప్పారు. ఇప్పుడు ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌లు కస్టమర్లను ఎలా డార్క్ ప్యాట్రన్స్ ద్వారా మోసగించే అవకాశం ఉందో చూద్దాం. 

మోసం ఇలా.. 
మనం పర్శనల్ లోన్(Personal Loan) తీసుకునేటప్పుడు వడ్డీ రేటు, చెల్లించే సామర్ధ్యం, లోన్ రీకలెక్ట్ విధానం వంటి వాటిని బ్యాంకులు క్లియర్ గా చెబుతాయి. కానీ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్స్ లో తీసుకునే లోన్ వడ్డీరేటు మాత్రమే చెబుతారు. ఆ లోన్ పై వచ్చే ఖర్చులు, విధించే అదనపు ఫీజలు వంటి వాటిని వివరించరు. కస్టమర్ కు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా 8% వడ్డీకే లోన్ ఇస్తున్నట్టు చెబుతారు. కానీ, లోన్ తీసుకున్న తరువాత మనం వివిధ నిబంధనలు, షరతుల పేరుతో 36% వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఈ విషయాన్ని ఎప్పుడూ ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్స్(Dark Patterns) స్పష్టంగా చెప్పవు. 

డ్రిప్ ప్రైసింగ్ లేదా హిడెన్ ఛార్జీ(Hidden Charges) ల గురించి తరచుగా వచ్చే కంప్లైంట్స్ కూడా ఒకరకమైన డార్క్ ప్యాట్రన్స్(Dark Patterns) గానే చెప్పవచ్చు. బ్యాంక్ తన కస్టమర్ కు ప్రీమియం క్రెడిట్ కార్డు అప్రూవ్ అయినట్టు చెబుతుంది. అది కూడా పూర్తి ఉచితం అనీ, ఫీజూలు ఏమీ లేవనీ చెప్పి ఆకర్షిస్తుంది. కానీ, నెలవారీ బిలు వచ్చినపుడు ఫీజులు భారీగా ఉంటాయి. ఇది ఆన్ లైన్ షాపింగ్ లో డిప్ ప్రైసింగ్ విధానం లాంటిది. అక్కడ వస్తువు తీసుకుని బిల్లు చేసే సమయంలో ధర పెరిగిపోతుంది. 

కస్టమర్స్ ఏమంటున్నారంటే..
ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో డార్క్ ప్యాటర్న్‌(Dark Patterns)ల కేసులు ఎంతగా పెరిగిపోయాయో లోకల్‌సర్కిల్స్ సర్వే నుండి మనం అర్థం చేసుకోవచ్చు. దేశంలోని 363 జిల్లాల్లో నిర్వహించిన ఈ నమూనా సర్వేలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్న 63% మంది ప్రజలు ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి దాచిన ఛార్జీలు లేదా డ్రిప్ ప్రైసింగ్‌ను ఎదుర్కొన్నారని చెప్పారు. 

అదేవిధంగా, 41 శాతం మంది వినియోగదారులు ఇంటర్‌ఫేస్ జోక్యాన్ని ఎదుర్కొన్నారని చెప్పారు. ఇంటర్‌ఫేస్ జోక్యం అంటే.. మనం ఏదైనా వస్తువు కొనాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఆన్ లైన్ బ్యాంకింగ్ సిబ్బంది నుంచి ఫోన్ వస్తుంది. మనం తీసుకోవాల్సిన వస్తువుతో పాటు అదనంగా మరో వస్తువు తీసుకోమని బలవంతం చేసి.. దానిని అంటగడుతారు. సర్వీసుల్లోనూ ఇలానే జరుగుతుంది. మీరు పర్సనల్ లోన్ తీసుకుంటుంటే, ఆ ప్రాసెస్ జరుగుతుండగా.. ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ తీసుకోవాలంటూ మిమ్మల్ని ప్రలోభ పెట్టె ప్రయత్నం జరుగుతుంది. దీనినే ఇంటర్‌ఫేస్ జోక్యం అంటారు. ఇది కూడా డార్క్ ప్యాట్రన్(Dark Patterns) కిందికే వస్తుంది. 

అలాగే, 32 శాతం మంది వినియోగదారులు తాము సబ్‌స్క్రిప్షన్ ట్రాప్‌లను అనుభవించినట్లు చెప్పారు. వినియోగదారులు కొత్త ఆన్‌లైన్ ప్రోడక్ట్ లేదా సర్వీస్ కోసం సులభంగా సైన్ అప్ చేసినప్పుడు సబ్‌స్క్రిప్షన్ ట్రాప్‌లు జరుగుతాయి.  అంటే, అదనపు సర్వీసులు కూడా దానికి యాడ్ అయిపోతాయి. అయితే ఆ సర్వీసుల కోసం ఛార్జీలు విధించడం జరుగుతుంది. ఒకవేళ మీరు దానిని చెక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకోవాలన్నా ఆన్ లైన్ లో చేసుకోలేరు. దానిని క్లోజ్ చేయాలంటే  కచ్చితంగా బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. 

ఇవే కాకుండా,  బైట్ అండ్  స్విచ్ కేసులు 39% వినియోగదారులకు అనుభవంలోకి వచ్చినట్టు చెప్పారు.  ఇందులో, లోన్‌ను ఆఫర్ చేస్తున్నప్పుడు ఆకర్షణీయమైన వడ్డీ రేటు చూపిస్తారు. కానీ, వాస్తవంగా లోన్ తీసుకునే సమయానికి వడ్డీ రేట్లు భిన్నంగా మారుతాయి. 

Also Read: ప్రభుత్వానికి డబ్బే డబ్బు.. పెరిగిన డైరెక్ట్ టాక్స్ వసూళ్లు.. ఆ లెక్కలివే!

ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి?
పెరుగుతున్న సమస్య తెలిసింది కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఇది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. డార్క్ ప్యాటర్న్‌(Dark Patterns) ల విషయంలో ప్రభుత్వం నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఈ సమస్య తగ్గడం లేదు. గత ఏడాది నవంబర్‌లో, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అంటే CCPA వినియోగదారుల హక్కులను కాపాడేందుకు గాడ్జెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనికి "డార్క్ ప్యాట్రన్స్ నివారణ - నియంత్రణ కోసం మార్గదర్శకాలు" అని పేరు పెట్టారు. దీని పరిధిలో భారతదేశంలో వస్తువులు - సేవలను అందించే అన్ని ప్లాట్‌ఫారమ్‌లు, ప్రకటనదారులు, విక్రేతలు ఉన్నారు.

ఎక్కడ - ఎలా ఫిర్యాదు చేయాలి?
ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఈ చీకటి విధానాలకు(Dark Patterns) మీరు బాధితులుగా మారకుండా చూసుకోవడానికి, మీరే అప్రమత్తంగా ఉండాలి. లోన్ తీసుకునేటప్పుడు అన్ని ఛార్జీలను చెక్ చేసుకోండి.  లోన్‌పై అసలు వడ్డీ ఎంత ఉంటుంది, వార్షిక శాతం రేటు అంటే APR గురించి వ్రాతపూర్వక సమాచారం కోసం అడగండి.  ఎందుకంటే ఇందులో వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజుతో సహా అన్ని ఖర్చులు ఉంటాయి. ఎక్కడైనా సైన్ అప్ చేయడానికి ముందు, తప్పనిసరిగా అన్ని నిబంధనలు- షరతులను చదవండి. కొన్నిసార్లు షరతులతో పాటు స్టార్ మార్క్ ఉంటుంది.. దీన్ని ఖచ్చితంగా గమనించండి. మీరు డార్క్ ప్యాట్రన్ కు లక్ష్యంగా మారినట్లయితే, మీరు దాని గురించి కూడా ఫిర్యాదు చేయవచ్చు. మీరు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్‌కు 1915 నంబర్‌కు డయల్ చేయడం ద్వారా లేదా వాట్సాప్ ద్వారా 8800001915కు టెక్స్ట్ ఫిర్యాదును పంపడం ద్వారా మీ సమస్యను ఫిర్యాదు చేయవచ్చు.

Advertisment
Advertisment
తాజా కథనాలు