vijayawada : విజయవాడలో  ఘోరం: నర్సును రెండో పెళ్లి చేసుకుని రెండుసార్లు అబార్షన్  చేసిన డాక్టర్!

వైద్యో నారాయణో హరిః అంటారు.. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఓ డాక్టర్ దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి, ఒక నర్సును ప్రేమ పేరుతో నమ్మించి, రెండో పెళ్లి చేసుకుని మోసం చేసిన ఉదంతం విజయవాడలో వెలుగుచూసింది.

New Update
bhaskar prakash

వైద్యో నారాయణో హరిః అంటారు.. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఓ డాక్టర్ దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి, ఒక నర్సును ప్రేమ పేరుతో నమ్మించి, రెండో పెళ్లి చేసుకుని మోసం చేసిన ఉదంతం విజయవాడలో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదుతో సదరు డాక్టర్‌తో పాటు అతని మొదటి భార్య, తల్లిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు తీవ్రమైన సెక్షన్ల కింద మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

పోలీసుల కథనం ప్రకారం.. నూజివీడు ప్రాంతానికి చెందిన ఒక యువతి గత తొమ్మిదేళ్లుగా విజయవాడలోని వేర్వేరు ఆసుపత్రుల్లో నర్సుగా పనిచేస్తోంది. 2018లో నగరంలోని సన్‌రైజ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న సమయంలో, అక్కడ డాక్టర్‌గా ఉన్న పామర్తి భాస్కర్ ప్రకాష్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించిన డాక్టర్ శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె రెండుసార్లు గర్భం దాల్చగా.. భాస్కర్ ప్రకాష్ బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని ఆమె గట్టిగా నిలదీయడంతో 2024 ఏప్రిల్ 2న ఒక ఇంట్లో ఆమె మెడలో తాళి కట్టి, దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి ఇద్దరూ కలిసే ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె మూడో నెల గర్భవతి.

నందిని అనే మహిళతో వివాహం

గత కొన్ని రోజులుగా డాక్టర్ భాస్కర్ ప్రకాష్ ఆమె వద్దకు రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు ఆరా తీసింది. అప్పుడే ఆమెకు అసలు నిజం తెలిసింది. డాక్టర్ భాస్కర్ ప్రకాష్‌కు ఇదివరకే వేములకొండ ఫణి నందిని అనే మహిళతో వివాహమైందని, వారికి ఒక కుమార్తె కూడా ఉందని తెలుసుకుని షాక్‌కు గురైంది. దీనిపై నిలదీసేందుకు బాధితురాలు డాక్టర్ మొదటి భార్య నందినిని, అతని తల్లిని సంప్రదించింది. అయితే, న్యాయం చేయాల్సింది పోయి.. సదరు డాక్టర్ తల్లి, మొదటి భార్య కలిసి బాధితురాలిని కులం పేరుతో దూషిస్తూ, తీవ్రంగా బెదిరించారు.

తాను ఘోరంగా మోసపోయానని గ్రహించిన సదరు నర్సు విజయవాడ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినది కావడంతో పోలీసులు డాక్టర్ భాస్కర్ ప్రకాష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు మోసం, బలవంతపు అబార్షన్ వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఈ కిలాడీ డాక్టర్ వ్యవహారంపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

Advertisment
తాజా కథనాలు