/rtv/media/media_files/2026/06/06/mother-2026-06-06-15-06-48.jpg)
బెంగళూరులో దారుణం జరిగింది. ఒక కన్నతల్లి తన ప్రియుడితో కలిసి ఐదేళ్ల సొంత కూతురిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారి చనిపోయిన దాదాపు మూడు నెలల తర్వాత, ఆ పాప తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణమైన ఉదంతం బయటపడింది. వెన్నిల అనే ఐదేళ్ల చిన్నారి గత మార్చి 24న మరణించింది. అయితే తన భార్య ప్రియాంక, ఆమె ప్రియుడు మోహన్ కలిసి పాపను చంపేశారని ఆరోపిస్తూ తండ్రి ప్రవీణ్ ఆలస్యంగా పోలీసులను ఆశ్రయించడంతో ఈ హత్య ఉదంతం అందరికీ తెలిసింది.
ఇంతకు ఏం జరిగిందంటే..
దావణగెరెకు చెందిన ప్రవీణ్‌కు, బెంగళూరుకు చెందిన ప్రియాంకతో 2007లో వివాహం జరిగింది. ఈ దంపతులకు 17 ఏళ్లు, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కొన్నేళ్ల క్రితం ప్రియాంకకు తన పాత కాలేజీ స్నేహితుడు మోహన్ మళ్లీ పరిచయమయ్యాడు. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, చివరికి సహజీవనం చేయడం ప్రారంభించారు. ఈ అక్రమ సంబంధం కారణంగా భర్త ప్రవీణ్‌తో గొడవలు జరిగాయి, దీనితో ప్రియాంక తనకు విడాకులు కావాలని భర్తను గట్టిగా కోరింది. ఆ తర్వాత భర్తను వదిలేసి ప్రియుడు మోహన్‌తో కలిసి ఉంటున్న ప్రియాంక, తన చిన్న కూతురు వెన్నిలను కూడా తనతోనే ఉంచుకుంది.
మార్చి 24న చిన్నారి అకస్మాత్తుగా చనిపోవడంతో, పాప మరణంపై కుటుంబ సభ్యులు ప్రియాంకను ప్రశ్నించారు. ఆ సమయంలో ఆమె ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతూ రకరకాల కారణాలు చెప్పింది. ఒకసారి పాపకు బిర్యానీ తినిపించానని చెప్పగా, మరోసారి పాపకు ఐస్‌క్రీమ్ తినిపించి ఎయిర్ కండిషన్ ఆన్ చేసి ఉన్న కారులో నిద్రపుచ్చి వదిలేశానని చెప్పింది. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి పాప చనిపోయి ఉందని ఇంకో అబద్ధం చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది.
పాప మరణంపై అనుమానం వచ్చిన తండ్రి ప్రవీణ్, కూతురి పోస్ట్‌మార్టం రిపోర్టును విదేశాల్లో డాక్టర్‌గా పనిచేస్తున్న తన బంధువుకు పంపించి చూపించాడు. ఆ రిపోర్టును పరిశీలించిన డాక్టర్ ఇచ్చిన సమాచారంతో ప్రవీణ్‌కు గట్టి అనుమానం వచ్చింది. పాపపై దాడి చేసి, శ్వాస ఆడకుండా ముక్కు, నోరు నొక్కి ఊపిరాడకుండా చేసి చంపేశారని నమ్ముతూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు మోహన్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తల్లి ప్రియాంక పరారీలో ఉండటంతో ఆమె కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా, ఈ కేసులో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక కోసం వేచి చూస్తున్నామని, కేసుపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
Follow Us