Uttar Pradesh : భర్తను చంపి తగులబెట్టిన భార్య.. గుట్టురట్టు చేసిన క్యూఆర్ కోడ్!

ఒక మిస్సింగ్ కేసు, సగం కాలిన మృతదేహం, మద్యం బాటిళ్లపై ఉన్న క్యూఆర్ కోడ్‌లు.. వీటన్నిటి వెనుక ఉన్న ఒక భయంకరమైన కుట్రను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఛేదించారు.

New Update
up murder

ఒక మిస్సింగ్ కేసు, సగం కాలిన మృతదేహం, మద్యం బాటిళ్లపై ఉన్న క్యూఆర్ కోడ్‌లు.. వీటన్నిటి వెనుక ఉన్న ఒక భయంకరమైన కుట్రను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఛేదించారు. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను అత్యంత కిరాతకంగా అంతమొందించిన ఓ మహిళ ఉదంతం ఆగ్రాలో కలకలం రేపింది.

ఏప్రిల్ 1వ తేదీ రాత్రి ఆగ్రాలోని సైయాన్ ప్రాంతంలో సగం కాలిన స్థితిలో ఉన్న ఒక మృతదేహం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. మృతదేహం ముఖం గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది, కానీ చేతిపై ఉన్న 'లోకేంద్ర' అనే పేరు గల టాటూ (పచ్చబొట్టు) ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మరుసటి రోజే లోకేంద్ర సోదరుడు తన తమ్ముడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు మలుపు తిరిగింది.

ఈ మిస్టరీని ఛేదించడానికి పోలీసులు ఐదు బృందాలను రంగంలోకి దించారు. ఘటనా స్థలంలో దొరికిన కొన్ని కాగితం ముక్కలు, ఖాళీ మద్యం బాటిళ్లు పోలీసులకు కీలక ఆధారాలుగా మారాయి. అక్కడున్న కాగితాలను పరిశీలించగా, ఆ ప్రాంతంలోని ఒక పండ్ల వ్యాపారి వాడుతున్నవని తేలింది. మద్యం బాటిళ్లపై ఉన్న క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయగా, ఆ మద్యం ఎక్కడ కొన్నారో తెలిసింది. దాని ఆధారంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో అసలు నిందితులు చిక్కారు.

ప్రియుడితో కలిసి భార్య స్కెచ్

పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. లోకేంద్ర భార్యకు మహేష్ ప్రజాపతి అనే వ్యక్తితో చాలా కాలంగా అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం ఇటీవల లోకేంద్రకు తెలియడంతో భార్యను నిలదీశాడు. దీంతో తమ దారికి అడ్డుగా ఉన్నాడని భావించి, అతడిని చంపేయాలని భార్యాప్రియులిద్దరూ ప్లాన్ వేశారు. ఏప్రిల్ 1న లోకేంద్ర ఇంటి నుంచి బయటకు రాగానే అతని భార్య ప్రియుడు మహేష్‌కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. 

దారిలో లోకేంద్రను కలిసిన మహేష్, తన స్నేహితుడు ధర్మవీర్‌తో కలిసి మందు తాగుదామని ఆహ్వానించాడు. పరిచయం ఉన్న వ్యక్తి కావడంతో లోకేంద్ర వారితో వెళ్ళాడు. పొలాల్లో మద్యం తాగుతుండగా, మహేష్ మరియు ధర్మవీర్ కలిసి లోకేంద్ర గొంతు నులిమి స్పృహ తప్పేలా చేశారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి, గోధుమ గడ్డి కప్పి నిప్పు పెట్టారు.

టెక్నికల్ సాక్ష్యాలు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా లోకేంద్ర భార్య, ఆమె ప్రియుడు మహేష్, అతడి స్నేహితుడు ధర్మవీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతి తక్కువ సమయంలోనే కేసును ఛేదించిన పోలీస్ బృందాలను డిప్యూటీ కమిషనర్ ఆదిత్య కుమార్ అభినందించారు. ప్రస్తుతం నిందితులు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు